‘అవి మరణాలు కాదు.. ప్రభుత్వ హత్యలు’

విషజ్వరాలతో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు.;

Update: 2025-08-24 08:18 GMT

సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం తిమ్మాపూర్‌లో సంభవించిన విషజ్వరాల మరణాలు ప్రభుత్వ చేతకాని తనమేనంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రంలో పారిశుధ్యం పడకేసిందని విమర్శించారు. ఇప్పటికయినా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని, పారిశుద్ధ్యంపై ఫోకస్ పెట్టాలని ూచించారు. తిమ్మాపూర్‌లో హరీష్ రావు ఆదివారం పర్యటించారు. వైరల్ ఫీవర్‌తో మరణించిన మమేష్(35), శ్రవణ్(15) కుటుంబాలకు ఆయన పరామర్శించారు. ఇటువంటి కష్టకాలంలో బీఆర్ఎస్ వారికి మద్దతుగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.

ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి.. డెంగీ జ్వరాలతో బాధపడుతున్న 40-50 మందికి నాణ్యమైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. వైరల్ ఫీవర్ వచ్చి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లినా ప్రయోజనం లేకపోవడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ప్రజలంతా ప్రైవేటు ఆసుపత్రుల బాట పట్టి ఆ బిల్లుల కట్టుకోలేక అప్పులపాలవుతున్నారని, ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రజలకు అవసరమైన చికిత్స అందించాలని కోరారు.

కేసీఆర్ హయాంలో స్పెషల్ డ్రైవ్‌లు పెట్టి వైరల్ ఫీవర్‌లను ప్రభలకుండా అడ్డుకట్ట వేశామని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో పరిస్థితులు చేయిదాటిపోయేలా ఉన్నాయని ఆయన అన్నారు. తిమ్మాపూర్‌లో ఇద్దరు యువకులు డెంగ్యూతో మృత్యువాత పడటానికి రేవంత్ సర్కార్ నిర్లక్ష్యమేనని విమర్శించారు.

ప్రతిపక్ష నాయకులపై ఏడవడం ఆపు

రేవంత్ పాలనపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు పాలన చేతకాదన్నారు. ఎప్పుడూ ప్రతిపక్ష నాయకులపై పడి ఏడవడం, కేసీఆర్, బీఆర్ఎస్‌ను తిట్టడం తప్ప రేవంత్‌కు ఇంకేం చేతకాదన్నారు. రాష్ట్రంలో బార్లలో మందులు ఫుల్‌గా దొరుకుతున్నాయని, ఆసుపత్రుల్లో మాత్రం మందులు నిల్‌గా ఉన్నాయని, ఇప్పటికయినా ఏది అందరికీ అందుబాటులో ఉంచాలో రేవంత్ అర్థం చేసుకోవాలని సూచించారు. పాలించడం అంటే అబద్ధాలు చెప్పడం, కల్లబొల్లి కబుర్లు చెప్పినంత ఈజీ కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

రేవంత్ చేతకాని పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు, ఎరువులు దొరక్క రైతులు, సరైన వసతులు లేక విద్యార్థులు, ఇప్పుడు సరైన పారిశుద్ధ్యం లేక ప్రజలు కూడా తీవ్ర ఇబ్బదులకు గురవుతున్నారని అన్నారు. ఇప్పటికయినా రేవంత్ బుద్ధి తెచ్చుకుని సరైన మార్గంలో వెళ్లడం మేలని హితవు పలికారు.

Tags:    

Similar News