బస్సు ప్రమాదంలో ఆరుగురిని కాపాడింది ఇతనే
అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన రమేష్. పై ఫొటోలోని వ్యక్తే ఆరుగురిని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి.
కర్నూలు దగ్గర శుక్రవారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో జరిగిన బస్సుప్రమాదంలో 22 మంది మరణించగా మరికొందరు గాయాలతో బయటపడిన విషయం తెలిసిందే. గాయపడిన వారిని ఆసుపత్రిలో ఒక వ్యక్తి చేర్పించినట్లు ఉదయం నుండి మీడియాలో వినబడుతోంది. ఒకవ్యక్తి ఆరుగురిని కాపాడినట్లు చెప్పటం, వినటమే కాని అతనెవరో చాలాసేపటివరకు తెలియలేదు. మొత్తానికి అతను ఎవరో తెలిసింది. ఇంతకి అతను ఎవరంటే అనంతపురం జిల్లా హిందుపురంకు చెందిన రమేష్. పై ఫొటోలోని వ్యక్తే ఆరుగురిని ఆసుపత్రిలో చేర్పించిన వ్యక్తి.
తెల్లవారుజామున నంద్యాలలో ఉంటున్న తనసోదరుడి దగ్గరకు వెళ్ళేందుకు హిందుపురం నుండి రమేష్ బయలుదేరాడు. మధ్యలో కర్నూలు దాటగానే రోడ్డుపై అగ్నికి ఆహుతవుతున్న బస్సును గమనించాడు. వెంటనే కారును బస్సుకు దగ్గరగా తీసుకెళ్ళినట్లు తెలిపాడు. అప్పటికే బస్సులోని కొందరు బయటపడేందుకు లోపలనుండి చేస్తున్న ప్రయత్నాలను గమనించాడు. కొద్దిసేపటికే బస్సుఅద్దాలను పగలగొట్టుకుని కొందరు కిటికిలో నుండి రోడ్డుమీదకు దూకటాన్ని చూశాడు. కాలిన గాయాలతో పాటు అంతెత్తునుండి రోడ్డుమీద పడటంతో మరికొందరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన రమేష్ గాయాలైన ఆరుగురిని తనకారులో కూర్చోబెట్టుకుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు.
ప్రమాదం గురించి రమేష్ మాట్లాడుతు ‘‘నంద్యాలకు వెళ్ళేందుకు తాను ఉదయం హిందుపురంలో బయలుదేరి’’నట్లు చెప్పాడు. కర్నూలు దాటగానే రోడ్డుమీద మంటల్లో చిక్కుకున్న బస్సును చూసినట్లు చెప్పాడు. ‘‘బస్సు దగ్గర తన కారును ఆపేటప్పటికి కొందరు బస్సులో నుండి రోడ్డుమీదకు దూకటం గమనించి’’నట్లు తెలిపాడు. ‘‘గాయాలతో బస్సులో నుండి దూకిన ఆరుగురిని వెంటనే తన కారులో ఎక్కించుకుని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి’’నట్లు చెప్పాడు‘‘. తాను బస్సుదగ్గరకు వచ్చేటప్పటికే మంటలు వ్యాపించాయని లోపల ఎంతమంది ఉన్నారో చూడలేకపోయా’’నని తెలిపారు.