రాజారం గ్రామ ఓటర్ల ఎన్నికల బహిష్కరణ నిర్ణయం...ఎందుకంటే...

రాజారం గ్రామ సమస్యలు తీర్చాలని దశాబ్దాలుగా కోరుతున్నా పాలకులు పట్టించుకోలేదు. ఎన్నికల వేళ తాము ఓటేసేది లేదని గ్రామ ఓటర్లు ముక్తకంఠంతో నిర్ణయించుకున్నారు.

Update: 2024-04-24 15:24 GMT
Rajaram village voters

గలగలా పారుతున్న గోదావరి,ప్రాణహిత నదులు...వర్షాకాలంలో చినుకు పడితే చాలు పొంగి ప్రవహించే బబ్బర్ చిలక చిన్నవాగు, గెర్రెల పెద్దవాగులు...కనీసం రోడ్డు సౌకర్యం లేని శ్రీలంకలా బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న రాజారం గ్రామం పార్లమెంటు ఎన్నికల సందర్భంగా జాతీయ వార్తల్లోకి ఎక్కింది...తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో మారుమూలన విసిరేసినట్లు ఉన్న రాజారం గ్రామంలో అన్నీ సమస్యలే...

- దశాబ్దాలుగా ప్రజాప్రతినిధులకు
ఎన్ని సార్లు విన్నవించినా రాజారం గ్రామానికి కనీసం రోడ్డు, వంతెనలు కూడా నిర్మించక పోవడంతో విసిగి వేసారి పోయిన రాజారం గ్రామస్థులు బుధవారం గ్రామంలో సమావేశమయ్యారు.
- ‘‘మా గ్రామ సమస్యలు తీర్చే వరకూ మేం ఎన్నికల్లో ఓటేయమని గ్రామ సర్పించి కొన్క పోషక్క, యువ రైతు కొప్పుల సత్యనారాయణల ఆధ్వర్యంలో గ్రామస్థులు, వార్డు సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రాజారం గ్రామస్థులు తీసుకున్న ఎన్నికల బహిష్కరణ నిర్ణయం నేడు మంచిర్యాల జిల్లాలోనే కాకుండా తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది.

తూర్పున సిర్వంచ మండలం...దక్షిణాన చెన్నూర్ మండలం...ఉత్తరాన వేమనపల్లి మండలం...పశ్చిమాన నెన్నెల్ మండలం...మహారాష్ట్రలోని గడ్ చిరోలి జిల్లా సరిహద్దులకు సమీపంలో వర్షాకాలంలో నలువైపులా వాగులు పారుతూ దీవిలా ఉన్న రాజారం గ్రామంలో 350 ఇళ్లు, 646 మంది జనాభా నివాసముంటున్న రాజారం గ్రామస్థులదీ దశాబ్దాలుగా తీరని దీనగాథ.రాజారం గ్రామ పంచాయతీ పరిధిలో రాజారం, లింగన్నపేట, కవర్ కొత్తపల్లి ప్రాంతాలు ఉన్నాయి. 52.2 శాతం మహిళలు, నిరక్షరాస్యులు అధికంగా ఉన్న ఈ కుగ్రామంలో కూలీ, నాలీ చేసే కార్మికులు 59.8 శాతం మంది ఉన్నారు. జిల్లా కేంద్రమైన మంచిర్యాలకు 58 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజారం గ్రామానికి శాసనసభ్యులు కేవలం ఎన్నికల సమయంలోనే ఓట్లు అడిగేందుకు వస్తుంటారు. ఈ గ్రామానికి రోడ్డు, వంతెనలు నిర్మించక పోవడంతో వాగులు దాటి రాలేక జిల్లా ఉన్నతాధికారులైతే అసలు ఈ గ్రామం వంకే చూడటం లేదు. అంతే దీంతో తమ గ్రామం తాతల కాలం నాటినుంచి సమస్యల్లో కూరుకుపోయిందని రాజారం గ్రామ రైతు కొప్పుల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అంబులెన్స్ వచ్చే దారి లేక గ్రామంలో పదిమంది మృత్యువాత
రాజారం గ్రామానికి అంబులెన్స్ వచ్చే దారి లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో 10 మంది గ్రామస్థులు మరణించారు. రాజారం గ్రామానికి చెందిన కురుమ రాజన్న, గోదాల వసంత్, కాంకా వెంకటేష్ లు ఆత్మహత్యయత్నం చేశారు. వారు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే అంబులెన్స్ వచ్చే రోడ్డు లేక పోవడంతో వారిని ఎడ్లబండిపై వాగులోనుంచి ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించినా వారి ప్రాణాలు గాల్లోనే కలిసిపోయాయి. వారే కాదు..కురుమ లచ్చన్న, కాంద వెంకటి,చింతకింది సమ్మక్క గుండెపోటుతో సత్వర వైద్యం అందక వారీ ప్రాణాలు హరీమన్నాయి. వారే కాదు పలువురు తమ గ్రామస్థులకు ఆఫత్ వస్తే అంబులెన్స్ రాక ప్రాణాలు కోల్పోయారని రాజారం గ్రామ రైతు కొప్పుల సత్యనారాయణ ‘ఫెడరల్ తెలంగాణ’కు ఆవేదనగా చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే 15 కిలోమీటర్ల దూరంలోని కోటపల్లి, సబ్ సెంటరుకు వెళ్లాలంటే నీల్వాయి వెళ్లాలి. సిర్సా బస్సు ఎక్కాలంటే 6.1 కిలోమీటర్ల దూరం నడచి వెళ్లాలి.

రాజారం గ్రామం...ఏరియల్ వ్యూ

వర్షం వస్తే వాగులు పొంగితే పాఠశాలకు డుమ్మానే...
రాజారం గ్రామ విద్యార్థులు 6వ తరగతి నుంచి పై చదువుల కోసం నడిచి వెళ్లాల్సిందే. వర్షాకాలంలో అయితే గ్రామం రెండు వైపులా ఉన్న వాగులు పొంగిప్రవహిస్తుండటంతో వర్షం కురిసిన ప్రతీసారి పాఠశాలకు విద్యార్థులు డుమ్మా కొట్టాల్సిందే. రాజారం గ్రామంలో 5వతరగతి వరకు చదువుకునేందుకు ప్రభుత్వ పాఠశాల ఉంది. వర్షాకాలంలో ఎడతెరిపిలేకుండా కురిసే వర్షాల వల్ల వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో 20 రోజుల పాటు తమ పిల్లలు పాఠశాలకు వెళ్లలేక పోతున్నారని గ్రామస్థులు ఆవేదనగా చెప్పారు. ‘‘గత ఏడాది వర్షాకాలంలో పిల్లలు పాఠశాలకు వెళ్లాక భారీవర్షం కురిసింది.అంతే వాగులు పొంగి ప్రవహించాయి. దీంతో స్కూలు వెళ్లిన తమ పిల్లలు ఇంటికి చేరుకోలేకపోయారు. పిల్లలు ఏడుస్తూ 24 గంటలపాటు పాఠశాలలోనే గడపాల్సి వచ్చింది’’ అని లచ్చన్న అనే విద్యార్థి తండ్రి విలపిస్తూ చెప్పారు.

ఎడ్లబండిపైనే గ్యాస్ సిలిండరు
ఇంట్లో వంట చేసుకోవడానికి గ్యాస్ సిలిండరు రావాలన్నా తమ గ్రామానికి బండి రాదని గ్రామస్థులు చెప్పారు. ఎడ్లబండ్లపై వాగులోనుంచి దాటించి గ్యాస్ సిలిండర్లు తెప్పించుకోవాల్సి వస్తుందని మహిళలు ఆవేదనగా చెప్పారు. ఏటీఎం, లేదా బ్యాంకుకు వెళ్లాలన్నా 15 కిలోమీటర్ల దూరం వెళ్లాలి. దేవాలయానికి వెళ్లాలన్నా 8.3 కిలోమీటర్ల దూరంలోని అల్గాన్ శ్రీఆంజనేయస్వామి దేవాలయానికి,పెట్రోలు పోయించుకోవాలన్నా 15కిలోమీటర్ల దూరం, స్కూలుకు వెళ్లాలంట 6.1 కిలోమీటర్లు, కళాళాలకు వెళ్లాలంటే 15 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుంది. తమ గ్రామానికి రోడ్డు లేక తాము నానా అవస్థలు పడుతున్నామని రాజారం గ్రామ ఉప సర్పంచి కంకొడ తిరుపతిరావు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

అసంపూర్తిగా వంతెన నిర్మాణం


 అసౌకర్యాల మధ్య ప్రజల జీవనం

రాజారం గ్రామంలో వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఇక్కడి ప్రజలు అసౌకర్యాల మధ్య జీవనం సాగిస్తున్నారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాజారం గ్రామం గోదావరి నదీ పరివాహక ప్రాంతం ఆనుకొని ఉన్న రాజారం వర్షమొస్తే చాలు మా గ్రామానికి బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. రోడ్డు లేదు...టీఎస్ ఆర్టీసీ బస్సు రాదు, అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఆసుపత్రికి తీసుకువెళ్లాలన్నా రోడ్డు లేక అంబులెన్స్ గ్రామానికి రాని పరిస్థితి నెలకొంది. తలాపునే రెండు నదులున్నా తాగునీరు లేదు. సాగు లేదు. దీంతో తాము నానా ఇబ్బందులు పడుతున్నామని వార్డు సభ్యులు చెప్పారు.

రాజారం గ్రామస్థుల సమిష్ఠి నిర్ణయం
తమ రాజారం గ్రామ సమస్యలు తీర్చే వరకు తాము పార్లమెంటు ఎన్నికల్లో ఓటేసిలేదని గ్రామస్థులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రాజారం గ్రామ సర్పంచ్ కొన్క పోషక్క, ఉప సర్పంచ్ కలకొండ తిరుపతిరావు, గ్రామ వార్డు సభ్యులు జోడు శంకరయ్య, కొన్క లచ్చన్న, పిట్టల లక్ష్మీ, పిట్టల సమ్మక్క, సల్పాల పోషక్క, సంబాజీ శారద, వేరవెన మల్లక్క, గ్రామ రైతు కొప్పుల సత్యనారాయణలు కలిసి చర్చించుకొని ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించారు.

తలాపునే నదులున్నా అందని సాగునీరు
తమ గ్రామం చెంతనే గోదావరి నదీ పారుతున్నా సాగునీరు మాత్రం తమ పొలాలకు అందటం లేదు. కోట్లాదిరూపాయలు వెచ్చించి నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ తమ గ్రామానికి సమీపంలో ఉన్నా మా గ్రామంలో ఒక్క ఎకరానికి కూడా నీరు అందదు. తెలంగాణను సస్యశ్యామలం చేశామని కేసీఆర్ చెపుతుంటారని కానీ, గోదావరి సమీపంలో ఉన్న తమ గ్రామానికి మాత్రం సాగునీరందని పరిస్థితి నెలకొందని కొప్పుల సత్యానారాయణ చెప్పారు.ఎన్నికల సమయంలోనే నేతలు తమ గ్రామానికి వస్తారని ఆ తర్వాత తమ గ్రామం వైపు ఎవరు కన్నెత్తి చూడరని ఆయన పేర్కొన్నారు.

రాజారం అంటే అంత చులకన...
కొట్లాడి తెలంగాణ తీసుకువచ్చినా తమ గ్రామానికి రోడ్డు వేయలేదని రాజారం గ్రామస్థులు ఆవేదనగా చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా తమ సమస్య తీరలేనందున తామంతా ఏకమై నీటి సమస్య, రోడ్డు సమస్య తీర్చే వరకు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని తీర్మానం చేశాం అని గ్రామస్థులు ముక్తకంఠంతో చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ మా గ్రామానికి రాలేదు. మా ముఖం కూడా చూడలేదు.ప్రభుత్వాలు మారినా సమస్యలు మాత్రం తీరలేదు అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాం’’అని రాజారం గ్రామానికి చెందిన జోడు శంకరయ్య ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో ఎమ్మెల్యేలకు ఎన్ని సార్లు విన్నవించినా తమ సమస్య మాత్రం తీరలేదని వారు ఆవేదనగా చెప్పారు.
పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న ఈ రాజారం గ్రామం ఎన్నికల బహిష్కరణ నిర్ణయంతో అందరూ దృష్టి సారించారు. బుధవారం కోటపల్లి ఎస్ఐ రాజేందర్, ఎమ్మార్వో ఇతర అధికారులు మొదటిసారి రాజారం గ్రామానికి వచ్చి స్థానికులతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాము సమస్యలను మంచిర్యాల కలెక్టరు దృష్టికి తీసుకువెళతామని ఎస్ఐ రాజేందర్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మరి ఈ ఎన్నికల సమయంలోనైనా పాలకులు, అధికారులు రాజారం గ్రామస్యలు తీరుస్తారా ? లేదా అనేది వేచి చూడాల్సిందే.


Tags:    

Similar News