హైదరాబాద్ రమజాన్ దాతృత్వం...రూ.500 కోట్ల జకాత్ పంపిణీ

హైదరాబాద్ నగరంలో పవిత్ర రమజాన్ మాసంలో ‘జకాత్’ పేరిట దాతృత్వం వెల్లివిరిసింది. ఈ ఏడాది పేదలకు రూ.500కోట్ల రూపాయలకుపైగా జకాత్ విరాళాలు పేదలకు పంపిణీ చేశారు.

Update: 2024-03-26 06:11 GMT
జకాత్ డబ్బుతో పేద విద్యార్థికి ల్యాప్‌టాప్ ప్రదానం చేస్తున్న మేనేజింగ్ ట్రస్టీ గయాసుద్దీన్ బాబూఖాన్

దేశంలోనే అధిక ముస్లిం జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. నిరుపేదలకు ఏ ఆపద వచ్చినా, తామున్నామంటూ ముందుకు వచ్చి ఆదుకునే స్వభావం, దాన గుణం హైదరాబాదీలకు ఉంది. పవిత్ర రమజాన్ మాసంలో మనసున్న హైదరాబాదీలు ఆపన్నులను, పేదలను ఆదుకునేందుకు ముందుకు వచ్చారు. జకాత్ పంపిణీపై ముస్లింలలో అవగాహన పెరగడంతో ఏ యేటికాఏడు నగరంలో జకాత్ పంపిణీ పలు రెట్లు పెరుగుతోంది...

పాత నగరానికి చెందిన షేక్ ఇష్రత్ అనే మహిళ భర్త మరణించడంతో వితంతువుగా మారారు. వితంతువు తన కాళ్లపై తాను నిలబడేలా జకాత్ విరాళాలతో ఇష్రత్ కు కుట్టుమిషన్ అందించి ఉపాధి కల్పించి, ఆమె జీవితంలో వెలుగునింపారు. నిరుపేద విద్యార్థి సాజిద్ కు ఐఐటీలో సీటు రావడంతో జకాత్ డబ్బుతో ఆ విద్యార్థికి ల్యాప్‌టాప్ ను హైదరాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గయాసుద్దీన్ బాబూఖాన్ ప్రదానం చేసి, ఆయన చదువుకు ఆసరా అందించారు. ఇష్రత్, సాజిద్ జీవితాలే కాదు మరెందరో నిరుపేదల జీవితాల్లో జకాత్ వెలుగులు నింపింది...
రమజాన్ మాసంలో గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న ముస్లింలంతా హైదరాబాద్ కు తరలివచ్చారు. నెలరోజుల పాటు గల్స్ ఉద్యోగులు కుటుంబంతో కలిసి ఉపవాసం ఉండి, వారి ఆదాయంలో 2.5 శాతాన్ని జకాత్ కింద పంపిణీ చేసి, పండుగ చేసుకొని తిరిగి వెళతారు. దీంతో జకాత్ నిధుల కోసం ఉత్తరాది రాష్ట్రాలైన బీహార్, పశ్చిమబెంగాల్,మధ్యప్రదేశ్, యూపీ రాష్ట్రాల నుంచి మదర్సాలు, అనాథ ఆశ్రమాల నిర్వాహకులు హైదరాబాద్ వచ్చారు. ఈ నెల రోజుల్లో వచ్చిన విరాళాలతో ఏడాది మొత్తం మదర్సాలు,అనాథ ఆశ్రమాలను నిర్వహిస్తుంటారు. దీంతో నగరంలో జకాత్ పంపిణీ సందడి నెలకొంది...

ఉపవాసాలే కాదు ధర్మదానాలకు పవిత్ర మాసం...
సంవత్సరం అంతా కష్టపడి ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి సంపాదిస్తారు. ఆ సంపాదించిన మొత్తంలో 2.5 శాతాన్ని పేదలకు రమజాన్ మాసంలో పేదలకు దానాలు చేస్తుంటారు. ఇదీ ఇస్లాం సూచించిన దాన ధర్మ మార్గం. పేదలకు దానం చేయడమే కాకుండా, పవిత్ర రమజాన్ మాసంలో నెలరోజుల పాటు నిష్టగా ఉపవాసాలు ఉండి అల్లాహ్ అనుగ్రహం కోసం అయిదు పూటలతోపాటు రాత్రివేళ ప్రత్యేకంగా తరావీ నమాజ్ చేస్తున్నారు. ఇలా 30 రోజుల తర్వాత పండుగ చేసుకొని మళ్లీ ఉద్యోగ, వ్యాపార పనుల్లో నిమగ్నమవుతుంటారని హైదరాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధి షాబాద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జకాత్ పంపిణీకి వెలసిన స్వచ్ఛంద సంస్థలు
హైదరాబాద్ నగరంలో జోరుగా సాగుతున్న జకాత్ పంపిణీతో ఈ దానాన్ని అసలైన, ఆపన్నులైన పేదలకు పంపిణీ చేయాలనే ఉన్నతాశయంతో పలు జకాత్ స్వచ్ఛంద సంస్థలు వెలిశాయి. హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్టు, హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్, మెస్కో, ఇస్లామిక్ సోషల్ సర్వీస్ సొసైటీ, జకాత్ సెంటర్ ఇండియా తదితర సంస్థలు సేకరించిన జకాత్ నిధులను పేదలకు పంపిణీ చేస్తున్నారు. జకాత్ పై అవగాహన పెరగడంతో హైదరాబాద్ ముస్లింలు ఏటా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా జకాత్ విరాళాలు పేదలకు పంచుతున్నట్లు జకాత్ సంస్థల అనధికారిక గణాంకాలే వెల్లడించాయి.

జకాత్‌లో గల్ఫ్ ఎన్ఆర్ఐలదే అధిక వాటా
ఈ జకాత్ అందించడంలో అధిక భాగం హైదరాబాద్ ఎన్ఆర్ఐలదేనని గల్ఫ్ ఉద్యోగి అమానుల్లా ‘ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. జకాత్ కింద పేదలకు నిత్యావసరాలను అందించి వారి ఆకలి తీరుస్తున్నారు. కొన్ని సంస్థలు విద్య, వైద్య సేవలకు జకాత్ నిధులను ఖర్చుచేస్తున్నాయి. జకాత్ సెంటర్ ఇండియా వితంతువులకు ఉపాధి అవకాశాలు కల్పించి, వారి ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఈ జకాత్ నిధులను వెచ్చిస్తున్నాయి. జకాత్ సాయంతో పేదల జీవితాల్లో వెలుగు నింపాలనేదే తమ లక్ష్యమని హైదరాబాద్ జకాత్ అండ్ చారిటబుల్ ట్రస్టు ముఖ్య ప్రతినిధి జావీద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జకాత్ అంటే ఏమిటి?
ఇస్లాం మూల ఐదు స్తంభాల్లో ఒకటి జకాత్. ప్రతీ ముస్లిం తన సంవత్సర ఆదాయంలో 2.5 శాతాన్ని పేదలకు విధిగా సహాయం చేయాలి. దీన్నే జకాత్ అంటారు. ఇలా ప్రతి ఏటా పవిత్ర రమజాన్ మాసంలో పేదల విద్య, ఆహారం, దుస్తులు, వితంతువుల ఉపాధి కల్పన, వైద్య సహాయం కోసం జకాత్ నిధులను వెచ్చిస్తుంటారు. ధనవంతుల సంపదలో పేదలకు కూడా హక్కు ఉందని దివ్య ఖుర్ఆన్‌లో అల్లాహ్ చెప్పారని, ఆయన చూపించిన మార్గంలో ముస్లింలు పయనిస్తుండటంతో హైదరాబాద్ నగరంలో జకాత్ పంపిణీ పెరిగిందని మక్కా మసీదు హఫీజ్ ముహమ్మద్ రిజ్వాన్ ఖురేషి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.

జకాత్ ఎలా లెక్కిస్తారంటే...
ప్రతీ ముస్లింకు తన సంవత్సర ఆదాయంలో 2.5శాతాన్ని జకాత్ కింద లెక్కించి దాన్ని రమజాన్ మాసంలో అవసరమున్న పేదలకు పంపిణీ చేస్తుంటారు. బంగారం, వెండి, భూములు, భవనాల విక్రయం ద్వారా వచ్చే ఆదాయం, షేర్లు, బ్యాంక్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్,పంట ఉత్పత్తులు, పౌల్ట్రీ, డెయిరీ, చేపల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం, చేతిలో ఉన్న నగదు ఇలా ఒకటేమిటి? వచ్చే మొత్తం ఆదాయంలో 2.5శాతాన్ని లెక్కించి...ఆ మొత్తాన్ని సమాజంలోని పేదలకు సహాయం చేస్తారు.

30 ఏళ్లుగా హైదరాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ సేవలు
పేద ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా హైదరాబాద్ నగరంలో 1993వ సంవత్సరంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గయాసుద్దీన్ బాబుఖాన్ నేతృత్వంలో హైదరాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటైంది. ఈ ట్రస్టు వికారాబాద్ పట్టణంలో 120 ఎకరాల విస్తీర్ణంలో పేద విద్యార్థులకు ఉచితంగా మెరుగైన విద్య అందించాలనే ఉన్నతాశయంతో హైదరాబాద్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను ప్రారంభించింది. ఇప్పటివరకు ఈ కళాశాల ద్వారా 1450 మంది విద్యార్థులకు ఉచితంగా విద్యను అందించారు. పేదలకు రేషన్ పంపిణీ కోసం రూ. 2.5కోట్లు, పాఠశాల విద్యా ప్రాజెక్టు కింద రూ.1.9 కోట్లు, వితంతువులకు స్కాలర్ షిప్ ల పంపిణీకి రూ.65 లక్షలు, ప్రొఫెషనల్ కోర్సుల కోసం రూ,19.60 లక్షల నిధులను వెచ్చించారు. ‘‘గ్రామీణ ప్రాంతాల్లోని పేదల అభ్యున్నతి పథకాల్లో భాగంగా 91 ఉర్దూమీడియం ప్రభుత్వ పాఠశాలల్లో 23వేలమంది విద్యార్థులకు,1600మంది వితంతువులకు మా ట్రస్టు సహాయం అందించింది’’ అని ట్రస్టు ముఖ్య ప్రతినిధి జావీద్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. హైదరాబాద్ నగరంలో 30 ఏళ్లుగా తమ ట్రస్టు ఆధ్వర్యంలో 63కోట్ల రూపాయలకు పైగా నిధులతో తాము పలు సంక్షేమ పథకాలను అమలు చేశామని హైదరాబాద్ జకాత్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గయాసుద్దీన్ బాబుఖాన్ చెప్పారు.

జకాత్ డబ్బుతో పేద రోగులకు ఉచితంగా వైద్యం
జకాత్ విరాళాలతో పేద రోగులకు ఉచితంగా వైద్యం కూడా అందిస్తున్నారు. ఈ ఏడాది జకాత్ డబ్బుతో పేద రోగులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచితంగా శస్త్రచికిత్సలు కూడా చేపిస్తున్నామని హైదరాబాద్ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముజ్తబా హసన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నిరుద్యోగులు, వితంతువుల ఉపాధి కల్పనకు కూడా ఈ నిధులు పంపిణీ చేస్తున్నామని దీని ద్వారా వారి జీవితాల్లో వెలుగు నింపుతున్నామని హసన్ పేర్కొన్నారు. పేద మహిళలు, వితంతువులకు దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, బ్యూటీపార్లర్లు, టైలరింగ్ షాపుల ఏర్పాటుకు జకాత్ నిధులను సాయంగా అందిస్తున్నారు. పేద యువకులకు జకాత్ నిధులతో బైక్ లు ఇప్పించడం ద్వారా వారు ఫుడ్ డెలివరీ బాయ్ లుగా, ఈ కామర్స్ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లుగా బైక్ డ్రైవరుగా పనిచేస్తూ వారి కుటుంబాలను పోషించుకునే అవకాశం లభిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని మరో జకాత్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి చెప్పారు.

పేదరిక నిర్మూలన లక్ష్యంతో జకాత్ సెంటర్ ఇండియా
పేదరికాన్ని నిర్మూలించాలని లక్ష్యంతో ఏర్పాటైన జకాత్ సెంటర్ ఇండియా ధనవంతులైన ముస్లింల నుంచి జకాత్ సేకరించి దాన్ని పేదల జోవనోపాధి, విద్య, రేషన్, పెన్షన్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తోంది. 2022వ సంవత్సరంలో ప్రారంభమైన ఈ సంస్థ దేశంలోని 10 నగరాల్లో జకాత్ సేకరించి, పేదలకు పంపిణీ చేస్తోంది. ఈ ఏడాది 20 కోట్ల రూపాయల వరకు జకాత్ సేకరించి పేదలకు పంపిణీ చేస్తున్నామని జకాత్ సెంటర్ ఇండియా ఛైర్మన్ అమీనుల్ హసన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. తమ కేంద్రం జీవనోపాధి ప్రాజెక్టులు, నైపుణ్యాభివృద్ధి, విద్యా కార్యక్రమాలకు జకాత్ నిధులను ఖర్చు చేస్తుందని హసన్ పేర్కొన్నారు. తాము విదేశీ విరాళాలను అంగీకరించడం లేదని ఆయన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నిరుపేదలు, నిరుద్యోగులకు చిన్న చిన్న వ్యాపారాలు ఏర్పాటు చేసుకునేందుకు జకాత్ సెంటర్ ఇండియా ఆర్థికసాయం అందిస్తోంది. తాము జకాత్ నిధులతో 119 కుటుంబాలకు పెన్షన్లు కూడా ఇస్తున్నామని హసన్ వివరించారు.


Tags:    

Similar News