మంచు ఫ్యామిలీ మొత్తం పోలీసు కేసుల్లో ఇరుక్కున్నట్లేనా ?
ముగ్గురు మీద నమోదైన కేసులు సరిపోదన్నట్లు వీళ్ళకి నాలుగో వ్యక్తి మంచు లక్ష్మీప్రసన్న(Lakshmi Prasanna) కూడా తోడైంది;
ఏదోఒక వివాదంలో ఇరుక్కోకపోతే మంచుఫ్యామిలీకి రోజు గడవదేమో అన్నట్లుగా తయారైంది వ్యవహారం. ఫ్యామిలీలోని ముగ్గురుపైన పోలీసులు ఇప్పటికే కేసులు నమోదుచేసి విచారణ కూడా చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురు మీద నమోదైన కేసులు సరిపోదన్నట్లు వీళ్ళకి నాలుగో వ్యక్తి మంచు లక్ష్మీప్రసన్న(Lakshmi Prasanna) కూడా తోడైంది. ఇంతకీ విషయం ఏమిటంటే బెట్టింగ్ యాప్(Betting Apps) లను ప్రమోట్ చేసిందనే కారణంతో మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu) గారాల కూతురు మంచు లక్ష్మీప్రసన్నపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణకు రమ్మని నోటీసులు జారీచేశారు. తాజా కేసులో లక్ష్మికి ఏమవుతుందన్నది పక్కనపెట్టేస్తే ముందు పోలీసుల విచారణకు అయితే హాజరవ్వక తప్పదు.
ఇప్పటికే ఫ్యామిలీ(Manchu Family)లో రేగిన గొడవల కారణంగా మోహన్ బాబుతో పాటు కొడుకులు మంచు విష్ణు(Manchu Vishnu), మంచు మనోజ్(Manchu Manoj) మీద పోలీసులు ఇప్పటికే కేసులు నమోదుచేసి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. మీడియా జర్నలిస్టును కొట్టిన కేసులో మోహన్ బాబు మీద జల్ పల్లి పోలీసులు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఆ కేసులో అరెస్టు చేయటానికి పోలీసులు వెళితే దొరక్కుండా కొద్దిరోజులు మోహన్ బాబు మాయమైపోయారు. ఎక్కడున్నారో కూడా ఎవరికీ ఆచూకీ కూడా తెలియనివ్వలేదు. కోర్టు ముందస్తు బెయిల్ మంజూరుచేసిన తర్వాత మాత్రమే మోహన్ బాబు జనాల్లోకి తిరిగొచ్చారు. అటెంప్ట్ మర్డర్ కేసు హైకోర్టు విచారణలో ఉంది.
అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలో లేకపోతే సంస్ధలపై ఆధిపత్య పోరాటంలోనో మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య బాగా గొడవలయ్యాయి. ఫామ్ హౌసుల్లో వీళ్ళ మద్దతుదారులు, బౌన్సలర్ల మధ్య పెద్ద గొడవలే అయ్యాయి. అన్న, దమ్ములు ఒకళ్ళపై మరొకళ్ళు కేసులు కూడా పెట్టుకున్నారు. విష్ణు నుండి తనకు ప్రాణాపాయం ఉందని మనోజ్ ఇచ్చిన ఫిర్యాదును నమోదుచేసుకున్న పోలీసులు విచారణ కూడా చేశారు. విచారణ నిమ్మితం విష్ణు రాచకొండ పోలీసు కమీషనర్ కార్యాలయంలో రెండుసార్లు హాజరయ్యాడు. అలాగే తమ ఫామ్ హౌసులోకి ధౌర్జన్యంగా ప్రవేశించాడని చెప్పి తనమనుషుల ద్వారా మనోజ్ పైన విష్ణు కేసు పెట్టించాడు. దాన్ని కూడా నమోదుచేసుకున్న పోలీసులు మనోజ్ ను రెండుమూడుసార్లు విచారించారు.
తండ్రీ, కొడుకుల గొడవలను జనాలు ఇంకా మరచిపోకముందే కేసులో ఇరుక్కోవటం ఇపుడు కూతురు వంతైంది. బెట్టింగ్ యాప్(Betting Apps) ను ప్రమోట్ చేసినందుకు మంచులక్ష్మి మీద పోలీసులు కేసు నమోదుచేసి విచారణకు రావాలని నోటీసులు జారీచేశారు. లక్ష్మీ మీద పోలీసులు 318(4), 112 r/w49 తో పాటు తెలంగాణ గేమింగ్ యాక్ట్ సెక్షన్లు 3, 3(ఏ), 4:2008, సమాచార చట్టం సెక్షన్ 66 డీ ప్రకారం అనేక కేసులు నమోదుచేశారు. నిజానికి తండ్రి, కొడుకుల మధ్య గొడవలు, వివాదాలు, పోలీసు కేసులతో పోలిస్తే లక్ష్మిమీద నమోదైన కేసుల్లో ఆమె ప్రమేయం తక్కువనే చెప్పాలి. ఆమె గ్రహచారం బాగలేక ఎప్పుడో ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కు సంబంధించిన కేసులో ఇపుడు బుకయ్యింది. కారణం ఏదైనా మంచు ఫ్యామిలీలో నలుగురూ పోలీసు కేసుల్లో ఇరుక్కుని విచారణను ఎదుర్కొంటున్నారన్నది మాత్రం వాస్తవం.