తెలంగాణలో బాగా బలుస్తున్న ‘అవినీతి’ చేపలు

తెలంగాణలో చేపల పెంపకం పేరిట వెచ్చించిన నిధులు పక్కదారి పట్టాయి.;

Update: 2025-09-02 13:13 GMT
రిజర్వాయరులో చేపలు పడుతున్న మత్స్యకారులు

బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, గొర్రెలే కాదు...చేపల పెంపకంలోనూ అక్రమాలు జరిగాయి. చేప పిల్లల పెంపకం పేరిట 1000 కోట్ల రూపాయలను పక్కదారి పట్టించారు.మత్స్యకారుల అభ్యున్నతికి ఉద్ధేశించిన పథకం అక్రమాలతో అసలు లక్ష్యం నెరవేరకుండా పోయింది. ‘ఫిష్ హెల్త్, వెల్త్’ అంటూ చేపల పెంపకం పెంచేందుకు ఉద్ధేశించిన పథకం నీరుగారిపోయింది.


రూ.1000కోట్లతో మత్స్య సంపద అభివృద్ధి పథకం
తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం 1,000 కోట్లతో చేపట్టిన పథకం అక్రమాలతో అసలు లక్ష్యాలు సాధించలేదు. వేయికోట్ల స్కీం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్సీడీసీ) నుంచి రూ.600కోట్లను రాష్ట్ర మత్స్యశాఖ అప్పుగా తీసుకుంది.ఈ పథకం కింద కేంద్రం రూ.200కోట్లు విడుదల చేయగా రాస్ట్ర ప్రభుత్వం రూ.56 కోట్లు ఇచ్చింది.



 పథకం లక్ష్యం

తెలంగాణలో మత్స్య సంపదను అభివృద్ధి చేయడంతోపాటు మత్స్యకారుల సంహకార సంస్థ ద్వారా వారి అభ్యున్నతికి చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. దీంతోపాటు ప్రజలకు చేపల ద్వారా పోషకాహారాన్ని అందించాలని అనుకున్నారు. ఈ పథకం కింద ఫిష్ పాండ్లు, ఫిష్ మార్కెట్ లు నిర్మించాల్సి ఉండగా అది సజావుగా చేయలేదు. చేపల ఉత్పత్తి పెంచేందుకు ఉద్ధేశించిన పథకం నెరవేరలేదు.చెరువుల్లో నాణ్యతలేని చేప పిల్లలను వదలడం వల్ల చేపల ఉత్పత్తి పెరగలేదు.హైదరాబాద్ నగరంలో రూ.669 కోట్లతో చేపల మార్కెట్ల నిర్మాణం చేపట్టినా వాటిని ఇంకా పూర్తి చేయలేదు.దీంతో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుంచి అప్పుగా తెచ్చిన నిధులు దుర్వినియోగమయ్యాయి.



 చెరువుల్లో చేప పిల్లలు వదిలే దెన్నడు?

సాధారణ‌గా వ‌ర్షాకాలం ప్రారంభంలో అంటే జులై నెలలో చేప పిల్ల‌ల‌ను చెరువుల‌లో వ‌దిలితే అవి మార్చి నెల వ‌ర‌కు సుమారు 1.5 కిలోల వ‌ర‌కు పెరుగుతాయి.ఈ సంవ‌త్స‌రం ఇప్పుడు చేప పిల్ల‌ల కొనుగోలుకు టెండ‌ర్లు పిలిచారు. అంటే అక్టోబ‌రులో చెరువుల్లో చేప పిల్ల‌ల‌ను వ‌దిలినా అవి మార్చి నెల వ‌ర‌కు ఒక కిలో కూడా పెర‌గ‌వు.ఈ పథకం అమలులో అక్రమాలు కూడా చోటుచేసుకున్నాయి.

వెయ్యికోట్ల రూపాయల పథకం
తెలంగాణ రాష్ట్రంలో మ‌త్స్య సంప‌ద అభివృద్ధి కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం 1,000 కోట్ల‌తో ఒక స్కీమును జి.ఓ. 91 తేది 6-6-2017 ద్వారా మంజూరు చేసింది.వేయి కోట్ల ప్ర‌ణాళిక‌లో రూ. 600 కోట్లు జాతీయ స‌హ‌కార అభివృద్ధి సంస్థ (ఎన్‌.సి.డి.సి.) నుంచి అప్పుగా, కేంద్రం గ్రాంటు కింద రూ.200 కోట్లు, రాష్ట్ర ప్ర‌భుత్వ స‌బ్సిడీ కింద రూ.56 కోట్లు, మ‌త్స్య‌కారుల సొసైటీ సభ్యుల నుంచి రూ. 144 వేయి కోట్ల‌రూపాయలతో స్కీమ్ అమలు చేశారు. ఈ స్కీమ్ పేద మ‌త్స్య‌కారుల అభివృద్ధికి తోడ్ప‌డుటమే కాకుండా ప్ర‌జ‌ల‌కు పోష‌కాహారంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుందని భావించారు.ఈ స్కీమ్ అమ‌లు బాధ్యతను తెలంగాణ మ‌త్స్య‌కారుల స‌హ‌కార‌సంస్థ‌కు అప్ప‌గించారు. ఈ పథకం 2017-18, 2018-19 రెండు సంత్స‌రాల‌లో పూర్తి కావాల్సి ఉండగా ఆశించిన సమయంలో పూర్తి చేయలేదు.

చేపపిల్లల పెంపక కేంద్రాల నిర్మాణమేది?
తెలంగాణలో 24,188 చెరువులున్నాయి. ఇందులో 77 రిజర్వాయర్లు, 4,647 చెరువులు, 19,465 గ్రామ పంచాయతీ చెరువులున్నాయి. రాష్ట్రంలో 19 చేపపిల్లల పెంపక కేంద్రాలున్నా, వీటిలో నాణ్యమైన చేపపిల్లల ఉత్పత్తి సాగటం లేదు. నీలి విప్లవం పథకం కింద 11 ప్రైవేటు చేప పిల్లల విత్తనాల ఉత్పత్తి చేస్తున్నా ఈ పథకం సజావుగా సాగడం లేదు. మ‌త్స్య‌కారుల జీవ‌న‌ప్ర‌మాణాలు పెంచడంతోపాటు సంవ‌త్స‌రం పొడుగునా చేప‌లను అందుబాటులో ఉంచాలని ఈ పథకం ఉద్ధేశ్యం. చేప పిల్ల‌ల పెంప‌కం కోసం ఫిష్ పాండ్‌లు నిర్మించి,చేప‌పిల్ల‌లను మ‌త్స్య‌శాఖ అందుబాటులోకి తెచ్చి వాటిని చెరువుల్లో వ‌దిలి వేస‌విలో కూడా చేప‌లు ప‌ట్టుట‌కు ఉద్ధేశించినా, అసలు లక్ష్యం నెరవేరలేదు.

నాసిరకం చేప పిల్లల విక్రయం
ఫిష్ పాండ్‌ల నిర్మాణం జ‌రుప‌క‌ పోవడంతో గ‌త 8 సంవ‌త్స‌రాలుగా ప్రైవేటు వారి నుంచి చేప పిల్ల‌లు కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేపపిల్లల నాణ్య‌త లోపించి ఆశించిన ఫ‌లితాలు రావ‌డం లేదు.ఎన్‌.సి.డి.సి. ఇచ్చిన రూ. 600 కోట్ల అప్పుకు వ‌డ్డీ సాలీనా 10.5శాతం చొప్పున చెల్లింపులో ఆల‌స్య‌మై వ‌డ్డీరేటు 11.5శాతానికి పెరిగింది. దీనికి తోడు 2.5శాతం కూడా అప‌రాధ వ‌డ్డీ కూడా చార్జ్ చేశారు. అప్పు తీసుకొని పథకం లక్ష్యం నెరవేరక రుణ భారం మత్స్య శాఖపై పడింది.



 పూర్తికాని ఫిష్ మార్కెట్ల నిర్మాణం

తెలంగాణ రాష్ట్రంలోని 66 చేపల మార్కెట్లకు రూ.1471.80 లక్షలను రాష్ట్ర మత్స్యశాఖ డైరెక్టరు విడుదల చేశారు. 2021వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు తెలంగాణలోని పది పూర్వ జిల్లాల్లోని అన్ని మార్కెట్లకు నిధులు కేటాయించారు. మొత్తం మీద రాస్ట్రంలో 84 చేపల మార్కెట్లను మంజూరు చేసినా కేవలం 29 మార్కెట్ల నిర్మాణమే పూర్తి అయింది. ఫిష్ మార్కెట్ల నిర్మాణం కోసం కేటాయించిన నిధులు ప్రయోజనం లేకుండా పోయాయి.జాతీయ సహకార అభివృద్ధి సంస్థ హైదరాబాద్, కరీంనగర్ లలో అయిదు హోల్ సేల్ చేపల మార్కెట్లను నిర్మించాలని నిర్ణయించి నిధులు విడుదల చేసింది. హైదరాబాద్ నగరంలోని బేగంబజార్, కూకట్ పల్లి, మల్లాపూర్, చిలుకలగూడ, కరీంనగర్ లలో ఫిష్ మార్కెట్ల నిర్మాణానికి రూ.997.20 లక్షలు మంజూరు చేశారు. ఇందులో రూ.498.60 లక్షలనే విడుదల చేశారు. ఇందులో కరీంనగర్ ఫిష్ మార్కెట్ నిర్మించారు. బేగంబజార్, కూకట్ పల్లి, మల్లాపూర్ చేపల మార్కెట్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. చిలకలగూడ ఫిష్ మార్కెట్ నిర్మాణపనులు ఇంకా ప్రారంభించలేదు.



 అక్రమాలపై విచారణకు డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద అభివృద్ధి కోసం ఉద్ధేశించిన పథకం ఉద్ధేశ్యం బాగున్నా అమ‌లులో లోపంతో అటు మ‌త్స్య‌కారుల‌కు ఇటు చేప‌లు తినే ప్ర‌జ‌ల‌కు లాభం లేకుండా పోయిందని హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు. ప్రైవేటు వ్య‌క్లుల నుంచి చేప పిల్ల‌ల‌ను కొన‌కుండా మ‌త్స్య‌శాఖ‌నే చేప పిల్ల‌ల పెంప‌కం కోసం ఫిష్ పాండ్‌లు అభివృద్ధి చేయాల‌నే లక్ష్యం నరవేరలేదన్నారు. ఫిష్ మార్కట్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో చేప‌లు రోడ్ల ప‌క్క‌న అపరిశుభ్ర‌త పాటించ‌కుండా అమ్ముతున్నారని చెప్పారు.ఈ పథకం అమలులో అక్రమాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, చేప‌ల మార్కెట్లు అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని ఫోరం ఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి రాసిన లేఖలో కోరారు.





Tags:    

Similar News