బిగ్ బ్రేకింగ్ : రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు

ప్రతిరాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్ధితులపై ప్రతి రెండు గంటలకు రిపోర్టును అందించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది.

Update: 2024-08-18 01:54 GMT
Kolkata medical students

తాజా పరిస్ధితులపై కేంద్రహోంశాఖ రాష్ట్రాలకు కీలకమైన ఆదేశాలు జారీచేసింది. ప్రతిరాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్ధితులపై ప్రతి రెండు గంటలకు రిపోర్టును అందించాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాల డీజీపీలను ఆదేశించింది. ఈమేరకు కేంద్రహోంశాలోని కంట్రోల్ ఆఫీసర్ మోహన్ చంద్ర పండిట్ నుండి అన్నీ రాష్ట్రాలకు శనివారం రాత్రి సమాచారం అందింది. టాప్ ప్రయారిటిలో ప్రతి రెండు గంటలకు ఇవ్వాల్సిన రిపోర్టును ఫ్యాక్స్, ఈ మెయిల్ లేదా వాట్సప్ లో తప్పకుండా పంపాలని ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. పశ్చిమబెంగాల్లోని కోలకత్తాలో ఈమధ్యనే ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే.

డాక్టర్ పై పాశవికంగా హత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్టుచేయాలని, శిక్షించాలని డిమాండ్ చేస్తు ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలోని విద్యార్ధులు, డాక్టర్లు కొద్దిరోజులుగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. డాక్టర్ హత్యాచారం విషయమై అక్కడి రాష్ట్రప్రభుత్వం నిర్లక్ష్యంపై అన్నీ వైపుల నుండి ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. ఈ నేపధ్యంలోనే ఆసుపత్రి దగ్గర ఆందోళన చేస్తున్న డాక్టర్లపై రెండు రోజుల క్రితం అర్ధరాత్రి గుర్తుతెలీని వ్యక్తులు సుమారు 40 మంది దాడిచేసి గాయపరచిన విషయం దేశవ్యాప్తంగా సంచలనమైంది. డాక్టర్లను గాయపరచటమే కాకుండా ఆసుపత్రి మీద కూడా దాడులు చేసి రోగులతో పాటు డ్యూటీ స్టాఫ్ ను కూడా గాయపరిచారు. బెడ్లను, ఆసుపత్రి పరికరాలను కూడా ధ్వంసంచేశారు. దాంతో బెంగాల్లో శాంతి, భదత్రల సమస్య పెరిగిపోయింది.

జూనియర్ డాక్టర్ను పాశవికంగా హత్యాచారానికి గురిచేస్తే మిగిలిన వాళ్ళు ఆందోళన చేస్తుంటే పోస్టుమార్టమ్ రిపోర్టులో డాక్టర్ పై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసులు అంటున్నారు. దాంతో మండిపోయిన మిగిలిన వైద్య విద్యార్ధులు, జూనియర్ డాక్టర్లు తమ ఆందోళనను మరింత పెంచారు. డాక్టర్ పై ఎవరూ హత్యాచారం చేయకపోతే మరి ఆమె శరీరంపై అన్నీ గాయాలు ఎలాగయ్యాయని విద్యార్ధులు పోలీసులను నిలదీస్తున్నారు. ఈ నేపధ్యంలోనే కలకత్తాలో శాంతి భద్రతల సమస్య పెరిగిపోతోంది.

హత్యాచారం ఘటన వెలుగుచూసిన రోజు నుండి దేశంలోని చాలా రాష్ట్రాల్లోని వైద్య విద్యార్ధులు, జూనియర్ డాక్టర్లు సంఘీభావంగా ఆందోళనలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, తెలంగాణాలోని అన్నీ మెడికల్ కాలేజీల్లోని విద్యార్ధులు, డాక్టర్లు కూడా ఆందోళనల్లో పాల్గొంటున్నారు. బెంగాల్లోని ప్రభావం ఇతర రాష్ట్రాల మీద కూడా చూపించే అవకాశం ఉందని కేంద్రహోంశాఖ అనుమానిస్తోంది. అందుకనే లా అండ్ ఆర్డర్ పరిస్ధితులపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తుండాలని కేంద్రహోంశాఖ డీజీపీలను అలర్ట్ చేసింది. ఇందులో భాగంగానే ప్రతి రెండు గంటలకు శాంతి భద్రతల పరిస్ధితులపై ప్రతిరోజు రిపోర్టును పంపాలని కేంద్ర హోంశాఖ ఆదేశించింది.

Tags:    

Similar News