తెలంగాణలో 2 రోజుల పాటు వర్షాలు

నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు.;

Update: 2025-07-23 08:05 GMT
వాతావరణ పరిస్థితులపై ఐఎండీ విడుదల చేసిన ఛాయాచిత్రం

మంచిర్యాల, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్,పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, వరంగల్ హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భాతర వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. అతి భారీవర్షాల వల్ల వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కొండ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని హెచ్చరించింది. వ్యవసాయ, పండ్ల తోటలు దెబ్బతినే ప్రమాదముందని ఐఎండీ పేర్కొంది. మూడు జిల్లాల్లోనూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరింది.


రేపు భారీ నుంచి అతి భారీవర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, జనగామ జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ శాస్త్రవేత్తలు వివరించారు.

16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంలో బుధవారం 16 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్నట్లు భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్తలు ప్రకటించారు.రాష్ట్రంలో బుధవారం పలు జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని భారతవాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం శాస్త్రవేత్త ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, పెద్దపల్లి, రంగారెడ్డి, సిద్ధిపేట, వనపర్తి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురుస్తుందని ఆయన వెల్లడించారు. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులతోపాటు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని ధర్మారాజు వివరించారు.

వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి : పోలీసుల కీలక ప్రకటన
హైదరాబాద్‌లో బుధవారం అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని హైదరాబాద్ పోలీసులు సూచించారు. అవసరమైతే తప్ప ఎవరూ బయటికి రావద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు వీలైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలని సైబరాబాద్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటికే తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : మంత్రి పొన్నం సూచన
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ , కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్,హైడ్రా కమిషనర్ రంగనాథ్,మెట్రో వాటర్ వర్క్,ట్రాఫిక్ తదితర అధికారులతో మాట్లాడారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని పొన్నం సూచించారు.హైదరాబాద్ లో ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఎన్డిఆర్ఎఫ్, ఏస్డిఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.గత వారం కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని మరోసారు అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వాటర్ లాగింగ్ పాయింట్ ల పై ఫోకస్
హైదరాబాద్ నగరంలో వర్షాల వల్ల నీరు నిలిచే వాటర్ లాగింగ్ పాయింట్ ల పై స్పెషల్ ఫోకస్ పెట్టాలనీ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ సెంట్రల్ జోన్ చీఫ్ ఇంజనీర్ రత్నాకర్ ను ఆదేశించారు. ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తో కలసి లక్డీ కపూల్ వద్ద మెహదీ ఫంక్షన్ హాల్, పిటిఐ, చీచా రెస్టారెంట్ వద్ద వాటర్ లాగింగ్ పాయింట్ ను పరిశీలించారు.అప్పటికే అక్కడ నిలిచిన వర్షపు నీరును ఇంజనీరింగ్ అధికారులు తొలగించారు. సాధ్యమైనంత త్వరగా లెవెల్ డిఫరెన్స్ తొలగించడంతో పాటు సీసీ వేయాలనీ కమిషనర్ చీఫ్ ఇంజనీర్ ను ఆదేశించారు.


Tags:    

Similar News