Master Plan | బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల మాస్టర్ ప్లాన్
తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అనేందుకు అసెంబ్లీ రికార్డులే సాక్ష్యమని వీళ్ళు చెబుతున్నారు;
ఫిరాయింపుల నిరోదక చట్టం ప్రకారం ఇపుడు అనర్హత వేటునుండి తప్పించుకోవటం ఎలాగ ? ఇపుడిదే బీఆర్ఎస్ ఫిరాయింపు ఎంఎల్ఏల ముందున్న తక్షణ సమస్య. వీళ్ళంతా ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)ని నమ్ముకునే బీఆర్ఎస్(BRS) లో నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. సుప్రింకోర్టు (Supreme Court)ఆదేశాల కారణంగా వీళ్ళ అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly) స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ ప్రక్రియను ప్రారంభించారు. ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏల్లో(BRS defection MLAs) ఐదుగురు ఎంఎల్ఏలకు స్పీకర్ కార్యాలయంనుండి నోటీసులు జారీఅయ్యాయి. తమమీదున్న ఫిరాయింపుల ఆరోపణలకు తగిన వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసుల్లో స్పీకర్ అడిగినట్లు తెలుస్తోంది. సమాధానాలు చెప్పటానికి ఎంఎల్ఏలకు కాలవ్యవధి ఏమీలేదు. కాలవ్యవధిని నిర్దేశించకపోయినా సమాధానాలు అయితే ఇవ్వక తప్పదు ఫిరాయింపులకు.
అఖిల భారత స్పీకర్ల సదస్సులో పాల్గొనేందుకు గడ్డం ప్రస్తుతం ఢిల్లీకి వెళ్ళారు. మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకోగానే విచారణ ప్రక్రియపై దృష్టి పెట్టబోతున్నట్లు సమాచారం. సరే, గడ్డం ఏమిచేస్తారు ? నోటీసులకు ఏమి సమాధానాలు ఇవ్వాలన్న విషయమే ఇక్కడ కీలకంగా మారింది. ఈనేపధ్యంలోనే పిరాయింపు ఎంఎల్ఏలందరు స్పీకర్ నోటీసులకు అడ్డం తిరగబోతున్నట్లు సమాచారం. అదెలాగంటే తాము బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి ఫిరాయించామని జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమే అని చెప్పబోతున్నారు.
తాము బీఆర్ఎస్ తరపున గెలిచామని, ఇప్పటికీ తాము బీఆర్ఎస్ లోనే కంటిన్యు అవుతున్నట్లు ఫిరాయింపు ఎంఎల్ఏలు నోటీసులకు సమాధానాలు చెప్పబోతున్నారు. ఇదే విషయాన్ని గద్వాల ఫిరాయింపు ఎంఎల్ఏ, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ బండ్ల కృష్ణమోహన్, అరెకపూడి గాంధి చెప్పారు. తాము బీఆర్ఎస్ ఎంఎల్ఏలమే అనేందుకు అసెంబ్లీ రికార్డులే సాక్ష్యమని వీళ్ళు చెబుతున్నారు. సాంకేతికంగా బండ్ల, అరెకపూడి చెబుతున్నది వాస్తవమే. ఎలాగంటే ఫిరాయింపులు గెలిచింది బీఆర్ఎస్ బీఫారమ్ పైన కాబట్టి ఈఐదేళ్ళూ అసెంబ్లీ రికార్డుల్లో వీళ్ళు బీఆర్ఎస్ ఎంఎల్ఏలుగానే కనబడతారు. బీఆర్ఎస్ కు దూరమై కాంగ్రెస్ కు దగ్గరవ్వటం అన్నది అనధికారికమనే చెప్పాలి. అనదికారిక వ్యవహారాలు అసెంబ్లీ రికార్డుల్లో ఉండవు.
ఫిరాయింపులు 10 మంది బీఆర్ఎస్ కు దూరమైన మాట వాస్తవం. వీళ్ళ వ్యవహార శైలి మీద అనుమానం కారణంగా వీళ్ళతో బీఆర్ఎస్ నాయకత్వం అంటీ ముట్టనట్లుగా ఉండేది. ఇదే అవకాశంగా వీళ్ళంతా రేవంత్ కు దగ్గరైందీ వాస్తవమే. అయితే ఇందుకు ఫిరాయింపులు చెబుతున్న కారణం ఏమిటంటే తమనియోజకవర్గాల అభివృద్ధి కోసమే రేవంత్ ను కలిశామని. నియోజకవర్గాల అభివృద్ధికి రేవంత్ ను కాకుండా ఇంకెవరిని కలావాలో చెప్పమని కూడా వీళ్ళు ఎదురు ప్రశ్నిస్తున్నారు. పార్టీలకన్నా నియోజకవర్గాల అభృద్ధి, ప్రజాసమస్యల పరిష్కారమే తమకు ముఖ్యమని అరెకపూడి, బండ్ల బల్లగుద్ది చెబుతున్నారు. వీళ్ళు చెప్పినట్లే మిగిలిన ఫిరాయింపు ఎంఎల్ఏలు కూడా చెబుతున్నారు.
తాము కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ఎక్కడా ప్రకటించలేదని, రేవంత్ ను కలసినపుడు కాంగ్రెస్ కండువాలు కూడా కప్పుకోలేదని వీళ్ళు ఎదురు వాదిస్తున్నారు. సో, క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే స్పీకర్ కు సమాధానాలు చెప్పాల్సిన నోటీసుల్లో కూడా తాము బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించలేదని చెప్పబోతున్నారని అర్ధమవుతోంది. వీళ్ళ సమాధానాలను చూసినతర్వాత స్పీకర్ ఏమిచేయగలరు ? ఏమీలేదు, తాను ఫిరాయింపులకు జారీచేసిన నోటీసులను, అందుకు ఫిరాయింపులు పంపిన సమాదానాలతో సంతృప్తి చెందిన కారణంగా ఎవరిపైనా ఎలాంటి చర్యలు అవసరంలేదని నిర్ణయించినట్లు సుప్రింకోర్టుకు సమాధానం పంపే అవకాశాలున్నాయి.
తనసమాధానంతో పాటు ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంఎల్ఏలు ఇచ్చిన సమాధానాలను, అసెంబ్లీ రికార్డులను కూడా కోర్టు ముందుంచుతారు. దాన్నిబట్టి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్ళీ సుప్రింకోర్టులో కేసు వేసే అవకాశముంది. అప్పుడు సుప్రింకోర్టు ఏ విధంగా రియాక్టవుతుందన్నది ఆసక్తిగా మారుతుంది. ఫిరాయింపులు కాంగ్రెస్ లో కలిసిపోయినట్లు ఆధారాలను చూపేందుకు బీఆర్ఎస్ దగ్గర సాక్ష్యాలు ఏమీలేవు. కాకపోతే ఫిరాయింపులు అందరిలోకి ఖైతరాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ కు మాత్రమే సమస్య ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.
దానంకు సమస్యేనా ?
అవును, దానం నాగేందర్ కు మాత్రమే సమస్య ఎదురయ్యేట్లుంది. ఎలాగంటే 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంఎల్ఏగా గెలిచిన దానం 2024 ఎన్నికల్లో సికింద్రాబాద్ నుండి కాంగ్రెస్ ఎంపీగా పోటీచేశారు. ఒక పార్టీ ఎంఎల్ఏగా ఉంటూ మరోపార్టీ ఎంపీగా దానం ఎలాగ పోటీచేయగలరు ? దానం చర్య ప్రజాప్రాతినిధ్యచట్టానికి విరుద్ధం. తనచర్యను బహుశా దానంకూడా సమర్దించుకునేందుకు అవకాశంలేదు. కాబట్టి అనర్హత వేటంటు పడితే ఒక్క దానంమీద మాత్రమే పడే అవకాశాలు ఎక్కువగాఉన్నాయి. మిగిలినవాళ్ళు సాంకేతికంగా తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి.