‘గ్రూప్-1 పరీక్షల ఫలితాలపై స్పష్టత ఇవ్వండి’

తెలుగులో పరీక్ష రాసిన వారికి మార్కులు ఏ విధంగా కేటాయించారని న్యాయస్థానం ప్రశ్నించింది. సబ్జెక్ట్‌ల నిపుణులు మార్కులు ఇచ్చారని న్యాయవాది తెలిపారు.;

Update: 2025-05-01 12:31 GMT

టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల మూల్యాంకనాల్లో భారీ అవకతవకలు జరిగాయని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పరీక్షను తెలుగులో రాసిన వారికి మార్కులు తగ్గించారని వారు ఆరోపించారు. ఈ మేరకు వారు తమకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న న్యాయస్థానం.. అసలు తెలుగులో రాసిన వారికే మార్కులు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. గురువారం ఈ పిటిషన్‌పై మరోసారి విచారణ జరిగింది. ఈ క్రమంలో పిటిషనర్ల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పరీక్ష కేంద్రాల కేటాయింపులో కూడా నిబంధనలు పాటించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అభ్యర్థుల మార్కులను మరోసారి మూల్యాంకనం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే కొందరు అభ్యర్థులు గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై అపోహపడుతున్నారని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. దీంతో అసలు తెలుగులో పరీక్ష రాసిన వారికి మార్కులు ఏ విధంగా కేటాయించారని న్యాయస్థానం ప్రశ్నించింది. అయితే ఆయా సబ్జెక్ట్‌ల నిపుణులు మూల్యాంకనం చేసి మార్కులు ఇచ్చారని న్యాయవాది తెలిపారు. దీంతో ఈ పరీక్షల్లో తెలుగులో జవాబులు రాసిన వారికి మార్కుల కేటాయింపు ఎలా జరిగింది అన్న అంశంపై అధికారులు వివరణ ఇవ్వాలని న్యాయస్థానం తెలిపింది.

ఇదే పిటిషన్‌పై బుధవారం కూడా హైకోర్టు విచారణ జరిపింది. ఈ నేపథ్యంలో జస్టిస్ నామవరపు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. తమిళనాడులో ప్రజలకు ఎన్ని భాషలు వచ్చినా వారు తమిళంలోనే మాట్లాడతారని, ఇక్కడ మాత్రం ఆంగ్లంలో మాట్లాడే వారికి ఎక్కువ మర్యాద ఇస్తారని, ఇది తాను స్వానుభవంతో చెప్తున్నానని అన్నారు. ‘‘తెలుగులో గ్రూప్‌-1 పరీక్ష రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయన్నది ప్రధాన ఆరోపణ. దీనికి కారణమేమిటో స్పష్టత ఇవ్వాలి. మెయిన్స్‌ మూల్యాంకనంలో అనుసరించే ప్రాతిపదిక, మార్కుల కేటాయింపు విధానంపై వివరణ ఇవ్వాలి’’ అని టీజీపీఎస్సీని ఆదేశించారు.

Tags:    

Similar News