బీఆర్ఎస్ కు చేవెళ్ళ అచ్చిరాలేదా ?

గడచిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీలు కూడా పార్టీని వదిలేసి కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు.

Update: 2024-04-12 13:40 GMT
BRS flag (source Twitter)

ఇపుడిదే విషయం రాజకీయాల్లో హాట్ టాపిక్ అయిపోయింది. గ్రౌండ్ లెవల్లో పరిస్ధితి చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. గడచిన రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఇద్దరు ఎంపీలు కూడా పార్టీని వదిలేసి కాంగ్రెస్, బీజేపీల్లోకి వెళ్ళిపోయారు. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్ తరపున కాసాని జ్ఞానేశ్వర్, బీజేపీ అభ్యర్ధిగా కొండా విశ్వేశ్వరరెడ్డి పోటీచేస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన చేవెళ్ళ పార్లమెంటు ఎన్నికల్లో 2009 మొదటి ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా జైపాల్ రెడ్డి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికలో టీఆర్ఎస్ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి తర్వాత పార్టీని వదిలేసి కాంగ్రెస్ లో చేరారు. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి గెలిచిన రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరారు. దాంతో రెండు వరుస ఎన్నికల్లో కారుపార్టీ ఎంపీలు కాంగ్రెస్ లో చేరటం గమనార్హం.

2014 ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ ఎంపీ కొండా కాంగ్రెస్ లో చేరి తర్వాత అక్కడినుండి బీజేపీలోకి జంప్ చేశారు. ఇపుడు బీజేపీ అభ్యర్ధిగా కొండానే పోటీచేస్తున్నారు. ఇక 2019లో కారుపార్టీ తరపున పోటీచేసి గెలిచిన రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లోకే ఫిరాయించారు. ఇపుడు రంజిత్ రెడ్డే హస్తంపార్టీ అభ్యర్ధి. బీఆర్ఎస్ తరపున రంజిత్ కు కేసీయార్ టికెట్ ప్రకటించిన మూడురోజుల వరకు ఏమీ సమాధానం చెప్పని ఎంపీ తర్వాత తాను పోటీచేయటంలేదని చెప్పి వెంటనే కాంగ్రెస్ లో చేరి పోటీలోకి దిగారు. ఎంపీ అభ్యర్ధిగా చాలామందిని పరిశీలించిన కేసీయార్ చివరకు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ను రంగంలోకి దింపారు. కొండా తప్ప కాసాని, రంజిత్ ఇద్దరిపైనా నాన్ లోకల్ లనే ముద్రుంది. రంజిత్, కొండాపైన ప్రత్యేకించి ఎలాంటి ఆరోపణలు లేకపోయినా రంజిత్ అయితే ఎంపీగా నియోజకవర్గానికి చేసిందేమీ లేదనే ఆరోపణలు బాగా వినబడుతున్నాయి.

ఇదే సమయంలో కాసాని మీద భూకబ్జా ఆరోపణలు బాగా వినబడుతున్నాయి. ఆర్ధికంగా ముగ్గురూ గట్టి స్ధితిలోనే ఉన్నారు కాబట్టి ఎన్నికల్లో డబ్బులు ఖర్చులు చేయటం అన్నది పెద్ద సమస్యేకాదు. కాకపోతే ఓటర్లు అచ్చంగా డబ్బులకు మాత్రమే లొంగిపోతారా అన్నది కీలకమైన పాయింట్. పార్లమెంటుపరిధిలోని ఏడు అసెంబ్లీనియోజకవర్గాల్లో నాలుగు మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెళ్ళ(ఎస్సీ) నియోజకవర్గాలు రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి. ఈ నాలుగు చోట్లా బీఆర్ఎస్ ఎంఎల్ఏలే ఉన్నారు. అలాగే మిగిలిన మూడు పరిగి, వికారాబాద్ (ఎస్సీ), తాండూరు నియోజకవర్గాలు వికారాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఈ మూడుచోట్లా కాంగ్రెస్ ఎంఎల్ఏలున్నారు. విచిత్రం ఏమిటంటే ఒక్క ఎంఎల్ఏ కూడా లేని బీజేపీ మిగిలిన రెండుపార్టీలకు గట్టిపోటీ ఇస్తోంది.

పోటీలో ఉన్న ముగ్గురు అభ్యర్ధుల్లో కొండాకు ఒక ప్లస్ పాయింటుంది. అదేమిటంటే సమస్యలు చెప్పుకోవటానికి, ఏ విషయంలో అయినా కలవటానికి వచ్చిన వాళ్ళందరితో బాగా కలివిడిగా మాట్లాడుతారనే పేరుంది బీజేపీ అభ్యర్ధికి. అవసరం అని వచ్చినవారికి మాటసాయం లేకపోతే చేతసాయం చేస్తారని జనాలే కొండా గురించి చెప్పుకుంటున్నారు. వ్యక్తిగతంగా ఉన్న ప్లస్సుకు తోడు నరేంద్రమోడి ఇమేజి బీజేపీకి బాగా కలిసొచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్ ఎంఎల్ఏ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సన్నిహితంగా ఉంటున్న కారుపార్టీ నేత ‘తెలంగాణా ఫెడరల్’ తో మాట్లాడుతు పోటీ బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవటం, పదేళ్ళు అధికారం అనుభవించిన నేతల్లో చాలామంది పార్టీఅభ్యర్ధి గెలుపుకు పెద్దగా పనిచేయటంలేదన్నారు.

పార్టీ అభ్యర్ధి గెలుపుకు సబితా కష్టపడుతున్నా ఉపయోగం కనబడటంలేదని చెప్పారు. తాము ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా నరేంద్రమోడి గురించే ప్రస్తావిస్తున్నట్లు సదరు నేత చెప్పారు. గ్రండౌ లెవల్లో పరిస్ధితి చూస్తుంటే పోటీ రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి మద్యే ఉంటుందనే అనుమానాన్ని వ్యక్తంచేశారు.

Tags:    

Similar News