జూబ్లీ ఎన్నిక.. స్పీడ్ పెంచిన కాంగ్రెస్..

Update: 2025-10-24 09:31 GMT

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. విజయమే లక్ష్యంగా సాగుతున్న ప్రచారంలో మరింత వేగం పెంచాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.. పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి డివిజన్‌కు ఇద్దరు మంత్రుల చొప్పు మొత్తం 13 మంది మంత్రులు ప్రచార బాధ్యతలను స్వీకరించాలని ఆయన తెలిపినట్లు సమాచారం. జూబ్లీహిల్స్‌లో గెలిచి తెలంగాణ రాజకీయాల్లో తమ పట్టు చూపించుకోవాలని బీఆర్ఎస్, ఆ నియోజకవర్గంలో పాగా వేయాలని కాంగ్రెస్ హోరాహోరీగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని మహేష్ కుమార్ ఆదేశించారు. మొత్తం 13 మంది మంత్రులు రంగంలోకి దిగాలని, ఒక్కో సహాయకులుగా నలుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఆరుగురు కార్పొరేషన్ ఛైర్మన్లు ఉంటారని ఆయన వివరించారు. ప్రతి బూత్ బాధ్యతను జిల్లా స్థాయి నేతకు అప్పటించినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా ప్రతి రోజూ చేసిన ప్రచార కార్యక్రమాలను గాంధీ భవన్ వార్ రూమ్‌కు పంపాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారని పార్టీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం.

గెలుపు ఖాయం.. : బీఆర్ఎస్

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఇందులో ఎలాగైనా విజయం సాధించాలని ప్రధాన పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. గురువారం ప్రత్యేకంగా సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. అందులో ఇప్పటికే తమ అభ్యర్థి సునీత విజయం ఖాయమైందని, ప్రజల తమ వైపే మొగ్గు చూపుతున్నారని అన్నారు. కాంగ్రెస్ దుష్ట పాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు.

మరోవైపు బీజేపీ కూడా ప్రచార రథాలను పరుగులు పెట్టిస్తోంది. లంకల దీపక్ రెడ్డి తరుపున విస్తృత ప్రచారం చేయిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ గుల్ల గుల్ల అయిందని ప్రచారంలో భాగంగా బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని, అప్పుడే అభివృద్ధఇలో తెలంగాణ కొత్త పుంతలు తొక్కుతుందని బీజేపీ నాయకులు చెప్తున్నారు. దీంతో జూబ్లీ ఎన్నిక రసవత్తరంగా మారుతోంది.

Tags:    

Similar News