లిక్కర్ స్కాంలో ముదురుతున్న కవిత కష్టాలు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో పేరు వెలుగులోకి వచ్చింది. కవిత బంధువుపై ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది.

Update: 2024-03-23 11:28 GMT
Source: Twitter

కవిత మెడకు ఢిల్లీ లిక్కర్ స్కాం ఉచ్చు బిగుస్తోంది. తప్పించుకోలేని విధంంగా కవితకు అన్ని దార్లను ఈడీ మూసేస్తోంది. ఒకదాని తర్వాత ఒకటిగా అష్టదిగ్బంధనం చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కవిత బంధువులపై కూడా ఈడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఈ విషయాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందు ఉంచింది. ఈ కుంభకోణం కేసులో కవితతో పాటు ఆమె మేనల్లు మేక శరణ్ పాత్ర కూడా ఉందని అనుమానం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే మేక శరణ్ పేరును కూడా లిస్ట్‌లో చేర్చనున్నట్లు తెలిపింది.  ఇప్పటికే విచారణకు హాజరుకావాలని శరణ్‌కు రెండు సార్లు నోటీసులు జారీ చేశామని, అయితే అతడు స్పందించలేదని ఈడీ న్యాయాస్థానానికి వెల్లడించింది. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అతి త్వరలోనే మరో కీలక మలుపు సంభవించనున్నట్లు కనిపిస్తోంది.

కవిత నివాసంలో తాము సోదాలు చేస్తున్న సమయంలో తమకు మేక శరణ్ ఫోన్ లభ్యమైందని, అప్పుడు అతడు కూడా అదే ఇంట్లో ఉన్నారని ఈడీ తెలిపింది. ఈ కుంభకోణంలో కవిత మేనల్లుడు మేక శరణ్ హస్తం కూడా ఉందని, అతని వ్యాపారాల వివరాలు చెప్పాలని కోరితే తనకు తెలియదని కవిత చెప్తున్నారని ఈడీ న్యాయస్థానానికి వివరించింది. నేరపూరిత సొమ్మును కవిత తన మేనల్లుడి వ్యాపారాల ద్వారా వినియోగించుకున్నారన్న విషయంలో సమీర్ మహేంద్రుతో కలిసి విచారణ చేయడానికి అప్లికేషన్ దాఖలు చేశామని వారు వెల్లడించారు. వారి కోరిక మేరకు ధర్మాసనం కవిత కస్టడీని మూడు రోజులు పొడిగించింది. అయితే ఈ కేసులో కవిత బంధువులు ఇంకెంతమంది ఉన్నారన్న అంశంపై కూడా దృష్టి పెట్టినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఢిల్లీలో కవిత కేసు విచారణ జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌లో ఆమె బంధువుల నివాసాల్లో సోదాలు జరుగుతున్నట్లు ఈడీ తెలిపింది.

ఈ నేపథ్యంలోనే కవిత ఆడపడుచు అఖిల ఇంట్లో శనివారం దాదాపు 11 గంటల పాటు ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. వీటిలో భాగంగా లిక్కర్ స్కాంలో కవిత మేనల్లుడు మేక శరణ్ పాత్రపై ప్రశ్నించారు ఈడీ అధికారులు. అఖిలకు సంబంధించిన 3 సంవత్సరాల ఆర్థిక లావాదేవాల గురించి, బ్యాంకు ఖాతాలు, ల్యాండ్ పత్రాలు, బంగారం సహా పలు ఇతర వివారలను కూడా వారు అడిగారు. అనంతరం అఖిల వాళ్ల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈసీ జోక్యం చేసుకోవాలి
ఎన్నికల సమయంలో ఇంత మంది నేతలను అరెస్ట్ చేయడం మన దేశ ప్రజాస్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని బీఆర్ఎస్ నేత కవిత అన్నారు. ఈ విషయంలో ఈసీ జోక్యం చేసుకోవాలని, అరెస్ట్‌లపై దృష్టి సారించాలని ఆమె కోర్టు నుంచి బయటకు వెళ్తున్న సమయంలో అన్నారు. అంతేకాకుండా తన అరెస్ట్ వెనుక రాజకీయ కుట్ర ఉందని, తనపై బనాయించింది తప్పుడు కేసని చెప్పారు కవిత.


Tags:    

Similar News