‘జూబ్లి’ బరిలో 58 మంది అభ్యర్థులు
ఇంతమంది అభ్యర్థులు పోటీ చేయడం ఇదే ప్రథమం
తెలంగాణలో ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. నవంబర్ 11న పోలింగ్ జరిగే ఉప ఎన్నికలో ఏకంగా 58 మంది అభ్యర్థులు పోటీపడుతున్నట్టు రిటర్నింగ్ అధికారి సాయిరాం వెల్లడించారు. మొత్తం 211 మంది అభ్యర్థులు నామినేషన్లు వేస్తే 81 మంది అభ్యర్థులు అర్హత సాధించారు అని ఆయన తెలిపారు. వారిలో శుక్రవారం వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు, పలువురు స్వతంత్రులు మొత్తం 23 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 58 మంది పోటీలో ఉన్నట్లు రిటర్నింగ్ ఆఫిసర్ వెల్లడించారు. ఇంత మంది పోటీ చేయడం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇదే ప్రథమం.
2009 ఎన్నికల్లో 13 మంది, 2014 ఎన్నికల్లో 21 మంది, 2018 ఎన్నికల్లో 18 మంది, 2023 ఎన్నికల్లో 19 మంది అభ్యర్థులు పోటీపడ్డారు అని రిటర్నింగ్ అధికారి వెల్లడించారు. వారిలో బిఆర్ఎస్ నుంచి వరుసగా మూడు పర్యాయాలు మాగంటి గోపీనాథ్ విజయం సాధించారు. ఆయన మరణంతో ఉప ఎన్నిక అనార్యమైంది. ఈసారి పోటీలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపిలతో పా టు పెద్ద సంఖ్యలో స్వతంత్రులు, విద్యార్థి సంఘాల నాయకులు, రైతులు ఎన్నికల కదనరంగంలో దిగారు. పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలవ్వడం చర్చనీయాంశం అయ్యింది.నామినేషన్ల దాఖలు, స్క్రూట్ని, ఉపసంహరణ వరకు ఉత్కంఠ రేకెత్తించింది.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత రెండో ఉప ఎన్నిక జూబ్లిహిల్స్ కావడంతో సిట్టింగ్ స్థానం కోసం బిఆర్ఎస్ తహతహలాడుతుంది. కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న మరణంతో గత ఎన్నికల్లో ఆయన కూతురు లాస్య నందిత బిఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలిచారు. లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించడంతో లాస్య నందిత చెల్లెలు లాస్య నివేదిత బిఆర్ ఎస్ నుంచి పోటీ చేశారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత మొదటిసారి జరిగిన ఉప ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థికి సానుభూతి ఓట్లు కూడా పని చేయలేదు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ చేతిలో బిఆర్ ఎస్ అభ్యర్థి ఓడిపోయారు.జూబ్లిహిల్స్ కూడా చేజారిపోకుండా బిఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతోంది. రెండో ఉప ఎన్నికలో కూడా బిఆర్ఎస్ సానుభూతి వోట్ల కోసం వెంపర్లాడుతోంది. చివరకు జూబ్లి ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో గెలుపొందడానికి అభ్యర్థులు తమ ఎజెండాలు, మేనిఫెస్టోలతో ముందుకు వస్తున్నారు. తమ సమస్యలను ఏకరువు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయా కారణాలతో నామినేషన్లు దాఖలు చేశారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.5 వేలు మాత్రమే ఉండటంతో ఆయా సామాజిక వర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఇతర అభ్యర్థులు రూ.10 వేలు చెల్లించిమరీ నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధానంగా రీజినల్ రింగు రోడ్డు ,భూసేకరణ నిర్వాసితులు ప్రభుత్వ తీరును ఎండగడుతూ తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నామినేషన్ వేశారు. ప్రస్తుతం 12 మంది రంగంలో ఉన్నారు. యాచారం ఫార్మాసిటీ భూ నిర్వాసితులు 10 మంది దాఖలు చేశారు. తగిన పరిహారం ఇవ్వలేదని, భూములు తిరిగి అప్పగించాలనేది వారి ప్రధాన డిమాండ్. ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ఒక సామాజిక వర్గం తరఫున 10 మంది నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఉద్యోగ నియామకాలు జరగలేవని నిరసిస్తూ నిరుద్యోగ జేఏసీ తరఫున 13 మంది నామినేషన్లు దాఖలు చేశారు. వృద్దాప్య పింఛన్లు సక్రమంగా రావడం లేదని పెన్షన్‌దారుల తరఫున 9 మంది సీనియర్ సిటిజన్లు నామినేషన్లు వేశారు. తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒక అభ్యర్థి నామినేషన్ దాఖలు చేశారు.