కొండా సురేఖ ఇంటి ముందు భద్రత తొలగింపు ?
కొండా సురేఖ పదవికి ఎసరు వచ్చిందా? ఆమెను తొలగించడానికి అధిష్టానం అంగీకరిస్తుందా..?
తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ రసవత్తరంగా మారింది. కొండా సురేఖ మాజీ ఓఎస్‌డీ వ్యవహారం.. ఆమె పదవికే ఎసరు పెట్టింది. ఇప్పటికే కొండా సురేఖ అనేక వివాదాల్లో ఉండటంతో ఆమె వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఆమె మాజీ ఓఎస్‌డీ వ్యవహారంలో కొండా వైఖరి తీవ్ర అభ్యంతరాలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో కొండా విషయంలో ఏదో ఒక తుది నిర్ణయం తీసుకోవాలని పార్టీ హైకమాండ్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆమె దగ్గర ఉన్న అటవీ, దేవాదాయ శాఖలకు సంబంధించిన అన్ని ఫైళ్లను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె ఇంటి నుంచి మొత్తం భద్రతను తొలగించడం ఇప్పుడు అనేక చర్చలకు దారితీస్తోంది.
పదవి పోయినట్లేనా..!
కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ అంశం అనేక మలుపులు తిరుగుతోంది. ఓ సిమెంట్ ఫ్యాక్టరీ వారిని డబ్బులు ఇవ్వాలని బెదిరించారన్న కేసులో బుధవారం రాత్రి పోలీసులు.. ఓఎస్‌డీ సుమంత్‌ను అరెస్ట చేయడానికి కొండా సురేఖ ఇంటికి చేరుకున్నారు. అయితే అక్కడ పోలీసులను కొండా సురేఖ కూతురు సుస్మిత అడ్డుకున్నారు. మీరెవరు? అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇంతలో కొండా సురేఖ.. సుమంత్‌ను తన కారులో ఎక్కించుకుని వరంగల్‌కు తీసుకుని వెళ్లిపోయారు. పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చిన వ్యక్తిని ఒక మంత్రి అలా ఎలా తీసుకెళ్తారు? అన్న చర్చ మొదలైంది. దీంతో పార్టీ కూడా ఆమెపై ఒక నిర్ణయం తీసుకోవాలని డిసైడ్ అయింది. ఆమె ఇంటి దగ్గర నుంచి భద్రతను తొలగించింది. అనంతరం కాంగ్రెస్ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దగ్గర నుంచి కొండా సురేఖకు ఫోన్ వచ్చినట్లు తెలుస్తోంది.
ఆమెను ఒకసారి తనను కలవమని మీనాక్షి నటరాజన్ చెప్పినట్లు సమాచారం. కొండా సురేఖతో సమావేశం అయిన తర్వాత ఆమె విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనే అంశంపై పార్టీ పరంగా సమావేశం జరిగే అవకాశం ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. కొన్ని రోజుల నుంచి ఇతర మంత్రులకు కొండా సురేఖకు మధ్య తీవ్ర వివాదాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఓఎస్‌డీ వ్యవహారం పెద్ద రచ్చ కావడంతో దీనిపై ఫుల్ ఫోకస్ పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ పరంగా కీలక నేతలు, మంత్రులతో సమావేశం నిర్వహించి.. కొండా సురేఖ విషయంలో తుది నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
రేవంత్ కోపానికి అవే కారణమా..!
కొండా సురేఖ వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కాస్తంత అసంతృప్తిగానే ఉన్నారన్న వాదన బలంగా వినిపిస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో వివాదం నేపథ్యంలో తనను రెడ్డి నాయకులు టార్గెట్ చేస్తున్నారని, తన వ్యాఖ్యలను వివాదాలగా మారుస్తున్నారంటూ రెడ్డి నేతలందరిపై ఆరోపణలు చేశారు. అంతేకాకుండా సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చిన సమయంలో కొండా కుమర్తె సుస్మిత.. సీఎం అనుచరుడు రోహిణ్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రోహిన్ రెడ్డి దందాలు చేస్తున్నారని, సీఎం బ్రదర్స్ కొండల్ రెడ్డి, తిరుపతి రెడ్డిపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆఖరిని సీఎం రేవంత్ అంతర్గత అంశాలపై కూడా ఆమె సంచలన విమర్శలు చేశారు. దీంతో కొండా సురేఖపై సీఎం రేవంత్ చాలా కోపంగా ఉన్నారని, అందుకే ఒక్కసారిగా యాక్షన్‌కు రెడీ అయ్యారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కొండా పదవిని బీసీ సెంటిమెంట్ కాపాడుతుందా..?
అయితే ఇప్పుడు రాష్ట్రమంతా బీసీ నినాదం వినిపిస్తోంది. బీసీల కోసం తాము పోరాడతామని కాంగ్రెస్ కూడా వ్యాఖ్యానిస్తుంది. ఈ సమయంలో బీసీ నేత అయిన కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించడానికి అధిష్ఠానం ఓకే చెప్తుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించడంలో భాగంగానే ముందు మంత్రికి ఇచ్చే భద్రతను ఆమె ఇంటి నుంచి తొలగించడం జరిగిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ఎపిసోడ్ ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.