ఓటింగ్ తక్కువ.. దొంగ ఓట్లు ఎక్కువ.. ఎక్కడో తెలుసా?

హైదరాబాద్‌లోని కీలక సీట్లలో పాతబస్తీ కూడా ఒకటి. ఇక్కడ ఓటింగ్ శాతం అత్యల్పంగా ఉంటుంది. కానీ దొంగ ఓట్లే..

Update: 2024-04-20 14:37 GMT

ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాలలో హైదరాబాద్ పాతబస్తీ ఒకటి. అలాంటి పాతబస్తీలో దొంగ ఓట్లు లేదా బోగస్ ఓట్ల నమోదు కూడా చాలా ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ నగరం అంతటా కలిపి 5 లక్షలకు పైగా బోగస్ ఓట్లను తొలగిస్తే అందులో రెండు లక్షల ఓట్లు పాతబస్తీవే కావడం అందర్నీ విస్మయపరిచింది. ఇంత పెద్ద మొత్తంలో దొంగ ఓట్లు ఎందుకు నమోదు చేయించారు, ఎవరు చేయించారనే చర్చ జోరుగా సాగుతోంది.

అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితా ప్రక్షాళన చేపట్టినప్పుడు ఈ సంచలన విషయాలు బయటపడ్డాయి. పెద్ద సంఖ్యలో నకిలీ ఓట్లు ఉన్నట్టు తేలింది. హైదరాబాద్ మొత్తం మీద జ్ఞానవంతులు, సంపన్నులు, బడాబడా వ్యాపారులు, ప్రస్తుత ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, తలపండిన రాజకీయ నాయకులు ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 60 వేలకు పైగా డూప్లికేట్ ఓట్లు ఉండడం మరింత విస్తుగొలుపుతోంది. హైదరాబాద్ జిల్లా ఎన్నికల కార్యాలయం నుంచి వచ్చిన డేటా ప్రకారం జూబ్లీహిల్స్‌లో అత్యధికంగా 60,953 డూప్లికేట్ ఓట్లు ఉన్నాయి.

ఇందులో 3,101 మంది మరణించిన ఓటర్లు కాగా 53,012 మంది వివిధ పేర్లతో ఉన్నారు. ఇక, పాతబస్తీ పరిధిలోకి వచ్చే 5 నియోజకవర్గాలలో దొంగ ఓట్లు నమోదు అయ్యాయి. చాంద్రాయణగుట్టలో 59,289 యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు నమోదు అయ్యాయి. నాంపల్లిలో 41,144 దొంగఓట్లు, బహదూర్ పురా 39,664, మలక్ పేటలో 40,892, ముషీరాబాద్ లో 41,842 దొంగఓట్లు ఉన్నట్టు తేలాయి. దొంగ ఓట్లు తొలగించిన ఓటర్ల జాబితాలోని మొదటి ఏడు నియోజకవర్గాలలో ఐదు పాతబస్తీకి చెందినవి. చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, నాంపల్లి, మలక్‌పేట్, బహదూర్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌లలోనే 2.29 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయి.

హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాలలో 5.4 లక్షల డూప్లికేట్ ఓట్లు ఉన్నట్టు తేల్చారు. అంటే హైదరాబాద్‌లోని 45 లక్షల మంది ఓటర్లలో 10% డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్టు తేలింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో అత్యధికంగా 6,503 మంది మరణించిన వారి పేరిట ఓట్లుండగా నాంపల్లిలో 5,886, కార్వాన్ లో 4,478 మంది మరణించిన వారి పేరు మీద ఓట్లున్నాయి. చాంద్రాయణగుట్టలో అత్యధికంగా 53,750 మంది ఇళ్లు మారారు. గత ఏడాది జనవరి నుంచి ఐదు లక్షలకు పైగా కొత్త ఓటర్లు హైదరాబాద్ జిల్లాలో నమోదు అయ్యారు.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఈ విషయమై మాట్లాడుతూ.. 2023 జనవరి 1 నుంచి 2024 మార్చి 15 వరకు 4,500 మంది అధికారులు ఓటర్ల జాబితాల ప్రక్షాళనలో పాల్గొన్నారని చెప్పారు. “ఇంతకుముందు కొన్ని రాజకీయ పార్టీలు దొంగఓట్ల విషయాన్ని మా దృష్టికి తీసుకువచ్చాయి. ఒక నియోజకవర్గంలో 15,025 మంది చనిపోయిన ఓటర్లు ఉన్నారని ఆరోపించారు. మేము పరిశీలిస్తే చనిపోయిన ఓటర్లు 3,000 మంది మాత్రమే ఉన్నారు, వాటిని జాబితా నుండి తొలగించాం” అని ఆయన చెప్పారు.

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సమగ్రత, పారదర్శకత, న్యాయబద్ధతపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. జాబితాలోని బోగస్ ఓట్లు తొలగించింది. దొంగ ఓట్లను నమోదు చేసిన ఎన్నికల అధికారులపై చర్యలు ఉంటాయన్నారు రోనాల్డ్ రాస్. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని 134వ సెక్షన్ కింద దొంగ ఓట్లు నమోదు చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. హైదరాబాద్ నగరంలో సుమారు పది మందిపై ఈ తరహా కేసుల్ని పెట్టారు. వారిపై వివరణ కోరిన అనంతరం చర్యలు తీసుకుంటారు. మొత్తం మీద ఓట్లు వేయని చోట దొంగ ఓట్లు ఎక్కువగా నమోదు కావడం కలకలం సృష్టించింది.

Tags:    

Similar News