ఆరు ముళ్లు 14 అడుగులు అయ్యాయి..

అసలు బహుభార్యత్వం గురించి భారతదేశ వివాహ చట్టాలు ఏం చెప్తున్నాయి.;

Update: 2025-03-29 08:15 GMT

పెళ్ళి అంటే నూరెళ్ల బంధం.. జన్మన్మల అనుబంధం అంటారు. అందుకే పెళ్ళిని అంగరంగ వైభవంగా.. బంధుమిత్రుల సమక్షంలో జరుపుతారు. పెళ్ళి అనే బంధంలోకి వధూ, వరులు మూడు ముళ్లు, ఏడడుగులతో ప్రవేశిస్తారు. కానీ కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని ఓ యువకుడు మాత్రం వైవాహిక బంధంలోకి ఆరు ముళ్లు.. పద్నాలుగు అడుగులతో ప్రవేశించాడు. ప్రస్తుతం ఈ వార్త సంచలనంగా మారింది. లింగాపూర్ మండలం ఘుమనూర్ గ్రామానికి చెందిన సూర్యదేవ్ అనే యువకుడు పక్కపక్క గ్రామాలకు చెందిన లాల్‌దేవి, జల్కర్‌దేవిలతో కొంతకాలంగా ప్రేమాయణం సాగించాడు. ఈ విషయం ఇటీవల వెలుగు చూసింది. దీంతో గ్రామస్తులు, ఆదివాసీ పెద్దలు, ఇరు కుటుంబాల సభ్యులు, యువతులతో కలిసి మాట్లాడారు. ఈ క్రమంలో యువతులు ఇద్దరూ కూడా సూర్యదేవ్‌ను పెళ్ళి చేసుకుంటామని పట్టుబట్టారు. ఇద్దరినీ పెళ్ళి చేసుకోవడానికి సూర్యదేవ్ కూడా అంగీకరించాడు. వారు మాట్లాడుకుని ముగ్గురం కలిసి జీవించడానికి నిర్ణయించుకున్నామని మారు ముగ్గురు తేల్చి చెప్పారు. దాంతో పెద్దలు, ముగ్గురు కుటుంబాల వాళ్లు అంగీకారించారు. వారికి ఒకే పందిరి కింద, ఒకే ముహూర్తంలో వివాహం జరిపించారు. ఈ తంతుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే అనేక సందేహాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో బహుభార్యత్వం, బహుభర్తతృత్వం నేరం. ఇప్పుడు ఇలా ఎలా పెళ్ళి చేస్తారు అన్న అనుమానాలు చాలా కలుగుతున్నాయి. మరి అసలు బహుభార్యత్వం గురించి భారతదేశ చట్టాలు ఏం చెప్తున్నాయి. హిందూ మ్యారెజ్ చట్టం 1955 ప్రకారం.. బహుభార్యత్వం నేరమా? కాదా? ఇప్పుడు సూర్యదేవ్, ఇద్దరు యువతులు, కుటుంబీకులు, గ్రామస్తులు, ఆదివాసీ పెద్దలపై చట్టప్రకారం చర్యలు ఉంటాయా? అని కొందరు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

అసలు బహుభార్యత్వం అంటే ఏంటి?

ఏకకాలంలో ఒక వ్యక్తి ఒకరికంటే ఎక్కువ మంది భార్యలను కలిగి ఉండటమే బహుభార్యత్వం. ఇద్దరు మహిళలకు తెలిసేలా వివాహం చేసుకున్నా, సంతానం కోసం వివాహం చేసుకున్నా.. ఎలా అయినా ఒక భార్య ఉండగా.. ఆమెకు విడాకులు ఇవ్వకుండా, ఆమెతో చట్టప్రకారం విడిపోకుండా మరో వివాహం చేసుకుంటే అది చట్టరీత్యా నేరం. భారతదేశ చరిత్రలో బహుభార్యత్వం చాలా చోట్ల కనిపిస్తుంది. రాజుల కాలంలో ఇది చాలా సహజంగా ఉండేది. 1955లో ఈ అంశంపై ఒక చట్టం తెచ్చారు. అదే మ్యారెజ్ యాక్ట్ 1955.

చట్టం ప్రకారం బహుభార్యత్వం లీగలా..!

హిందూ వివాహ చట్టం, 1955 బహుభార్యత్వాన్ని నిషేధించింది. ఐపీసీ సెక్షన్ 494 ద్విభార్యత్వం లేదా బహుభార్యత్వాన్ని శిక్షిస్తుంది. ఈ నిబంధన రెండు నిర్దిష్ట సందర్భాలలో వర్తించదు, ఉదాహరణకు.. ఒక వివాహం చెల్లదని కోర్టు ప్రకటించినప్పుడు. చెల్లనిదిగా ప్రకటించబడిన బాల్య వివాహం ఒక ఉదాహరణ అవుతుంది. వివాహం తర్వాత భార్య భర్తలు ఏడు సంవత్సరాలకన్నా ఎక్కువ కాలం ఒకరికొకరు దూరంగా ఉండటం.

రెండవ వివాహం

ఒక వ్యక్తి తన మొదటి భార్య ద్వారా రెండవ వివాహం చేసుకున్నాడని ఆరోపించబడితే, ఆ రెండవ వివాహం చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందో లేదో కోర్టు పరిశీలిస్తుంది. రెండవ వివాహం చెల్లుబాటు అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అది చెల్లుబాటు కాదని కోర్టు తెలిపితే శిక్ష ఉంటుంది. బహుభార్యత్వ కేసులలో, రెండవ వివాహాన్ని చట్టబద్దం చేసే అంశాలు నిరూపించబడాలి. లేనిపక్షంలో శిక్ష తప్పదు. ఐపీసీ సెక్షన్ 495 ప్రకారం.. ఒక వ్యక్తి తన మొదటి భార్యతో చట్టపరంగా విడాకులు తీసుకోవడం, వేరుపడకుండా, తనకు వివాహం అయిందన్న విషయాన్ని దాచిపెట్టి మరో వివాహం చేరసుకుంటే అతను బహుభార్యత్వ నేరానికి పాల్పడిన వాడవుతాడు.. అతనికి చట్టప్రకారం పదేళ్ల జైలు, జరిమానా విధించబడుతాయి.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బహుభార్యత్వాన్ని నిషేధించారు. 1954 ప్రత్యేక వివాహ చట్టం ఒక భార్యనే కలిగి ఉండటాన్ని తప్పనిసరి చేసింది. 1955 హిందూ వివాహ చట్టం హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు బహుభార్యత్వం కలిగి ఉండటాన్ని నిషేధించింది. అయితే చట్టం ప్రకారం నేరమే అవుతున్నా.. భారతదేశంలో బహుభార్యత్వం అనేది కనిపిస్తూనే ఉంది. కొందరు సెలబ్రిటీలు కూడా బహుభార్యత్వంలో ఉన్నారు. కాగా తన భర్త మరో పెళ్ళి చేసుకుని తనను మోసం చేశాడంటూ ఇద్దరు భార్యలలో ఒకరు పోలీసులను, కోర్టులను ఆశ్రయించే వరకు వారు ఎటువంటి యాక్షన్ తీసుకోలేరని, అందువల్లే ఈ బహుభార్యత్వాలు పెరుగుతున్నాయని కొందరు విశ్లేషకులు చెప్తున్నారు.

Tags:    

Similar News