హైదరాబాద్ వంటకాలు వెరీ టేస్టీ గురూ, ప్రపంచంలోనే 50వ ర్యాంక్
హైదరాబాద్ వంటకాలు ప్రపంచవాసులకు భలే పసంద్. టేస్టీ అట్లాస్ ఉత్తమ ఆహార నగరాల్లో ప్రపంచంలోనే హైదరాబాద్ కు 50వ ర్యాంక్ వచ్చింది.;
By : Saleem Shaik
Update: 2025-07-06 14:12 GMT
హైదరాబాద్ బిర్యానీకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రపంచంలోనే ఉత్తమ ఆహారం లభించే వంద దేశాల జాబితాలో భారతదేశానికి 12 వస్థానం దక్కగా, హైదరాబాద్ నగరంలో బిర్యానీకి వచ్చిన అధిక రేటింగ్ వల్ల ఉత్తమ ఆహారంలో 50వస్థానంలో నిలిచింది. క్రొయేషియా కేంద్రంగా పనిచేస్తున్న ‘టేస్ట్ అట్లాస్’ అనే ట్రావెల్ గైడ్ సంస్థ తాజాగా టాప్ 100 ఉత్తమ ఆహారం లభించే దేశాలు, నగరాల జాబితాను విడుదల చేసింది.
హైదరాబాద్ వంటకాలు ప్రపంచ వాసులకు భలే పసంద్
హైదరాబాద్ బిర్యానీతో పాటు హలీమ్,నిహారి, పత్తర్ కా ఘోష్, పర్షియన్, టర్కీష్, మొఘల్ వంటకాలు ప్రపంచ ఆహార ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.దీంతో పాటు ఇడ్లీలు, దోసెలు, చెట్టినాడు కూర కూడా హైదరాబాద్ ఉత్తమ ఆహార నగరంగా నిలపడానికి తోడ్పడింది.
బిర్యానీ ఘుమఘుమలు
హైదరాబాద్ నగరం పేరు చెప్పగానే దేశ, విదేశాల వారికి గుర్తుకు వచ్చేది రుచికరమైన బిర్యానీ. పాత మొఘలాయి వంటకాలు, మసాలా దినుసులతో కూడిన బిర్యానీ దమ్ పద్ధతిలో వండుతారు. బాస్మతి బియ్యం, వివిధ రకాల మసాలాలతో చికెన్ లేదా మటన్ తో వండిన బిర్యానీ ఘుమఘుమలు హైదరాబాద్ వాసులకే కాకుండా ప్రపంచ ఆహార ప్రియులను ఆకట్టుకుంటోంది. బిర్యానీతోపాటు రైతా, మర్చికా సాలన్ తింటే ఆ రుచే వేరంటారు ఆహారప్రియులు.పచ్చిమిరపకాయలు, వేరుశనగపప్పు, కొబ్బరి కలిపి మెత్తగా చేసే గ్రేవీ బిర్యానీతో కలిపి తింటే బాగుంటుందని ఆహార ప్రియులు చెప్పారు.
హలీం అదుర్స్
ముస్లింల ఉపవాసదీక్షలు చేపట్టే రమజాన్ మాసంలో హోటళ్లలో లభించే హలీమ్ విదేశీయులను ఆకట్టుకుంటోంది. పొట్టేలు మాంసం లేదా కోడి మాంసం, పప్పు, గోధుమలు, మసాలా దినుసులు కలిపి మెత్తగా ఉడికించి నిమ్మకాయ, వేయించిన ఉల్లిపాయలు, నెయ్యి కలిపిన హలీం నోట్లో వేసుకుంటే చాలు ఇట్టే కరిగిపోతుంది. డబుల్ కా మీఠా కూడా అందరినీ ఆకట్టుకుంటోంది. బ్రెడ్ ను ఫ్రై చేసి పాలు, చక్కెర, యాలకులపొడి, ద్రాక్ష కలిపి చేసిన డబుల్ కా మీఠా టేస్ట్ వేరంటారు హైదరాబాదీలు. ఏ ఫంక్షన్ అయినా డబుల్ కా మీఠా మెనూలో ఉండాల్సిందే.