Prabhakar Rao|టెలిఫోన్ ట్యాపింగులో ‘ఎల్ఆర్’ ఆఖరిప్రయత్నమా ?

ఈ ప్రయత్నంకూడా ఫెయిలైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసును దాదాపు మూసేయాల్సిందే తప్ప వేరేదారిలేదు.;

Update: 2025-01-17 11:54 GMT
Telephone tapping

టెలిఫోన్ ట్యాపింగులో ఏ1 నిందితుడు, ముఖ్యపాత్రదారి ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు తెలంగాణ పోలీసులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంకూడా ఫెయిలైతే టెలిఫోన్ ట్యాపింగ్ కేసును దాదాపు మూసేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. బీఆర్ఎస్(BRS) పదేళ్ళహయాంలో వేలాది మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ అయ్యింది వాస్తవం. వేలాది ఫోన్ల ట్యాపింగు(Telephone tapping)కు ఆదేశాలిచ్చింది ప్రభాకరరావు అన్న విషయం ఇప్పటికే బయటపడింది. ట్యాపింగులో కీలకంగా వ్యవహరించిన నలుగురు పోలీసు అధికారులు విచారణలో టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలని తమను ఆదేశించింది ప్రభాకరరావే అని రాతమూలకంగా వాగ్మూలమిచ్చిన విషయంతెలిసిందే. తమకు ప్రభాకరరావు ఆదేశాలిస్తేనే తాము ట్యాపింగ్ చేసినట్లు నలుగురు అధికారులు అంగీకరించారు.

ఇక్కడితో ట్యాపింగ్ అంశంలో విచారణ దాదాపు పూర్తయ్యింది. అయితే ఇక్కడే ఒక మెలిక ఉండిపోయింది. అదేమిటంటే కిందిస్ధాయి పోలీసు అధికారులకు ట్యాపింగ్ ఆదేశాలిచ్చింది మాజీ చీఫ్ అన్న విషయంలో క్లారిటి వచ్చేసింది. అయితే ఎవరి ఆదేశాలతో మాజీ చీఫ్ వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించారన్న విషయం సస్పెన్సుగా ఉండిపోయింది. ఎవరి ఆదేశాల ప్రకారం మాజీ చీఫ్ వేలాది ఫోన్లను ట్యాపింగ్ చేయించారు ? తెరమీద ప్రభాకరరావు పేరు స్పష్టమైపోయింది. మరి తెరవెనుకుండి మాజీచీఫ్ ను ఆదేశించింది ఎవరు ? అన్న పాయింట్ దగ్గరే ట్యాపింగ్ విచారణ ఆగిపోయింది. ముఖ్యపాత్రదారి ప్రభాకరరావు దొరికితేనే తెరవెనుక ఉండి వేలాది ఫోన్ల ట్యాపింగుకు ఆదేశాలిచ్చిన సూత్రదారి ఎవరన్న విషయం బయటపడదు. సూత్రదారి దొరకాలంటే ముందు పాత్రదారి దొరకాలికదా. కాని పాత్రదారేమో ట్యాపింగ్ విచారణలో మొదటి అరెస్టు జరగ్గానే మరుసటిరోజు అమెరికా(America)కు పారిపోయాడు. అప్పటినుండి పాత్రదారిని ఇండియాకు రప్పించేందుకు పోలీసులు చేయనిప్రయత్నాలులేవు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పాత్రదారిని అమెరికా నుండి రప్పించలేకపోతున్నారు. మనచట్టాలు కూడా ప్రభాకరరావును అమెరికా నుండి రప్పించలేకపోతున్నాయి.

అందుకనే చివరి ప్రయత్నంగా ‘లెటర్ ఆఫ్ రొగెటరీ’(ఎల్ఆర్) అనే పద్దతిని ఫాలో అవబోతున్నారు. లెటర్ ఆఫ్ రొగెటరీ అంటే అమెరికాలో పాత్రదారి ఉంటున్న ప్రాంతంలోనే విచారించటం. అందుకు పాత్రదారి ఉంటున్న ప్రాంతంలోని న్యాయస్ధానం అంగీకరించాలి. ఇది ఎలాగ జరుగుతుందంటే తెలంగాణ పోలీసులు ట్యాపింగు కేసులో ఇప్పటివరకు జరిగిన విచారణను తెలంగాణ హైకోర్టు(Telangana High court)కు వివరించాలి. అమెరికాలో ఉంటున్న ప్రభాకరరావు పాత్రకు సంబందించిన అన్నీఆధారాలను కోర్టుకు చూపించాలి. పాత్రదారి అమెరికా నుండి బయటకు రావటానికి నిరాకరిస్తున్న విషయాన్ని చెప్పి, విచారణలో జరుగుతున్న ఆలస్యాన్ని వివరించాలి. దర్యాప్తు పూర్తవ్వాలంటే ప్రభాకరరావును విచారించటం ఎంతముఖ్యమో పోలీసులు హైకోర్టును కన్వీన్స్ చేయాలి. కోర్టు గనుక కన్వీన్స్ అయితే లెటర్ ఆఫ్ రొగెటరీని జారీచేస్తుంది. అంటే నిందితుడు ఏ దేశంలో ఉంటే ఆ దేశంలోనే విచారించేందుకు ఇచ్చే అనుమతి అన్నమాట.

తెలంగాణ హైకోర్టు జారీచేసే ఎల్ఆర్ ను ముందు కేంద్ర హోంశాఖ తర్వాత విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖలు ఆమోదించాలి. అప్పుడు విదేశీవ్యవహారాల శాఖ ద్వారా సదరు ఎల్ఆర్ అమెరికా ప్రభుత్వానికి చేరుతుంది. అమెరికా ప్రభుత్వం ఆ ఎల్ఆర్ ను పరిశీలించి న్యాయసలహా ప్రకారం నిందితుడు ఉంటున్న రాష్ట్రానికి పంపుతుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఎల్ఆర్ ను నిందితుడు ఉంటున్న అడ్రస్ ఏకోర్టు పరిధిలోకి వస్తుందో చూసి ఆ కోర్టుకు ఎండార్స్ చేస్తుంది. సదరు కోర్టు ఎల్ఆర్ ను పరిశీలించి ఓకే అంటే నిందితుడిని విచారించేందుకు అవకాశం దొరుకుతుంది. విచారణలో భాగంగా నిందితుడి నుండి కోర్టు పర్యవేక్షణలోనే వాగ్మూలాన్ని తీసుకుంటారు. ఆ వాగ్మూలాన్ని అక్కడి కోర్టు అనుమతితో ఇండియాకు పంపుతారు. అప్పుడు సదరు వాగ్మూలం తెలంగాణ పోలీసులకు అందుతుంది. ఆ వాగ్మూలాన్ని పోలీసులు కోర్టులో సబ్మిట్ చేస్తారు. నిందితుడు ఇచ్చిన వాగ్మూలం ద్వారా ట్యాపింగ్ కేసులో పోలీసులు ఫైనల్ చార్జిషీటును దాఖలుచేస్తారు.

నిజానికి లెటర్ ఆఫ్ రొగేటరీ అనే పద్దతి చాలా సుదీర్ఘమైన ప్రక్రియ. తెలంగాణ పోలీసుల విచారణ సాధ్యంకానపుడు నిందితుడు ట్యాపింగులో తన పాత్రను అంగీకరించే అవకాశంలేదు. తనపాత్రనే అంగీకరించనపుడు ఇక సూత్రదారుడిగురించి ఏమిచెబుతారు ? కాబట్టి పాత్రదారుడి వాగ్మూలం ద్వారా సూత్రదారుడు ఎవరనే విషయం బయటపేట్టే అవకాశం దాదాపు ఉండదనే అనుకోవాలి. పోలీసులు ఇప్పటికే నిందితుడి అరెస్టుకు కోర్టు వారెంట్ తీసుకున్నారు. రెడ్ కార్నర్, బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీచేయించారు. పాస్ పోర్టును సైతం రద్దుచేయించారు. అమెరికాలో కూర్చున్న ప్రభాకరరావు మీద తెలంగాణాలో ఎన్ని నోటీసులు జారీచేయిస్తే మాత్రం ఏమిటి ఉపయోగం ? సీబీఐని ప్రయోగించి ఇంటర్ పోల్(Interpol) ద్వారా ఒత్తిడిపెట్టి నిందితుడిని ఇండియాకు రప్పించే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆ ప్రయత్నం కూడా పెద్దగా సక్సెస్ అయినట్లు లేదు. అందుకనే ఆఖరి ప్రయత్నంగా లెటర్ ఆఫ్ రొగేటరీ విధానాన్ని ఫాలో అవుతున్నారు. మరీ పద్దతి ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాల్సిందే.

Tags:    

Similar News