దిల్ రాజుకు ఐటీ దెబ్బ తప్పదా..?

సినీ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఈ సోదాలు జరుగుతున్నాయి.;

Update: 2025-01-24 10:31 GMT

సినీ నిర్మాత దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ అధికారుల సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మూడు రోజులుగా ఈ సోదాలు జరుగుతున్నాయి. సినిమాలకు నిర్మాతలు పెడుతున్న పెట్టుబడులు వస్తున్న రిటర్న్స్, వారు చెల్లిస్తున్న ఆదాయ పన్ను అంశాలపై పలు అనుమానాలు రేకెత్తడంతోనే ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. సంక్రాంతి పండగకు దిల్ రాజు నిర్మాతగా వహించిన భారీ బడ్జెట్ సినిమా గేమ్ ఛేంజర్, సంక్రాంతి వస్తున్నాం సినిమాలు విడుదలయ్యాయి. ఈ రెండు సినిమాలు కూడా మంచి ఫలితాలనే అందుకున్నాయి. ఈ క్రమంలోనే ఐటీ సోదాలు చేపట్టడం కీలకంగా మారింది. దిల్ రాజుతో పాటు పుష్ప-2 సినిమా నిర్మాతలు, దర్శకుడు సుకుమార్ ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నారు. వీటిలో భాగంగానే శుక్రవారం దిల్ రాజును ఐటీ శాఖ అధికారులు ఆయన కార్యాలయానికి తీసుకెళ్లారు. శ్రేవెంకటేశ్వర క్రియేషన్స్(ఎస్‌వీసీ) కార్యాలయంలో సోదాలు కొనసాగించడానికే అధికారులు ఆయనను తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

దిల్ రాజు నివాసంలో సోదాలు పూర్తి చేసి పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తర్వాతే అధికారులు ఆయన కార్యాలయంలోని దస్త్రాలను కూడా పరిశీలించాలని అధికారులు నిర్ణయించుకున్నారని, అందుకోసమే ఆయనను అధికారులు స్వయంగా కార్యాలయానికి తీసుకెళ్లినట్లు సమాచారం.

కాగా దిల్ రాజు నివాసంలో దస్త్రాలను పరిశీలించిన అధికారులు లావాదేవీల్లో పలు అవకతవకలను గమనించారని, పుష్ప-2 నిర్మాతల ఇళ్లు, కార్యాలయాల్లో చేసిన సోదాల్లో కూడా వారు చెల్లింపుల్లో తేడాలను గమనించినట్లు తెలుస్తోంది. అందుకే ప్రతి డాక్యుమెంట్, లావాదేవాలకు సంబంధించి సమగ్ర సమాచారం అందుకోవడం కోసం అధికారులు ఆయన నివాసం నుంచి కార్యాలయానికి చేరుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలుపుతున్నాయి.

ఈ క్రమంలోనే దిల్ రాజుకు ఐటీ దెబ్బ తప్పదన్న ప్రచారం జోరందుకుంది. సినిమా కలెక్షన్ల ద్వారా వస్తున్నదానిలో చాలా మొత్తానికి లెక్కలు లేవని అధికారులు గుర్తించారని, అది భారీ మొత్తంలో ఉండబట్టే అధికారులు మూడు రోజులుగా సోదాలు కొనసాగిస్తున్నారని పలు వర్గాలు చెప్తున్నాయి. అతి త్వరలోనే వారిపై కేసులు కూడా నమోదు చేసే అవకాశం ఉందని, ఈ సోదాల్లో సేకరించిన అన్ని డాక్యుమెంట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒకవేళ అవకతవకలు జరిగాయని నిర్ధారణ చేసిన తర్వాత దిల్ రాజు సహా పలువురు నిర్మాతలపై పలు కేసులు నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి వీరి అంశంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News