సుశ్మిత ఆరోపణలపై విచారణ జరగాలి.. రామ్‌చందర్ రావు డిమాండ్..

కాంగ్రెస్, కరప్షన్ రెండూ కూడా సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి.

Update: 2025-10-16 10:49 GMT

కొండా సురేఖ ఎపిసోడ్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్ చందర్ రావు స్పందించారు. కొండా సురేఖ కుమార్తె సుశ్మిత చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని అన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ యజమానిని బెదిరించడంలో పెద్దవారి హస్తం ఉందన్న కొండా కుటుంబీకుల ఆరోపణలను రామ్‌చందర్ రావు లేవనెత్తారు. కొండా ఫ్యామిలీ చెప్తున్న ఆ పెద్దవారు ఎవరో బయటపెట్టాలని కోరారు. మంత్రి కూతురు చేసిన ఆరోపణలపై విచారణ జరగాలని, నిజానిజాలు తేల్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది చాలా పెద్ద అంశమని అన్నారు. ‘‘పోలీసులు ఒక మంత్రి ఇంట్లోకి వెళ్లారు. ఆ మంత్రి కూతురు సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురిపై భారీ ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణల్లో నిజానిజాలు తేల్చాలి’’ అని అన్నారు. ‘‘కాంగ్రెస్, కరప్షన్ రెండూ కూడా సమాంతరంగా ప్రయాణిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర కాంగ్రెస్ వివరణ ఇవ్వాలి. రోజురోజుకు రాష్ట్రంలోని దోచుకునే ప్రభుత్వంగా మారిపోతోంది. ఆ పార్టీ తన టికెట్‌లను కూడా దోచుకునేవారికే ఇస్తున్నారు’’ అని విమర్శలు చేశారు. అవినీతి, తప్పుడు పాలన, దోపిడీలు కాంగ్రెస్ డీఎన్‌ఏలోనే ఉన్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు నిజాలు తెలపాలని ఆయన డిమాండ్ చేశారు.

అయితే మంత్రి కొండా సురేఖ, ఆమె మాజీ ఓఎస్‌డీ సుమంత్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు సుమంత్‌ను అరెస్ట్ చేయడానికి వస్తే.. అతనిని మంత్రి తన కారులో ఎక్కించుకుని అక్కడి నుంచి తీసుకెళ్లిపోవడం కీలకంగా మారింది. పోలీసులు అరెస్ట్ చేయాలంటున్న వ్యక్తిని మంత్రి ఎలా కాపాడతారు? అన్న చర్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ఇంటి నుంచి భద్రతను కూడా తొలగించారు. అంతేకాకుండా సుమంత్ వ్యవహారంపై స్పస్టత ఇవ్వడానికి మీడియాతో మాట్లాడాలని కొండా సురేఖ నిర్ణయించుకుంటే.. అలా చేయొద్దని, మీడియా ముందుకు వెళ్లొద్దని తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ చెప్పినట్లు సమాచారం. దీంతో కొండా సురేఖ ఎపిసోడ్ ఊహకందని మలుపులు తిరుగుతోంది.

ఈ నేపథ్యంలోనే కొండా సురేఖ ఎపిసోడ్‌పై ప్రతిపక్ష నాయకులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు కొండా సురేఖ కూతరు ఆరోపణలపై విచారణ జరగాలని డిమాండ్ చేస్తే, మరికొందరు ఈ మంత్రులు కుమ్ములాటల్లోనే బిజీగా ఉన్నారని, వీరా రాష్ట్రాన్ని రక్షించేది, అభివృద్ధి చేసేది అని వ్యాఖ్యానిస్తున్నారు. అంతేకాకుండా మంత్రుల పదవుల్లో మాఫియా డాన్‌లు కూర్చున్నారని కూడా ఘాటు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ఏం చేయాలో అర్థం కాక.. అంతర్గత సమావేశాలు పెట్టుకుంటుందని, కొండా సురేఖపై యాక్షన్ తీసుకోవాలా? తీసుకుంటే ఎలా తీసుకోవాలి? అసలు ఏం జరిగింది? వంటి అంశాలపై చర్చలు చేస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News