2023 తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ,వరంగల్ డిక్లరేషన్ తో పాటు, ప్రత్యేకించి, ఎన్నికల మానిఫెస్టో లో వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయడానికి , ప్రతి సంవత్సరం తగిన స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయడంతో పాటు, అర్హులు మాత్రమే లబ్ధిదారులుగా ఉండేలా, స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలి.
వ్యవసాయ రంగ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం, ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా ముందుగా వ్యవసాయ కుటుంబాల సంక్షేమం, హక్కుల కల్పన లక్ష్యంగా రైతు/ వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేయాలి. ఈ కమిషన్ లో వ్యవసాయ, ఆర్ధిక శాస్త్రవేత్తలు, వ్యవసాయ ,అనుబంధ రంగాల ఉన్నతాధికారులు, రైతుల (మహిళా రైతుల) ప్రతినిధులు సభ్యులుగా ఉండాలి. ఈ కమిషన్ సిఫారసులకు ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలి. ఈ అసెంబ్లీ సమావేశాలలోనే ఈ మేరకు బిల్లు రూపొందించి ప్రవేశ పెట్టాలి.
గ్రామీణ వ్యవసాయ కుటుంబాల ఆదాయ బధ్రత , సంక్షేమం , రాష్ట్రానికి ఆహార బధ్రత లక్ష్యంగా నిర్ధిష్ట కాల పరిమితిలో ( 2024 ఖరీఫ్ సీజన్ ప్రారంభం లోపు) సమగ్ర వ్యవసాయ విధానం రూపొందించాలీ. సమగ్ర భూ సర్వే ఆధారంగా రాష్ట్రంలో సాగు భూముల విస్తీర్ణాన్ని నిక్కచ్చిగా తేల్చాలి. వ్యవసాయేతర భూములు, వ్యవసాయ భూముల విభజన స్పష్టంగా ఉండాలి. రాష్ట్ర భూములలో మాగాణి, మెట్ట భూముల వర్గీకరణ కూడా స్పష్టంగా చేయాలి.
ప్రతి సంవత్సరం , ప్రతి సర్వే నంబర్ లో భూమి యాజమానుల పేర్లు రాస్తూనే, ఆ సర్వే నంబర్ లో ఆ సంవత్సరం సాగు చేస్తున్న వాస్తవ సాగు దారుల వివరాలను కూడా (జమాబందీ) e క్రాప్ బుకింగ్ లో నమోదు చేయాలి. ఈ మేరకు పట్టాదార్ పాస్ బుక్ చట్టంలో అవసరమైన సవరణ చేయాలి.
రాష్ట్రంలో ప్రత్తి సంవత్సరం కౌలు రైతుల సంఖ్య పెరుగుతున్నది. 2011 భూ అధీకృత సాగుదారుల చట్టం అమలు చేసి కౌలు రైతులను గుర్తించి గుర్తింపు కార్డులు అంద చేయాలి. వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్న గ్రామీణ మహిళలను రైతులుగా నమోదు చేసి , గుర్తింపు కార్డులు ఇవ్వాలి. రాష్ట్ర వ్యవసాయ రంగ పథకాలలో మహిళా రైతులకు కూడా 33 శాతం వాటా కల్పించాలి .
వ్యవసాయ కుటుంబాల ఋణ విముక్తి కమిషన్ కు విశ్రాంత న్యాయమూర్తిని చైర్మన్ గా నియమించాలి. కమిషన్ సభ్యుల ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేయాలి. ఇద్దరు మహిళా సభ్యులనుకూడా కమిషన్ లో నియమించాలి.
RBI గైడ్ లైన్స్ ప్రకారం బ్యాంకు అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్ళి పంటలను చూసి, రైతుకు పంట రుణం ఇవ్వాలి. కానీ అలా కాకుండా రెవెన్యూ రికార్డులలో భూమి యాజమానులుగా ఉన్న వారికి పంట రుణం ఇస్తున్నారు. కౌలు రైతులకు బ్యాంకులు పంట రుణాలు ఇవ్వడం లేదు కనుక, వ్యవసాయం చేయని అనేక మంది భూ యజమానులు వ్యవసాయం చేయకపోయినా, పంట రుణాలు తెచ్చుకుని ఇతర అవసరాలకు వాడుకుంటున్నారు. ప్రభుత్వాలు పంట ఋణ హామీలు ఇచ్చినప్పుడు, బ్యాంకుల నుండీ పంట రుణాలు తీసుకున్న భూ యాజమానులకే ఆ మాఫీ ప్రయోజనాలు దక్కుతున్నాయి. వాస్తవ సాగుదారులుగా ఉన్న కౌలు రైతులకు పంట ఋణ మాఫీ ప్రయోజనం దక్కడం లేదు. ఈ విషయం ప్రభుత్వాలు ముందుగా గుర్తించాలి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోనూ, తెలంగాణ ఏర్పడ్డాక భారాస ప్రభుత్వం 2014, 2018 లలో ఋణ మాఫీ హామీలు అమలు చేసినప్పుడు కూడా చాలా సందర్భాలలో వ్యవసాయం చేయని భూ యజమానులు లబ్ధి పొందారు. ఈ పరిస్థితి ఈ సారి పునరావృతం కాకూడదని మా అభిప్రాయం.
నిజంగా వ్యవసాయం చేసిన రైతులకే ఋణ మాఫీ లబ్ధి దక్కాలి. ముఖ్యంగా సన్న, చిన్నకారు, క్రింది మధ్యతరగతి రైతులకు ( 7.5 ఎకరాల వరకూ) ఈ ప్రయోజనం దక్కాలి. అందుకు అనుగుణంగా ప్రభుత్వం క్షేత్ర స్థాయి విచారణ ద్వారా, వ్యవసాయం చేస్తున్న రైతులను గుర్తించి వారికి ఋణ మాఫీ లబ్ధి దక్కేలా మార్గదర్శకాలు రూపొందించాలి. ఫలితంగా విలువైన బడ్జెట్ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చు.
వ్యవసాయం చేసి అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతులను ఆదుకోవడానికి , ఆయా ప్రత్యేక సందర్భాలలో (ప్రకృతి వైపరీత్యాలతో పంటలు నష్ట పోవడం, ధరలు పడిపోయి ఆదాయాలు తగ్గిపోవడం) ఋణ మాఫీ చేయడంలో అర్థం ఉంటుంది కానీ, గుండు గుత్తగా పంట రుణాలు తీసుకున్న అందరికీ ఋణ మాఫీ చేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. అవే నిధులను వ్యవసాయ రంగ అభివృద్ధికి, రైతుల సంక్షేమం లక్ష్యంగా ఇతర పథకాల అమలుకు వినియోగించవచ్చు.భూమి ఉన్న రైతులతో పాటు , కౌలు రైతులకు కూడా ఎకరానికి 15,000 రైతు భరోసా సహాయం చేస్తామని హామీ ఇచ్చారు . ఒకే సర్వే నంబర్ లో భూమి యజమానికి , కౌలు రైతుకు కూడా రైతు భరోసా పెట్టుబడి సహాయం చేయడం ప్రభుత్వ ఖజానాపై భారమే., నిర్ధిష్ట సంవత్సరంలో భూమి యజమాని, కౌలు రైతులలో, ఎవరు ఆ సర్వే నంబర్ లో సాగు చేస్తారో , వారికే సహాయం అందించడం న్యాయం. సరైంది కూడా.
రైతు భరోసా సహాయం అందించడానికి తప్పకుండా భూమి పరిమితి పెట్టాలి. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఉన్న రైతులకు మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందించాలి. సాగు చేస్తున్న భూములకు మాత్రమే సహాయం అందించాలి. తగిన మార్గదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం అసెంబ్లీ లోనూ, రైతు సంఘలతోనూ ప్రభుత్వం చర్చలు జరపాలి. ఎకరం కంటే తక్కువ స్వంత సాగు భూమి కలిగి ఉండి , ఉపాధి హామీ పథకంలో కూలీ పనికి వెళ్ళే వ్యవసాయ కూలీలకు కూడా కనీసం 15,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తే బాగుంటుంది.
రాష్ట్రంలో పండే పప్పు ధాన్యాలు , నూనె గింజలు , జొన్న సహా , ఇతర చిరు ధాన్యాలను రాష్ట్ర ప్రభుత్వం మార్క్ ఫెడ్ ద్వారా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తే బాగుంటుంది. ఆ మేరకు ఆ పంటలు పండించే రైతులకు ప్రోత్సాహం దొరుకుతుంది. వరి నుండీ ఈ పంటల వైపు రైతులు మళ్ళడానికి అవకాశం కూడా ఉంటుంది. వీటిని ప్రాసెస్ చేసి ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించవచ్చు. మధ్యాహ్న భోజన పథకం, సంక్షేమ హాస్టల్స్ , అంగన్ వాడీ లాంటి ప్రభుత్వ ఆహార పథకాలలో కూడా వినియోగించుకోవచ్చు . అందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేయాలి.
ఇప్పటికీ కనీస మద్ధతు ధరలు లేని పంటలకు రాష్ట్ర స్థాయిలో కనీస మద్ధతు ధరలు ప్రకటించాలి. ఈ ధరలతోనే పంటలను కొనాలని వ్యాపారులకు, బడా రిటైల్ దుకాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించవచ్చు. రాజ్యాంగం 7 వ షెడ్యూల్ ప్రకారం పంటల ధరలు నిర్ణయించే బాధ్యత రాష్ట్ర జాబితాలో ఉంది. ప్రభుత్వం ఈ అధికారం వినియోగించుకునే ప్రయత్నం చేయాలి.
వరంగల్ డిక్లరేషన్ లో హామీ ఇచ్చిన విధంగా వరికి మాత్రమే కాకుండా, పప్పు ధాన్యాలు,నూనె గింజలు, చిరు ధాన్యాల పంటలకు కూడా ప్రభుత్వం బోనస్ ధరలు ప్రకటించాలి. మిరప, పసుపు లాంటి పంటలకు కూడా కనీస మద్ధతు ధరలు ప్రకటించి, అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి.
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ నోడల్ ఏజెన్సీ గా రైతు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు సమన్వయంతో పని చేసి రైతులకు సేవ చేసే విధంగా ఒక ఉమ్మడి ప్లాట్ ఫారం ఏర్పాటు చేయాలి. ఆయా సంఘాలకు అవసరమైన సహకారం ప్రభుత్వం అందించాలి.
మూతపడిన చక్కర కర్మాగారాలను తెరపించే విషయంలో ఒక నిపుణుల కమిటీ వేసి, చెరకు పండే ప్రాంతాలలో కొత్త చక్కర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలి. స్థానిక రైతులు కోరుతున్నట్లుగా, నిజామాబాద్ కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని సహకార రంగంలో తెరిపించడానికి రైతులకు అవసరమైన సహాయం చేయాలి.
2024 ఖరీఫ్ నుండే తప్పకుండా పంటల బీమా పథకం ప్రారంభించాలి. వాతావరణ మార్పుల దృష్ట్యా , ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నందున , వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం కూడా ఎక్కువ పంటలకు వర్తించేలా మార్గదర్శకాలు రాయాలి. ఆంధ్ర ప్రదేశ్ తరహాలో మొత్తం రైతులను లేదా, కనీసం ఏడున్నర ఎకరాల లోపు రైతులకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి బీమా పరిధిలోకి తీసుకు రావాలి. కౌలు, పోడు రైతులకు కూడా ఈ పథకం వర్తింప చేయాలి. ఇందుకు అవసరమైన కనీసం 1500 కోట్ల రూపాయల నిధులను బడ్జెట్ లో కేటాయించాలి.
విపత్తు యాజమాన్య చట్టం 2005 ను ఆ చట్టం స్పూర్తితో అమలు చేసేలా , రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులకు పూర్తి స్వేచ్చ ఇవ్వాలి. ఇన్ పుట్ సబ్సిడీ మొత్తాన్ని ఎకరానికి 10,000 రూపాయలుగా నిర్ణయించి, ఆయా సీజన్ లలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులకు అందించాలి. ఈ విషయంలో కేంద్రం జాతీయ విపత్తు సహాయ నిధి క్రింద (NDRF) అందించే సహాయాన్ని కూడా రాష్ట్రం పూర్తిగా వాడుకోవాలి. రాష్ట్ర బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించాలి 2020 లో భారీ వర్షాలకు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని రాష్ట్ర హై కోర్టు 2021 సెప్టెంబర్ లో ఇచ్చిన తీర్పును అమలు చేయడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు లో వేసిన అప్పీల్ ను ఉపసంహరించుకోవాలి.
రైతు బీమా పథకాన్ని 2023 డిసెంబర్ 1 నుండీ భూమిలేని కౌలు రైతులకు, రైతు కూలీలకు అమలు చేయడానికి వీలుగా ప్రీమియం మొత్తాన్ని బడ్జెట్ లో కేటాయించి, ఆ నిధులతో నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే పథకాన్ని అమలు చేయవచ్చు.