తెలంగాణను వీడని వరద విపత్తు, పలు గ్రామాల్లో జలప్రళయం
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో వరద విపత్తు వీడటం లేదు.;
By : Saleem Shaik
Update: 2025-08-29 07:19 GMT
భారీవర్షాల వల్ల మెదక్ జిల్లా ఏడుపాయల వద్ద వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. గంటగంటకు వరదనీటి ప్రవాహం పెరుగుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. ఏడుపాయల వద్ద ఉన్న దేవాలయంలోకి వరదనీరు ప్రవహించింది.
వరదలపై ఆందోళన చెందవద్దు
మెదక్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలపై ప్రజలు ఆందోళన చెందవద్దని జిల్లా ప్రత్యేక అధికారి హరికిరణ్ కోరారు.గురువారం రాత్రి కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలు, రహదారులను పరిశీలించారు. ఇళ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు సహాయం, బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో శాశ్వత పరిష్కార చర్యలు తీసుకుంటామని ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు.
వరదనీటికి కొట్టుకుపోయిన రైల్వే లైన్
మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు రైల్వేలైన్ కొట్టుకుపోయింది. శమ్నాపూర్ రైల్వే బ్రిడ్జి కింది భాగంలో వర్షాలకు భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. రైల్వే అధికారులకు రైతు శేఖర్ సమాచారం ఇచ్చారు. దంతో సికింద్రాబాద్ - నిజామాబాద్, అక్కన్నపేట - మెదక్ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు.
వరదనీటిలో చిక్కుకున్న గర్భిణీని కాపాడిన అధికారులు
మెదక్ జిల్లా కొమటూరు చెరువు వద్ద వరదనీటిలో పిట్లం కవిత అనే 26 ఏళ్ల గర్భిణీ చిక్కుకుంది. ఫైర్, రెస్క్యూ బృందాలు బోటు సాయంతో గర్భిణీ కవితను సురక్షితప్రాంతానికి తరలించారు.
గోదావరిలో పెరిగిన నీటి మట్టం
గోదావరి ఎగువ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాల వల్ల గోదావరి నదిలో నీటి ప్రవాహం పెరిగింది. ములుగు జిల్లాలో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచి పోయాయి. ఏటూరునాగారం మండలం రామన్నగూడెం వద్ద గోదావరి నది నీటి మట్టం శుక్రవారం 14.83 మీటర్లకు పెరగడంతో నదీ తీర ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు. అధికారుల గోదావరి నదీ తీర ప్రాంతాల ప్రజలనను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
బీబీపేట చెరువుకు గండి
కామారెడ్డి జిల్లా బీబీపేట చెరువుకు గండి పడింది. దీంతో చెరువు తెగిపోతే తమ గ్రామాలు మునిగిపోతాయని మూడు గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.
పోచారం ప్రాజెక్టుకు మరమ్మతులు
పోచారం ప్రాజెక్టు నుంచి అత్యధికంగా 70 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షం మూలంగా 1,82,000 క్యూసెక్కుల నీరు ప్రాజెక్ట్ నుంచి దిగువకు వెళ్లడంతో ప్రాజెక్టు ఆనకట్ట దెబ్బతింది. దీంతో ప్రాజెక్ట్ ఆనకట్టకు మరమ్మతులు చేస్తున్నారు. ఈ ఆనకట్ట మరమ్మతు పనులు ఎల్లారెడ్డి ఆర్డీవో ప్రత్యేక పర్యవేక్షణలో జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.
భైంసాలో వరదలు
గోదావరి నదిలో వరదనీటి ప్రవాహం పెరగడంతో బైంసా పట్టణంలో పలు ఇళ్లు నీట మునిగాయి. సుద్దవాగు,గడ్డెన్న ప్రాజెక్టు గేట్లు తెరవడం వరదనీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తారు. బాసరలో గోదావరి పుష్కర ఘాట్ లను ముంచెత్తింది. పలు ప్రాంతాలను గోదావరి నీరు ముంచెత్తింది.నిర్మల్: జాతీయ రహదారిపై భారీ వాహనాలను దారి మళ్లించారు. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు నిర్మల్‌లో కొండాపూర్ మీదుగా వెళ్లాలని సూచించారు.