యూట్యూబ్ ఛానెళ్లకు సజ్జనార్ మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్..!

Update: 2025-10-16 09:58 GMT

యూట్యూబ్ ఛానెళ్లకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చిన్నారులతో చేయించే కంటెంట్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి అని హెచ్చరించారు. వ్యూస్, లైక్స్ అంటూ చిన్నారులతో అసభ్యకరమైన వీడియోలు చేయిస్తే చర్యలు తప్పవన్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సజ్జనార్ మరోసారి తన మార్క్ పోలీసింగ్ చూపిస్తున్నారు. వాహనదారులకు ఇటీవల ‘నో ఫోన్, నో సాంగ్స్ వైల్ డ్రైవింగ్’ అని మెసేజ్ ఇచ్చిన సజ్జనార్.. దీనిని అతిక్రమిస్తే యాక్షన్ చాలా కఠినంగా ఉంటుందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఆయన మరోసారి యూట్యూబ్ ఛానెళ్లపై ఫోకస్ పెట్టారు. కొన్ని ఛానెళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వ్యూస్, లైక్స్ కోసం మైనర్లతో ఇష్టం వచ్చినట్లు కంటెంట్ చేయిస్తున్నారని, వారిపై యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. పోక్సో చట్టం కింద వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని, ఇలాంటి వీడియోలపై ఫిర్యాదు చేసి ప్రజలు కూడా సహాయం చేయాలని కోరారు. మైనర్లతో అసభ్యకరమైన కంటెంట్ చేయించడం ద్వారా సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించారు. ఈ మేరకు ఆయన కొన్ని ఇంటర్వ్యూలను ఉద్దేశిస్తూ ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టారు.

తల్లిదండ్రుల పని పెంచడమే కాదు..

‘‘భవిష్యత్ లో ఇలాంటి కంటెంట్ అప్లోడ్ చేసిన చట్టప్రకారం కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు మీ దృష్టికి వస్తే వెంటనే రిపోర్ట్ చేయండి. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వండి. హెల్ప్ లైన్ నెంబర్ 1930 కు కాల్ గానీ, జాతీయ సైబర్ క్రైమ్ పోర్టల్ http://cybercrime.gov.in లో ఫిర్యాదు చేయండి. తల్లిదండ్రులుగా మీ బాధ్యత పిల్లలను పెంచడం మాత్రమే కాదు.. వారి బాల్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని, భవిష్యత్తును కాపాడటం అనే విషయాన్ని మరచిపోవద్దు. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి’’ అని తల్లిదండ్రులకు సూచించారు.

అలాంటి ఇంటర్వ్యూలు చేయండి..

‘‘వ్యూస్, లైక్స్ తో పాటు సోషల్ మీడియాలో మీరు ఫేమస్ కావడానికి చిన్నారుల భవిష్యత్ ను పణంగా పెట్టడం ఎంత వరకు సమంజసం!? వారితో అసభ్యకరమైన కంటెంట్ చేస్తూ సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు అసలు!? చిన్నారులకు, యువతకి స్పూర్తినిచ్చే, ఆదర్శంగా నిలిచే వ్యక్తులను ఇంటర్వ్యూలు చేసి.. సమజాభివృద్దికి దోహదం చేయండి.. అంతేకానీ ఇలాంటి వీడియోలు వారితో చేసి పిల్లలను పెడదోవ పట్టించొద్దు. గుర్తుపెట్టుకోండి.. ఇది బాలల హక్కుల ఉల్లంఘన మాత్రమే కాదు — క్షమార్హం.. చట్టరీత్యా నేరం!! ఇటువంటి చర్యలు POCSO యాక్ట్, జువెనైల్ జస్టిస్ యాక్ట్ వంటి చట్టాలను ఉల్లంఘించడమే. పిల్లలను ఇలాంటి కంటెంట్‌లో భాగం చేయడం చైల్డ్ ఎక్స్‌ప్లాయిటేషనే అవుతుంది. మైనర్లతో ఈ తరహా కంటెంట్ చేసే వారిపట్ల పోలీస్ శాఖ కఠినంగా వ్యవహరిస్తుంది. బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటుంది. తక్షణమే వీటిని తొలగించకున్నా.. మీ పిల్లలను అనుచిత కంటెంట్ నుండి దూరంగా ఉంచండి. వారికి సానుకూల వాతావరణం, సరైన విలువలు అందించండి’’ అని తెలిపారు.


పెరుగుతున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్స్..


సోషల్ మీడియా ప్రభావం ప్రతి ఒక్కరిపై రోజురోజుకు అధికం అవుతోంది. చిన్నారులు సైతం చేతిలో ఫోన్ లేకపోతే ఊరుకోవడం లేదు. తల్లిదండ్రులు కూడా తమకు వారిని ఆడించే, లాలించే బాధ తప్పుతుందనుకుని ఫోన్ చేతికిచ్చి వదిలేస్తున్నారు. మరికొందరు పిల్లలను చిన్నప్పటి నుంచి వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో పెడుతున్నారు. దాని వల్ల చిన్నప్పటి నుంచే పిల్లలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ కావాలి, ఫేమ్ తెచ్చుకోవాలి, బయటకు వెళ్తే అందరూ తననే చూడాలన్న ఒక విధమైన మనస్తత్వం పెరిగిపోతోందని మానసి నిపుణులు కూడా చెప్తున్నారు. దాని వల్లే చిన్న వయసు నుంచే వైరల్ కావడం కోసం చిత్రవిచిత్రమైన కంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు. మరికొందరు షార్ట్ ఫిల్మ్స్ అని, మరికొందరు యూట్యూబ్ కంటెంట్, సోషల్ మీడియా కంటెంట్ అంటూ తాజాగా వైరల్ అవుతున్నసోషల్ మీడియా ట్రెండ్స్‌ను చేస్తున్నారు. అవి కాస్తా వారిని పక్కదారి పట్టిస్తున్నాయి. ఫేమ్ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్లు నేటి తరం చిన్నారులు మారారని నిపుణులు చెప్తున్నారు.

Tags:    

Similar News