అనుమానంతో ఓ భర్త కట్టుకున్న భార్యను కడతేర్చాడు. వీరి వివాహబంధానికి పాతికేళ్లు. ఆదిలాబాద్ పట్టణం సుందరయ్య నగర్ కు చెందిన హింగోలి శంకర్ ఇంద్రవెల్లి నర్సాపూర్ కు చెందిన వందనతో పెద్దల సమక్షంలో పెద్దలు కుదిర్చిన వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు(20 ఏళ్ల పై బడిన వారే). కూతురు (17) ఉన్నారు. శంకర్ గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ అనుమానం పెనుభూతమై అతన్ని నిత్యం దహించి వేసేది. భార్యను ఎలాగైనా చంపాలని డిసైడ్ అయ్యాడు. అనారోగ్యంతో ఉన్న భార్యకు క్షుద్ర పూజలు చేస్తానని చెప్పి ఆదిలాబాద్ నుంచి వందనను ఈ నెల 2వ తేదీన బస్సులో తీసుకెళ్లాడు. తల మడుగు మండలంలోని లక్ష్మీపూర్ ఆటవీ ప్రాంతంలో తీసుకెళ్లాడు. అక్కడ పసుపు, కుంకుమ చల్లుతున్నట్టు నటించి భార్య కళ్లలో కారం కొట్టాడు. ఆమె తప్పించుకునే ప్రయత్నం చేయగానే బండరాయిని తలపై వేసి హత్య చేశాడు.
శవాన్ని అక్కడే వదిలేసి ఏమి తెలియదన్నట్టు ఇంటికి శంకర్ తిరిగొచ్చాడు. తల్లి కోసం పిల్లలు ఎంత అడిగినా వినిపించుకోలేదు. ఇంటి నుంచి తల్లి తిరిగి రాకపోవడంతో పిల్లలు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వందన అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా శంకర్ ను విచారించారు. శంకర్ చెప్పే సమాధానాలు వింతగా ఉండటంతో పోలీసులకు అనుమానమొచ్చింది. తమదైన స్టైల్ లో విచారణ చేస్తే భార్యను చంపినట్టు అంగీకరించాడు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకోగా అప్పటికే శవం కుళ్లిన స్థితిలోఉంది. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు ఆదిలాబాద్ డిఎస్పీ తెలిపారు.