హైదరాబాద్‌లో పెరుగుతున్న డాగ్ లవర్స్, కుక్కపిల్లల దత్తతకు డిమాండ్

హైదరాబాద్ నగరంలో డాగ్ లవర్స్ సంఖ్య పెరుగుతోంది.;

Update: 2025-09-07 08:10 GMT
కుక్కపిల్లలను దత్తత తీసుకున్న డాగ్ లవర్స్

హైదరాబాద్ నగరంలో యువతీ యువకులు కుక్కపిల్లలను పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.వివిధ వృత్తులు, వ్యాపకాలు సాగిస్తున్న యువత తమ ఇళ్లలో పెట్ డాగ్స్ పెంచుకోవడానికి ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో నగరంలో పెట్ డాగ్స్ ను దత్తత తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. కొందరు యువతీయువకులు వీధి కుక్కలను సైతం చేరదీసి వాటికి నిత్యం అన్నం పెడుతున్నారు. ఇటీవల పెట్ డాగ్స్ ను పెంచుకోవడమే కాదు జంతుప్రేమికుల సంఖ్య పెరుగుతోంది.దీంతో నగరంలో పప్పీస్ అడాప్షన్ క్రేజీగా మారింది.




 రేవతికి డాగ్స్ అంటే ఎంతో ఇష్టం

ఖైరతాబాద్ ప్రాంతానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ ఎ రేవతికి కుక్కపిల్లలంటే ఎంతో ఇష్టం. నిత్యం ఫ్యాషన్ డిజైనింగ్ పనిలో బిజీగా ఉన్నా రేవతి మాత్రం తన ఇంట్లో ఏడు కుక్కలను చేరదీసి పెంచుకుంటున్నారు. రెండు పెట్ డాగ్స్ తోపాటు అయిదు వీధ కుక్కల ఆలన పాలనను రేవతి దగ్గరుండి చూసుకుంటున్నారు. ‘‘నేను ఉదయాన్నే ఏడు కుక్కలకు పెడిగ్రే పెడుతుంటాను. సాయంత్రం ఇంటికి రాగానే కుక్కలకు రేషన్ బియ్యంతో వండిన అన్నంతో పాటు చికెన్ లివర్ కలిపి పెడుతుంటాను. నేను ఇంటికి తిరిగి వచ్చే దాకా నా పెంపుడు కుక్కలు ఎధురుచూస్తుంటాయి. వాటితో కాసేపు ఆడుకోవడం ద్వారా వృత్తిలో ఏర్పడిన ఒత్తిడి, అలసటను మర్చిపోతుంటాను, నా పెంపుడు కుక్కనే నాకు స్నేహితుల్లాంటివి’’అని అంటారు డాగ్ లవర్ రేవతి.

చిన్ననాటి నుంచి కుక్కలతో అనుబంధం
‘‘మా ఇంట్లో పెంపుడు కుక్కలు ఉండటంతో నాకు చిన్న నాటి నుంచి అవంటే అనుబంధం ఏర్పడింది’’అంటారు హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ భట్టు మొహిత్. ‘‘నాకు విదేశీ జాతులైన గోల్డెన్ రిట్రీవర్, లాబ్రోడార్, షిజ్జు, జర్మన్ షెపర్డ్ కుక్కలంటే ఎంతోఇష్టం. అందుకే నేను అయిదు కుక్కలను పెంచుకుంటున్నాను. నా పెంపుడు కుక్కలతో ఆడుకుంటే చాలు నాకు వృత్తి పరమైన ఒత్తిడి దూరమవుతుంది’’అంటారు మొహిత్.తాను ఒకరోజు అయిదు వీధికుక్కలకు ఆహారం పెడితే అవి తన ఇంటికి వచ్చేశాయని, వాటిని తానే ఫీడ్ చేస్తున్నంటారు మొహిత్.



 జంతు సంరక్షణలో మాజీ ప్రిన్సిపాల్

వీధి కుక్కలే కాదు ఇతర జంతువుల సంరక్షణకు వనితా కళాశాల మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పి వసుంధర పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. తనకు చిన్ననాటి నుంచి జంతువులంటే ఎంతో ఇష్టమని, అందుకే వాటిని పెంచుకుంటున్నానని చెబుతారు వసుంధర. కుక్కలు, క్రిమికీటకాలు, తాబేళ్లు, పక్షులను తాను పెంచుతుంటానంటారు.



 ప్రమాదంలో గాయపడిన కుక్కను కాపాడాను...

హైదరాబాద్ నగరానికి చెందిన నేహా జాకబ్ ఓ రోజు రోడ్డుపై వస్తుండగా ఓ వీధికుక్క ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడింది. దాన్ని తీసుకువచ్చి శస్త్రచికిత్స చేయించి పునరావాసం కల్పించానంటారు నేహా జాకబ్. కుక్క కాలు విరగడంతో మెటల్ ప్లేటు వేసి, తోకను కత్తిరించి చికిత్స చేయించాను. ఈ కుక్క కోలుకున్నాక దత్తత తీసుకున్నాను. నా పెంపుడు కుక్కలు గోల్డెన్ రిట్రీవర్ మాగ్జిమస్ అనే పెంపుడు కుక్కతో పాబ్లో వీధి కుక్క కూడా కలిసి ఉంటోందంటారు నేహా. కుక్కల ఆలన పాలనలో నేనెంతో సంతోషిస్తుంటానంటారు నేహా.



 కుక్క పిల్లల దత్తతకు యువత ఆసక్తి

హైదరాబాద్ నగరంలో కుక్కపిల్లల దత్తతకు యువతీ, యువకులు ఆసక్తి చూపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గడచిన రెండు వారాలుగా కుక్క పిల్లల దత్తత కార్యక్రమం సాగింది. గత వారం కేబీఆర్ పార్కులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 22 కుక్క పిల్లలను డాగ్ లవర్స్ కు దత్తత ఇచ్చారు. జలగం వెంగళరావు పార్కులోనూ కుక్కపిల్లల దత్తత కార్యక్రమానికి యువత నుంచి అనూహ్య స్పందన లభించింది. దేశీ కుక్కపిల్లల దత్తత మేళాలో యువతీ, యువకులు వచ్చి వారికి నచ్చిన కుక్కపిల్లలను దత్తత తీసుకున్నారు. కుక్క పిల్లలను పెంచుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చొరవ తీసుకున్నారు. మేళాలో కుక్క పిల్లలకు టీకాలు వేసి సురక్షితమైనవని వెటర్నరీ అధికారులు ప్రకటించారు. కుక్కల పట్ల ప్రేమను ప్రోత్సహించేందుకు జీహెచ్ఎంసీ దత్తత కార్యక్రమాన్ని చేపట్టింది.

జర్మన్ షెపర్డ్ దియా కుక్కపిల్ల దత్తత
జర్మన్ షెపర్డ్ క్రాస్ నలుపురంగు కళ్లు, ఫ్రెండ్లీ కుక్క పిల్లను పెట్ లవర్ దత్తత తీసుకున్నారు. పప్పీస్ అడాప్షన్ కోసం హైదరాబాద్ నగరంలో పలు స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి. పలు జాతుల కుక్కపిల్లలను 10వేల రూపాయల నుంచి లక్షల రూపాయల దాకా ధర పలుకుతున్నాయి.

మా పెంపుడు కుక్క తప్పిపోయింది...
బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ జర్మన్ షెపర్డ్ ఎల్సా పెట్ హైదరాబాద్ నగర శివార్లలోని వంపుగూడ ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకు కాలనీ సమీపంలో తప్పిపోయిందని , దీని ఆచూకీ చెప్పిన వారికి రివార్డు ఇస్తామని పెట్ లవర్ ప్రకటించారు. మా పెంపుడు కుక్క తప్పిపోయిందని, దీని ఆచూకీ తెలిస్తే చెప్పండంటూ పలువురు డాగ్ లవర్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

సుప్రీంకోర్టు తాజా తీర్పు ఏం చెప్పిందంటే...
వీధి కుక్కలకు స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఆశ్రయాల నుంచి విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లే కాదు టీకాలు వేసి, నులిపురుగుల నిర్మూలన తర్వాత వీధుల్లో వదిలేయాలని సుప్రీం సూచించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కుక్కల ప్రేమికులు, పశువైద్యులు, జంతు సంక్షేమ శాఖ అధికారులు స్వాగతించారు.



 కుక్కల కోసం కొండాపూర్ లో డాగ్ పార్కు

కుక్కల కోసం కొండాపూర్ లో డాగ్ పార్కు వెలసింది. బంజారాహిల్స్ లో పెట్ కేఫ్, మాధాపూర్ లో ఫెలికా కేఫ్, మణికొండలో కేఫీ డీ లోకోలు వెలిశాయి. పెంపుడు కుక్కల వీడియోలను పంచుకునేందుకు, అవి చేసే అల్లరి పనుల గురించి చర్చించడానికి డాగ్ లవర్స్ వారాంతాల్లో కలుస్తుంటారు.నగరంలో పెట్ లవర్స్ కుక్కల కోసం బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్, హైదరాబాద్ కెనైన్ క్లబ్, నోహ్స్ ఆర్మీ, హైదరాబాద్ పెట్ అడాప్షన్, యానిమల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సొసైటీ, పీపుల్ ఫర్ యనిమల్స్,తెలంగాణ స్టేట్ ఎనిమల్ వెల్ఫేర్ బోర్డు, పీపుల్స్ ఫర్ ఎనిమల్, సంస్థలు వెలిశాయి. హైదరాబాద్ కెనైన్ క్లబ్ లాభాపేక్ష లేకుండా డాగ్ షోలను కూడా నిర్వహిస్తోంది. పెట్ యజమానులు టూరుకు వెల్లాల్సివస్తే పెంపుడు కుక్కలను హాస్టళ్లలో వదిలి వెళ్లేలా పలు కుక్కల హోం స్టేలు వెలిశాయి.



 పీపుల్స్ ఫర్ ఎనిమల్

హైదరాబాద్ నగరానికి చెందిన కృష్ణా వాడి, వాసంతి వాడి మరికొంతమంది జంతుప్రేమికులు కలిసి మొట్టమొదటిసారి అభయ పేరిట జంతు సంక్షేమ సంస్థను స్థాపించారు. వీధి కుక్కలే కాదు గాయాల పాలైన పలు జంతువులను ఈ సంస్థ కాపాడి పునరావాసం కల్పిస్తుంది. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో జంతువుల సంక్షేమం కోసం అభయను కాస్తా మేనకాగాంధీ, డాక్టర్ లక్ష్మీరమణ, డాక్టర్ సయ్యద్ ఖాద్రిలో కలిసి పీపుల్ ఫర్ యనిమల్స్ పేరిట కొత్త సంస్థను ఆరంభించారు. నాటి నుంచి నేటి వరకు జంతు సంక్షేమం, వీధి కుక్కల సంరరక్షణకు ఈ సంస్థ పలు కార్యక్రమాలు చేపడుతోంది.గాయపడిన జంతువులకు చికిత్స అందించడం, వదిలేసిన జంతువులను దత్తత తీసుకోవడం, జంతు హింస, వన్యప్రాణుల వేటపై కేసులు పెట్టడం ఈ సంస్థ వాలంటీర్లు పనిచేస్తున్నారు. దీని కోసం ఈ సంస్థ రెస్క్యూ హోం కూడా నిర్వహిస్తోంది.



 బ్లూక్రాస్ సేవలు

1992 వ సంవత్సరంలో హైదరాబాద్ నగరంలో సినీనటి అక్కినేని అమల ప్రారంభించిన బ్లూక్రాస్ 32 ఏళ్లుగా 5,59.504 జంతువులను కాపాడింది. లక్షన్నరకు పైగా జంతువులకు యాంటీ రాబీస్ వ్యాక్సిన్లు వేసింది.బ్లూక్రాస్ వీధి కుక్కలకు జనన నియంత్రణ, టీకాలు వేయడంతోపాటు జంతు సంక్షేమానికి చర్యలు తీసుకుంటోంది. వాలంటీర్లు గాయపడిన, అనారోగ్యానికి గురైన కుక్కలు, ఇతర జంతువులను తమ క్లినిక్ కు తీసుకువచ్చి వాటికి అత్యవసర చికిత్స అందించి పునరావాసం కల్పిస్తున్నారు.వాలంటీర్లు, పశువైద్యులు, పెంపుడు జంతువుల యజమానులు, జంతు సంక్షేమ సమూహాలు, విద్యార్థులకు జంతువుల పెంపకంపై ఈ సంస్థ శిక్షణను అందిస్తుంది.


Tags:    

Similar News