బీజేపీ టార్గెట్ బీఆర్ఎస్సేనా ?

పామ్ హౌసులో పడుకుని కేసీఆర్ ఏమి రాజకీయాలు చేస్తున్నారో తెలీదుకాని బీజేపీ మాత్రం చాపకింద నీరులా కమ్ముకుంటోంది;

Update: 2025-03-06 10:17 GMT
Modi and KCR

పామ్ హౌసులో పడుకుని కేసీఆర్ ఏమి రాజకీయాలు చేస్తున్నారో తెలీదుకాని బీజేపీ మాత్రం చాపకింద నీరులా కమ్ముకుంటోంది. మూడు ఎంఎల్సీ సీట్లకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ రెండుచోట్ల గెలిచింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచింది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కూడా 8 లోక్ సభ సీట్లలో గెలిచింది. ఇపుడేమో మూడు ఎంఎల్సీ సీట్లలో రెండింటిని గెలుచుకుంది. అధికారంలో ఉందికాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్(Congress) కు వచ్చిన నష్టమేమీలేదు. సమస్యంతా ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కే అన్న విషయం అర్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన దగ్గరనుండి కేసీఆర్ చాణుక్యవ్యూహాలు ఏమీ పనిచేస్తున్నట్లు లేవు. ఎందుకంటే కూతురు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఢిల్లీ లిక్కర్ స్కామ్(Delhi Liquor Scam) లో ఇరుక్కుపోయింది. దాదాపు ఏడునెలల తీహార్ జైలువాసం తర్వాత అతికష్టంమీద బెయిల్ పై బయటకు వచ్చింది.

లిక్కర్ స్కామ్ లో కూతురు తగులుకున్నప్పటినుండి నరేంద్రమోడీ(Narendra Modi) లేదా కేంద్రప్రభుత్వంపై కేసీఆర్ వ్యతిరేకంగా మాట్లడటమే మానేశారు. అంతకుముందు కేంద్రప్రభుత్వంతో పాటు మోడీని ఎన్నేసి మాటలన్నారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంటు ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత ఫామ్ హౌస్ వదిలి బయటకు రావటమే మానుకున్నారు. కేసీఆర్(KCR) ఆలోచనలు ఏమిటో, వ్యూహాలు ఏమిటో తెలీక చాలామంది నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. లిక్కర్ స్కామ్ కోర్టులో ఏదో ఒకటి తేలేంతవరకు కేసీఆర్ లేదా కేటీఆర్(KTR), హరీష్ అండ్ కో ఎవ్వరూ మోడీకి వ్యతిరేకంగా మాట్లాడేది ఉండదు.

కేటీఆర్, హరీష్, కవిత కూడా రేవంత్ పైన ఆరోపణలు, విమర్శలతో రెచ్చిపోయినట్లు కేంద్రప్రభుత్వంపై మాట్లాడటంలేదు. మోడీగురించి అసలు నోరే ఎత్తటంలేదు. ఇవన్నీ కేసీఆర్ బలహీనతలను ఎత్తి చూపుతున్నాయి. కేసీఆర్ డైరెక్షన్లోనే తామంతా పనిచేస్తున్నామని కేటీఆర్, హరీష్ చాలాసార్లు చెప్పారు. అంటే కేంద్రాన్ని, మోడీని ఏమీ అనద్దని కూడా కేసీఆరే చెప్పారని అర్ధమవుతోంది. బీఆర్ఎస్ కీలకనేతలు ఎంతసేపు రేవంత్(Revanth) పైన ఆరోపణలు చేయటం ఎప్పుడైనా తప్పదని అనుకుంటే కేంద్రమంత్రి బండి సంజయ్ మీద మాట్లాడుతున్నారంతే. బీజేపీకి కాంగ్రెస్ కు పెద్ద తేడా ఉంది. అదేమిటంటే బీజేపీ(BJP) క్రమశిక్షణ కలిగిన పార్టీ అయితే కాంగ్రెస్ పూర్తి ప్రజాస్వామ్యంతో నడిచేపార్టీ.

బీఆర్ఎస్ పార్టీ మధ్యేమార్గంలో ఉన్న పార్టీ. అటు క్రమశిక్షణతో కాదు ఇటు పూర్తి ప్రజాస్వామ్యంతోను నడవదు. బీజేపీ మెల్లిమెల్లిగా తన బలాన్ని పెంచుకుంటున్నది. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావటమే టార్గెట్ పెట్టుకుని పావులు కదుపుతోంది. పార్టీలో ఇపుడున్న జోష్ ఆధారంగా అయితే 2028లో అధికారంలోకి రావటం కొంచెం కష్టమనే అనిపిస్తోంది. ఎందుకంటే అసెంబ్లీ, పార్లమెంటు సీట్లతో పాటు ఇపుడు ఎంఎల్సీ ఎన్నికల్లో గెలిచినా నియోజకవర్గాల్లో పార్టీకి బలంలేదు. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో మహాయితే 30 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులుంటే ఉండవచ్చు. మిగిలిన నియోజకవర్గాల్లో ప్రత్యర్ధిపార్టీల అభ్యర్ధులను ధీటుగా ఎదుర్కొనేంత స్ధాయి నేతలు బీజేపీలో ఇప్పటికైతే లేరు. సాధారణ ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ళు ఉందికాబట్టి ఇతరపార్టీల్లో నుండి గట్టి నేతలను లాక్కుంటారేమో చూడాలి.

ఇతరపార్టీల నుండి లాక్కోవటం అంటే ముందుగా బీఆర్ఎస్ మీదే బీజేపీ చూపుంది. నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ లో బలమైన నేతలను లాక్కునే విషయంలో కమలంపార్టీ నేతలు చాపకింద నీరులా పనిచేసుకుపోతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ప్రస్తుత బీజేపీ ఎంపీలు రఘునందనావు, ఈటల రాజేందర్(Eetala), గోడం నగేష్ ఒకపుడు బీఆర్ఎస్ నేతలే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మండలాల్లోని కారుపార్టీ నేతలను పార్టీలో చేర్చుకుంటు బలోపేతమయ్యేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదేసమయంలో కేసీఆర్ అండ్ కో కేసుల్లో ఇరుక్కుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్ధితి ఏమిటి ? కవిత లిక్కర్ కేసులో ఇరుక్కుంటేనే కేసీఆర్ కిందామీద అయిపోయారు. అలాంటిది టెలిఫోన్ ట్యాపింగ్, ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతి, అక్రమాలు, విద్యుత్ రంగంలో జరిగిన అవినీతి, అక్రమాల్లో స్వయంగా తానే ఇరుక్కుంటే ?

కేసీఆర్ ను సాంతందెబ్బకొట్టి కాంగ్రెస్ ను బలోపేతం చేయాలని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. అయితే బీఆర్ఎస్ ను దెబ్బకొడితే జనాలు కాంగ్రెస్ కు కాకుండా బీజేపీ వైపు మొగ్గుచూపుతారేమో అనేట్లుగా ఉంది పరిస్ధితి. ఎందుకంటే రేవంత్ పాలనపైన కూడా జనాలు ఏమంత సంతృప్తిగా లేరన్నది క్షేత్రస్ధాయి సమాచారం. కేసీఆర్ పదేళ్ళ పాలనను జనాలు బాగా గమనించారు. ఇపుడు రేవంత్ పాలన ఏమిటో చూస్తున్నారు. ఇకమిగిలింది బీజేపీ పాలన ఎలాగుంటుందో చూడటమే. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీరును గమనిస్తున్నా(Telangana) తెలంగాణలో మాత్రం ఇప్పటివరకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పటివరకు బీజేపీకి అవకాశం ఇవ్వలేదుకాబట్టి ఇకముందు కూడా ఇవ్వరన్న గ్యారెంటీ ఏమీలేదు. మూడుప్రధాన పార్టీల్లో రెండింటి పాలన చూశాము కాబట్టి బీజేపీకి ఒకఅవకాశం ఇద్దామని జనాలు అనుకుంటే ?

నియోజకవర్గాల్లో బీజేపీకి బలముందా ? బీజేపీ తరపున పోటీచేస్తున్నది ఎవరన్న విషయాన్ని కూడా గమనించకుండా జనాలు ఓట్లుగుద్దేసి బీజేపీని అధికారంలోకి తెచ్చేస్తారంతే. అయితే అంతటి పరిస్ధితికి జనాలు వస్తారా ? అన్నది రేవంత్ పాలనమీద ఆధారపడుంది. పాలకులు, పార్టీల అధినేతలు ఒకటి ఆలోచిస్తే జనాలు మరోటి ఆలోచిస్తారు. ఇందుకు ఉదాహరణ 2019 పార్లమెంటు ఎన్నికలే. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో తనకు ఎదురే ఉండకూడదని కేసీఆర్ అనుకున్నారు. అనుకోవటమే ఆలస్యం టీడీపీ(TDP), కాంగ్రెస్ పార్టీలను చీల్చి చెండాడేశారు. రెండుపార్టీల ఎంఎల్ఏలను లాగేసుకుని టీడీఎల్పీ, సీఎల్పీలను బీఆర్ఎస్ఎల్పీలో కలిపేసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ భూస్ధాపితమైపోయి, కాంగ్రెస్ కూడా బాగా దెబ్బతినేసింది. ఇక తనకు ఎదురు లేదని కేసీఆర్ అనుకున్నారు.

2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ నాలుగు సీట్లలో గెలిచింది. పార్టీజెండాలు కట్టేందుకు నేతలు కూడా లేని ఆదిలాబాద్ ఎంపీ సీటులో కూడా కమలంపార్టీ గెలిచిందంటే కేసీఆర్ పుణ్యమనే చెప్పాలి. టీడీపీ, కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేస్తే చాలని కేసీఆర్ అనుకుంటే జనాలే కేసీఆర్ కు ప్రతిపక్షాన్ని రెడీచేశారు. బీజేపీకి ఓట్లేసి జనాలే గెలిపించిన విషయాన్ని మరచిపోకూడదు. అంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాలుగుసీట్లలో జనాలు బీజేపీని గెలిపించారు. తర్వాత జరిగిన దుబ్బాక అసెంబ్లీలో కూడా బీజేపీ గెలిచింది. ఆ తర్వాత జరిగిన ఎంఎల్సీ సీట్లలో ఒకటి గెలిచింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో గెలిచింది. కేసీఆర్ గనుక టీడీపీ, కాంగ్రెస్ జోలికి వెళ్ళకుండా ఉండుంటే జనాలు బీజేపీని పట్టించుకుని ఉండేవారే కాదుమో.

కేసీఆర్ తనంతట తానే బీజేపీని పెంచి పోషించి బలోపేతం చేసినట్లు అర్ధమైపోతోంది. తాను పెంచి పోషించి పెద్దచేసిన బీజేపీనే బీఆర్ఎస్ మెడపైన కత్తిపెట్టే పరిస్ధితి కనబడుతోంది. తాజాగా జరిగిన మూడు ఎంఎల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీచేయకపోవటమే బీజేపీకి పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. బీజేపీని గెలిపించేందుకే కేసీఆర్ పార్టీని ఎన్నికల్లో పోటీకి దింపలేదని రేవంత్ అండ్ కో చేసిన ఆరోపణల్లో లాజిక్ లేకపోలేదు. తొందరలోనే జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలు, తర్వాత జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గణనీయమైన స్ధానాలను గెలుచుకుంటే బీఆర్ఎస్ పరిస్ధితి అగమ్యగోచరంగా తయారవుతుందనటంలో సందేహంలేదు. ఇదేజరిగితే కారుపార్టీ నుండి బీజేపీలోకి వలసలు మొదలైపోతాయి. 2028 ఎన్నికల నాటికి ఏపీలోని ఎన్డీయే కూటమే తెలంగాణలో కూడా పోటీచేసినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదే జరిగితే పోటీ బీజేపీ లేదా ఎన్డీయే కూటమి-కాంగ్రెస్ మధ్యనే ఉంటుందనటంలో సందేహంలేదు.

Tags:    

Similar News