మోదీ మా పెద్దన్న.. అంతా బీజేపీ వ్యూహమేనా!

కేసీఆర్, బీఆర్ఎస్‌పై కాంగ్రెస్, బీజేపీ మూకుమ్మడి దాడికి సిద్ధమవుతున్నాయి. బీఆర్ఎస్ పాపాల చిట్టా బహిర్గతం చేయాలని సీఎం రేవంత్‌ను రాజా సింగ్ కోరారు.

Update: 2024-03-05 09:46 GMT
మోడీ, రేవంత్ రెడ్డి

షణ్ముఖ పోచరాజు



‘ప్రధాని మోదీ మాకు పెద్దన్న లాంటి వారు’ ప్రధాని నరేంద్ర మోదీ ఆదిలాబాద్ పర్యటనలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. తమకు బీజేపీ మోదీతో మాత్రమే విభేదాలు ఉన్నాయని, ప్రధాని మోదీతో తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీని వ్యతిరేకిస్తున్నాం అంటే కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నట్లు కాదని, కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర మంత్రి వర్గం, ప్రధానమంత్రి ఉంటారు. వారితో రాష్ట్ర ప్రభుత్వానికి సత్సంబంధాలు ఉండాలనే తాము ఆకాంక్షిస్తామని హితవు పలికారు. ఆ తర్వాత నొప్పించకుండా సుతిమెత్తగా తన విన్నపాలను మోడీ ముందు ఉంచారు. ఈ సభలో మాట్లాడుతూనే ప్రధాని అంటే మాకు పెద్దన్న లెక్క, ఆయనతో గొడవ పడతామా అని ప్రధాని మోడీ విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహార శైలిని పరోక్షంగా ఎండగట్టారు.

కేసీఆర్‌లా మారకు రేవంత్: రాజా సింగ్

ఇప్పటికే ప్రధాని మోడీని పెద్దన్న అన్న రేవంత్ వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా ఉంటే ఇప్పుడు సీఎంకు గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్ చేసిన హితబోధ, కేసీఆర్ పాల్పడిన అవినీతిని బట్టబయలు చేయాలనడం మరింత చర్చలకు దారితీస్తోంది. ‘‘అధికారంలోకి వచ్చిన తొలినాళ్ళలో కేంద్రంతో రాసుకుని పూసుకుని తిరిగిన కేసీఆర్ ఆ తర్వాత కళ్ళు నెత్తికెక్కి రాష్ట్రానికి ప్రధాని వచ్చిన వేళల్లో కనీసం ప్రోటోకాల్‌ను కూడా పాటించలేదు. అలా కేసీఆర్ మార్గంలో నువ్వు నడవకు. కేంద్రంతో సత్సంబంధాలు ఉంటేనే రాష్ట్ర అభివృద్ధి వేగంగా దూసుకెళ్తుంది. అంతేకాకుండా అధికారంలో ఉన్న పదేళ్లలో కేసీఆర్, ఆయన కుటుంబం రాష్ట్రాన్ని ఎంత అధోగతికి చేర్చారో బట్టబయలు చేయాలి. రాష్ట్రానికి కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చింది, అందులో అభివృద్ధికి, ప్రాజెక్ట్‌లకు ఖర్చు చేసింది ఎంత అనే వివరాలను కూడా మీరు తెలపాలి. అధికారంలో ఉన్నాం కదా అన్న అహంకారంతో బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతి ప్రజల ముందు ఉంచాలి’’అని రాజా సింగ్ కోరారు.

బీఆర్ఎస్‌పై కాంగ్రెస్, బీజేపీ మూకుమ్మడి దాడి!

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్షణం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి వర్గం అంతా కూడా బీఆర్ఎస్, కేసీఆర్ టార్గెట్‌గా విమర్శలు, ఆరోపణలు కుమ్మరిస్తోంది. కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ ప్రాజెక్టుల్లో బీఆర్ఎస్ తీవ్ర అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ అసెంబ్లీలో ఈ ప్రాజెక్ట్‌లపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ వచ్చి బీఆర్ఎస్ అవినీతిని, కేసీఆర్ పాల్పడిన పాపాలన్నింటినీ బహిర్గతం చేయాలని సీఎం రేవంత్‌ను కోరడంతో బీఆర్ఎస్‌పై మూకుమ్మడి దాడి చేయడానికి కాంగ్రెస్, బీజేపీ తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకున్నాయా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. మరోసారి తెలంగాణలో బీఆర్ఎస్ ఊసు కూడా వినిపించకూడదన్న ఉద్దేశంతోనే కాంగ్రెస్, బీజేపీ కలిసి బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబంపై దాడులకు సన్నద్ధం అవుతున్నాయనిపిస్తోంది.

కాంగ్రెస్ గెలుపు బీజేపీ వ్యూహమేనా

తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం కూడా బీజేపీ వ్యూహంలోని భాగమే అనిపిస్తోంది. కేవతం బీఆర్ఎస్‌ను ఇంటికి పంపించేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ ఈ పన్నాగం పన్నిందేమో అని అనుమానం. ముందుగా తెలంగాణలో ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్‌ను ప్రజలకు దూరం చేసి ఆ తరవాత ఎన్నికల బరిలో కాంగ్రెస్‌లో తలపడి తెలంగాణలో కాషాయ జెండా ఎగరేయాలన్నదే బీజేపీ వ్యూహమా. ఝార్ఖండ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఢిల్లీ రాస్ట్రాల్లో కూడా బీజేపీ తన దాడులకు కేవలం ప్రాంతీయ పార్టీలనే టార్గెట్‌గా చేసుకుని చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను కూలిస్తే బీజేపీకే అధికారం వస్తుందన్న గ్యారెంటీ కూడా లేదు. ఆయా రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు తొలగితే ప్రజల సెకండ్ చాయిస్‌గా కాంగ్రెస్‌ మాత్రమే ఉంది.
అదే విధంగా కాంగ్రెస్ అధికారంలో ఉన్న దాదాపు ప్రతి రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగితే బీజేపీదే పైచేయి అవుతుంది. కాంగ్రెస్‌ను చిత్తు చేస్తూ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. రాజస్థాన్, ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రాల్లో గతేడాది జరిగిన రాష్ట్రాల్లో ఇదే జరగడాన్ని గమనించొచ్చు. బీజేపీ అదే వ్యూహాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తోందా? అందులో భాగంగానే కాంగ్రెస్‌కు గెలుపును కట్టబెట్టిందా? అని అనిపిస్తోంది. ఆ అనుమానాలను బలం చేకూర్చేలానే అధికారంలో వచ్చిన క్షణం నుంచి బీఆర్ఎస్‌ టార్గెట్‌గా కాంగ్రెస్ విమర్శలు చేస్తుంటే.. ఇప్పుడు బీజేపీ నేత రాజా సింగ్ కూడా కాంగ్రెస్‌తో బీజేపీ చేతులు కలిపినట్లు బీఆర్ఎస్ అవినీతిని బట్టబయలు చేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News