ప్రేమించి పెళ్లాడిన భర్తే కడతేర్చాడు..
స్వాతి హత్య కేసులో కీలక పరిణామాలు వెలుగుచూశాయి. భర్తే హతమార్చి ముక్కలు ముక్కులు చేశాడు.;
బోడుప్పల్‌లో గర్భవతి స్వాతి హత్య రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టించింది. ఈ కేసులో రోజుకో కీలక విషయం వెలుగు చూసింది. తన భార్య గర్భవతి అని తెలిసి కూడా భర్తే అతికిరాతకంగా హతమార్చాడు. ఆమె గర్భవతి అని నిర్ధారితమైనప్పటి నుంచి స్వాతిపై ఆమె భర్త అనుమానం పెట్టుకున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. ఆమెను హతమార్చడం కోసమే వికారాబాద్ నుంచి బోడుప్పల్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. స్వాతి, మహేందర్ నెలల క్రితమే ప్రేమవివాహం చేసుకున్నారు. ఇటీవల వారు వికారాబాద్ నుంచి బోడుప్పల్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. వారి మధ్య తరచుగా గొడవలు జరుగుతన్నాయి. వారి మధ్య గొడవలు ఎందుకు వచ్చేవి? అనుమనాలే వారి వైవాహిక జీవితాన్ని చిన్నాభిన్నం చేశాయో తెలియదు. కానీ తన భార్యను హతమార్చాలని మహేందర్ నిర్ణయించుకున్నాడు.
ప్లాన్ ప్రకారం భార్య స్వాతిని మహేందర్ హతమార్చాడు. అంతేకాకుండా ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలు చేసి కవర్లలో ప్యాక్ చేశాడు. వారి ఇంట్లో నుంచి శబ్దాలు వస్తుండటంతో చుట్టుపక్కల వారు వెళ్లి చూశారు. విషయం అర్థం చేసుకున్న పొరుగువారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మహేందర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడం ప్రారంభించారు. కాగా స్వాతి చేతులు, తల, కాళ్లను మూసీ నదిలో పడేసినట్లు మహేందర్ అంగీకరించాడు. మహేందర్ ఇంటి నుంచి పోలీసులు స్వాతి ఛాతీ భాగాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన భాగాల కోసం మూసీ నదిలో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
పెళ్లైన కొన్నాళ్లకే వేధింపులు షురూ
పెళ్లయిన కొన్ని రోజుల నుంచి మహేందర్ వేధింపులు ప్రారంభించాడని స్వాతి తల్లి జ్యోతి ఆరోపించారు. వారి పెళ్లి జరిగి 19 నెలలు అయినా ఇప్పటి వరకు తమ కూతురును ఒక్కసారి కూడా పుట్టింటికి పంపలేదని, అప్పుడప్పుడు స్వాతి.. మహేందర్‌కు తెలియకుండా తమతో ఫోన్లో మాట్లాడేదని ఆమె వివరించారు. ఆమె చెప్పిన విషయాల ఆధారంగా కూడా పోలీసులు విచారణను ముందుకు కొనసాగిస్తున్నారు.
అయితే మహేందర్ రెడ్డి ప్రవర్తనపై చుట్టుపక్కల వారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. తమ కూతుర్ని చెప్పి మరీ చంపేశారని జ్యోతి తల్లి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ముక్కలు చేసిన శరీర భాగాల్లో కొన్నింటిని మూసీ నదిలో పడేసినట్లు మహేందర్ పోలీసులకు చెప్పగా.. వాటి కోసం ప్రతాప్ సింగారం సమీపంలో నదిలో గాలింపు చర్యలు చేపట్టారు.