నరేందర్ రెడ్డిని అందుకే కలిశా.. మల్లారెడ్డి క్లారిటీ
తాను కాంగ్రెస్‌లో చేరడానికి చూస్తున్నారన్న వార్తలపై మాజీ మంత్రి మల్లారెడ్డి క్లారిటీ ఇచ్చారు. నరేందర్ రెడ్డి కలవడానికి గల కారణాన్ని వివరించారు.
Update: 2024-03-08 13:31 GMT
తాను కాంగ్రెస్ కండవా కప్పుకోవడానికి సిద్ధమవుతున్నారన్న వార్తలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మల్లారెడ్డి తోసిపుచ్చారు. అందులో ఎటువంటి వాస్తవం లేదని వెల్లడించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాను పార్టీ మారనున్నారని వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ తనకు తల్లి లాంటి పార్టీ అని, అటువంటి పార్టీని విడిచి వెళ్లాలని తాను కలలో కూడా అనుకోనని వ్యాఖ్యానించారు. అనంతరం తాను, తన కుమారుడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయట్లేదనని కీలక ప్రకటన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డిని కలిసిన కారణాన్ని కూడా వివరించారు.
నరేందర్ రెడ్డి అందుకే కలిశాం
సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు నరేందర్ రెడ్డిని ఎందుకు కలిశారు అని ప్రశ్నించగా ఆయన ఇలా బదులిచ్చారు. ‘‘మా అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన కాలేజీ భవనాల కూల్చివేత అంశంపై చర్చించడానికే నరేందర్ రెడ్డి కలిశాము’’ అని స్పష్టం చేశారు. ఆయనతో జరిగిన భేటీలో పార్టీ మార్పు అంశమే రాలేదని, తనకు ఆ ఆలోచనే లేకుంటే అసలు దానిపై ఎందుకు చర్చిస్తామని ఎదురు ప్రశ్నించారు. కేవలం భవనాల కూల్చివేతల గురించి మాట్లాడానని వెల్లడించారు.
అభ్యర్థి ఎవరైనా గెలిపించుకుంటాం
జనవరిలో మీడియతో మాట్లాడుతూ మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి తన బదులు తన కుమారుడు భద్రారెడ్డి బరిలోకి దిగుతారని వెల్లడించారు. తాజాగా కేటీఆర్‌ను కలిసిన భద్రారెడ్డి తాను కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని వారు మీడియాతో కూడా పంచుకున్నారు. ‘‘మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్ ఎవరికి ఇచ్చినా వారిని గెలిపించుకుంటాం. అన్ని వేళల్లో పార్టీ బలోపేతం కోసమే పాటుపడతాం. లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా పార్టీని గెలిపించుకుంటాం. తెలంగాణ ప్రజల సమస్యలను పార్లమెంటులో వినిపిస్తాం’’అని వెల్లడించారు.
ఇదిలా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి.. ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. తొడగొట్టి సవాల్ కూడా చేశారు. అటువంటిది సీఎం అయిన తర్వాత మల్లారెడ్డి అక్రమాలపై దృష్టి పెట్టారని, అక్రమంగా సంపాదించిన ఆస్తులే టార్గెట్‌గా బుల్డోజర్లు నడిపిస్తున్నారని వార్తలు వచ్చాయి. వాటి నేపథ్యంలో సీఎం రేవంత్‌తో కయ్యం పెట్టుకునే కన్నా చేతులు కలుపుకోవడం మేలని భావించే మల్లారెడ్డి.. నరేందర్ రెడ్డి ద్వారా పార్టీ మారాలన్న తన ఆలోచనను సీఎం రేవంత్‌కు చేర్చారని వార్తలు వచ్చాయి. కానీ వాటిలో ఎటువంటి వాస్తవం లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు.