మళ్ళీ హైకోర్టును ఆశ్రయించిన గ్రూప్-1 అభ్యర్థులు

పేపర్లు రీవాల్యుయేషన్ జరిపించాలంటూ డిమాండ్. పేపర్ల మూల్యాంకనంలో అవకతవకలు జరిగయాని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.;

Update: 2025-03-24 09:31 GMT

తెలంగాణ గ్రూప్-1 పరీక్షలు తొలుత నుంచి సంచలనంగా మారుతూనే ఉన్నాయి. మొదట గ్రూప్-1 మెయిన్స్‌ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు.. హైకోర్టు, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ ఆ పరీక్షలు నోటిఫికేషన్ ప్రకారమే సమయానికి జరిగాయి. అయితే ఇటీవల విడుదలైన ఈ పరీక్షల ఫలితాలు మరోసారి సంచలనంగా మారాయి. వీటిలో తీవ్ర అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపించారు. గ్రూప్-1 పరీక్ష పేపర్ల మూల్యాంకనం అత్యంత లోపభూయిష్టంగా జరిగిందని వారు ఆరోపించారు. ఈ క్రమంలోనే గ్రూప్-1 పరీక్ష పత్రాలను రీవాల్యుయేట్ చేయించాలని కోరుతూ వారు మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

‘‘18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్లను దిద్దించారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదు. ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్లు మూల్యాంకనం చేయించారు. అలా చేయడం వల్ల మూల్యాంకనంలో నాణ్యత లోపించింది. తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగింది" అని పిటిషనర్లు పేర్కొన్నారు.

పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ)కి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. పిటిషన్పై తదుపరి విచారణను న్యాయస్థానం నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News