కాంగ్రెస్ పాలనలో విలవిలాడుతున్న విద్యార్థులు.. హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల తెలంగాణలోని విద్యార్థులు తీవ్ర అవస్థలుపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్ల తెలంగాణలోని విద్యార్థులు తీవ్ర అవస్థలుపడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. విద్యార్థుల కష్టాలను తీర్చడం కోసం తమ ప్రభుత్వం ఎంతో కష్టపడుతోందని, డైట్, కాస్మోటిక్స్ ఛార్జీలకు కూడా పెంచిందని సొంతడబ్బా కొట్టుకోవడం కాదని, నిజంగా విద్యార్థులకు మంచి చేయాలని సూచించారు. విద్యార్థుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యానికి కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన ఉన్నత పాఠశాలలోని పరిస్థితులే నిదర్శనమని ఎద్దేవా చేశారు హరీష్ రావు. వాంకిడి పాఠశాలలోని పరిస్థితులు రోజురోజుకు విషమిస్తున్నాయని, అయినా ప్రభుత్వం చలనం లేకుండా దిష్టిబొమ్మలా నిల్చుందంటూ చురకలంటించారు హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్(ట్విట్టర్) వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతే విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు హీరష్ రావు. కాంగ్రెస్ పాలనలోనే అత్యధిక ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు జరిగాయని, విద్యార్థులకు నాశిరకం ఆహారం అందిస్తుండటమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందిస్తే.. కాంగ్రెస్ మాత్రం విద్యార్థులను అసలు పట్టించుకోవడం లేదని, సొంత డబ్బా మాత్రం గట్టిగా కొట్టుకుంటుందని మండిపడ్డారు.
విద్యార్థులకు శాపంగా ప్రభుత్వ నిర్లక్ష్యం
‘‘ప్రభుత్వ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపమవుతున్నది. సోకాల్డ్ ప్రజా పాలనలో అభం శుభం తెలియని పిల్లల భవిష్యత్తు ఆందోళనకరమవుతున్నది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులు అస్వస్థత గురైతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేకపోవడం దుర్మార్గం. స్థానికంగా ఉన్న ఆసుపత్రుల్లో విడతల వారీగా విద్యార్థులను చేర్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారికి మెరుగైన వైద్యం అందించే ప్రయత్నం చేయడం లేదు. వెంటిలేటర్ మీదకు చేరిన ఆ విద్యార్థిని పరిస్థితికి ఎవరు బాధ్యులు. సకాలంలో వైద్యం అందించడంలో ఎందుకు విఫలం అయ్యారు. విద్యాశాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉంది. రోజురోజుకి దిగజారుతున్న గురుకులాల ఖ్యాతిని నిలిపే ప్రయత్నం చేయకపోవడం సిగ్గుచేటు’’ అని హరీష్ రావు పోస్ట్ పెట్టారు. అయితే విద్యార్థులకు నాణ్యమైన, పోషకాహారం అందించాలని తమ ప్రభుత్వ ఆశిస్తోందని, అందుకే వాళ్ల డైట్ ఛార్జీలను ఎన్నడూ లేని విధంగా 40 శాతం పెంచామని ఇటీవల మంత్రి సీతక్క వెల్లడించారు.
సీతక్క ఏం చెప్పారంటే..
‘‘హాస్టల్, గురుకుల విద్యార్థుల డైట్ ఛార్జీలను 40 శాతం పెంచిన రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు. విద్యార్థుల డైట్ కాస్మోటిక్ ఛార్జీలను 40 శాతం పెంచడం చరిత్రలో ఇదే తొలిసారి. గత ఏడేళ్లుగా డైట్ ఛార్జీలను, 16 ఏళ్లుగా కాస్మోటిక్ ఛార్జీలను పెంచిన దాఖలాలు లేవు. బీఆర్ఎస్ హయాంలో డైట్ ఛార్జీలను పిసరంత పెంచి ప్రచారం మాత్రం చాటంత చేసుకున్నారు. ఏడేళ్లలో కూరగాయలు, నిత్యావసరాల సరుకుల ధరలకు విపరీతంగా పెరిగాయి. ఈ విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయినా అందుకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలను ఎందుకు పెంచలేదో బీఆర్ఎస్ పార్టీ, లేదా ఆనాటి సీఎం కేసీఆర్ బయటకొచ్చి చెప్పాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ చేసిన ఈ పనులకు విద్యార్థులు అర్థాకలితో ఇబ్బందులు పడ్డారు. రుచిపచి లేని ఆహారం తినలేక.. ఆకలి తట్టుకోలేక తింటే.. సరిపడా లేక చాలా సమస్యలు ఎదుర్కొన్నారు విద్యార్థులు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు సీతక్క.
7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
‘‘డైట్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతోనే పెరిగిన ఛార్జీలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ ఛార్జీలను పెంచడం జరిగింది. పెంచిన ఛార్జీలతో విద్యార్థులకు మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని కడుపునిండా పెట్టగలం. కాగా ప్రతి విద్యార్థికి పోషకాహారం అందేలా చూసే బాధ్యత టీచర్లు, హాస్టల్ సిబ్బందిదే. హాస్టల్ విద్యార్థులకు డైట్, కాస్మోటిక్ ఛార్జీలను గ్రీన్ ఛానెల్ ద్వారా చెల్లిస్తాం. విద్యార్థుల నుంచి వసతులు, ఆహారానికి సంబంధించి ఒక్క ఫిర్యాదు వచ్చినా కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని హెచ్చరించారు సీతక్క.