జవహర్ నగర్...ఈ పేరు చాలా ముచ్చటగా, గొప్పగా ఉంటుంది. భారతదేశపు మొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ పేరున వెలసిన ఊరది. జవహర్ అనే మాట సైన్స్ టెక్నాలజీ, ఆధునికతకు పర్యాయపదం. కాని ఆ పేరుతో హైదరాబాద్ నగరానికి 31 కిలోమీటర్ల దూరాన వెలసిన ఈ జవహర్ నగర్ మాత్రం అక్షరాలా చెత్త దిబ్బ. హైదరాబాద్ చెత్త అంతా పోసి ఊరి చుట్టూ ఎత్తయిన దిబ్బలను తయారు చేశారు. ఈ దిబ్బల గబ్బు మధ్య నివసిస్తున్న లక్షలాది మంది ప్రజల విషాదం మీద ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రత్యేక కథనం...
(జవహర్‌నగర్ డంపింగ్ యార్డు నుంచి ఫెడరల్ తెలంగాణ స్పెషల్ కరస్పాండెంట్ సలీం షేక్)
ఎటు చూసినా కొండలను తలపిస్తున్న చెత్తాచెదారం గుట్టలు(Hillocks of Garbage)...ఆ పక్కనే కాలుష్య కాసారంగా మారిన పెద్ద చెరువు...హైదరాబాద్ మహా నగరం నుంచి చెత్తను తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్న భారీ ట్రక్కులు...చెత్త కుళ్లి పోయి వెలువడిన లిచ్చెడ్ వాటర్... ముక్కు పుటాలదిరేలా చెత్త నుంచి వస్తున్న దుర్గంధం(Toxic Fumes)...ఇదీ హైదరాబాద్ నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న(hyderabad Outskirts) జవహర్ నగర్ డంపింగ్ యార్డు దుస్థితి కనిపించింది. రెండున్నర దశాబ్దాలకు పైగా హైదరాబాద్ నగరంలోని చెత్తను డంప్ చేస్తున్న జవహర్ నగర్(JawaharNagar) డంపింగ్ యార్డును (Dumping Yard)‘ఫెడరల్ తెలంగాణ’ స్పెషల్ కరస్పాండెంట్ సందర్శించగా కనిపించిన దృశ్యాలు...
హైదరాబాద్ చెత్త జవహర్ నగర్ లో డంపింగ్
27 ఏళ్లుగా చెత్త డంపింగ్ ఇక్కడే...
జవహర్ నగర్ ప్రాంతంలోని 351 ఎకరాల ప్రభుత్వ స్థలంలోనే 27 ఏళ్లుగా హైదరాబాద్ నగర చెత్తను డంపింగ్ చేస్తున్నారు. 1998వ సంవత్సరంలో మొదట మల్కాజిగిరి, ఈసీఐఎల్ పరిసర ప్రాంతాల చెత్తను మాత్రమే ఇక్కడి డంపింగ్ యార్డుకు తరలించే వారు. కానీ కాలక్రమేణా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అయ్యాక కోటిన్నర మంది జనాభా పారవేసిన చెత్త, చెదారాన్ని జవహర్ నగర్ యార్డుకు 500కు పైగా భారీ ట్రక్కుల్లో తరలిస్తున్నారు. నగరం నలుమూలల నుంచి చెత్తను ఇక్కడికే తరలిస్తుండటంతో ఈ పరిసర గ్రామాల ప్రజలు తీవ్ర దుర్గంధంతో అల్లాడుతున్నారు.
చెత్త కాలుష్యం వల్ల చర్మవ్యాధికి గురైన వ్యక్తి
అనారోగ్యం పాలవుతున్న జనం
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ఈ పరిసర ప్రాంతాల ప్రజలకు జీవన్మరణ సమస్యగా పరిణమించింది.నాగారం, దమ్మాయిగూడ, రాంపల్లి పట్టణ ప్రాంతాల ప్రజలు కూడా ఈ చెత్త డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న విషవాయువులు పీల్చి ప్రజలు అనారోగ్యం బారిన (Health Hazards) పడుతున్నారు.గుట్టలుగా విస్తరించి ఉన్న ఈ డంపింగ్ యార్డు ప్రజల పాలిట శాపంగా మారింది.గ్రేటర్ హైదరాబాద్ నగరం నుంచి రోజుకు ఈ చెత్త యార్డుకు రోజుకు 8,500 నుంచి 9వేల టన్నుల చెత్త భారీ ట్రక్కుల్లో వస్తుంటుంది. ఈ చెత్త భారీ ట్రక్కులు నగర రోడ్లపై నుంచి వెళుతుంటేనే ఆ కొద్ది సేపు తీవ్ర దుర్గంధం వస్తుంటుంది. ఇలా రోజుకు వందలాది ట్రక్కుల్లో చెత్తను తీసుకువచ్చి జవహర్ నగర్ లో డంపింగ్ చేస్తే ఇంకెంత దుర్గంధం వెలువడుతుందో ఊహించుకోవచ్చు. చెత్తను తరలిస్తుండగా భారీ ట్రక్కుల వల్ల నగరంలో పలు ప్రమాదాలు కూడా జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
డంపింగ్ యార్డు చెంత ఉన్న కార్మికనగర్ లో ముక్కు మూసుకొని వెళుతున్న మహిళలు
ఈ ప్రాంతాల్లో ముక్కు మూసుకోవాల్సిందే...
జవహర్ నగర్(Telangana Town) ప్రాంతంతోపాటు చుట్టుపక్కల ఉన్న అంబేద్కర్ నగర్, మల్కారం, రాజీవ్ గాంధీనగర్, గబ్బిలాల పేట, చీర్యాల, హరిదాస్ పల్లి, అహ్మద్ గూడ, తిమ్మాయిపల్లి, రాజీవ్ స్వగృహ, దమ్మాయిగూడ, నాగారం, రాంపల్లి, ప్రగతినగర్, కార్మికనగర్ ప్రాంతాల నివాసులు డంపింగ్ యార్డు దుర్ఘంధంతో ముక్కు మూసుకోవాల్సి వస్తుంది. ప్రతీరోజూ ఉదయం, సాయంత్రం యార్డు నుంచి వెలువడుతున్న ఘాటు వాసనలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ కాలుష్య వాయువుల ప్రభావంతో భూగర్భజలాలు కూడా రంగుమారి కలుషితం అయ్యాయి.ఈ ప్రాంతాల్లోని భూగర్భజలాలు కలుషితం కావడంతో ఇక్కడి ప్రజలు చర్మవ్యాధుల బారిన పడి అల్లాడుతున్నారు. మరో వైపు కాలుష్య వాతావరణంతో పలువురు చర్మవ్యాధుల బారినపడి చికిత్స కోసం డెర్మటాలజిస్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదనగా చెప్పారు. కోటిన్నర మంది ప్రజలు పారవేసిన చెత్తను తీసుకువచ్చి ఇక్కడ డంప్ చేయడం వల్ల జవహర్ నగర్ ప్రాంతంలో 15 లక్షల మంది ప్రజలు చెత్త కాలుష్యం కాటుకు గురవుతున్నారు.ఈ ప్రాంతంలోని ప్రజలను ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధి ఎవరినీ కదిలించిన చర్మవ్యాధులు లేదా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నామని చెప్పడం ఆవేదన కలిగిస్తోంది. సాయంత్రం వేళ డంపింగ్ యార్డు వైపు నుంచి తమ ఇంటి వైపు తీవ్ర దుర్గంధంతో కూడిన గాలులు వీస్తున్నాయని, ఈ ఘాటు వాసనలతో పిల్లలు ఆస్తమా బారిన పడుతున్నారని నాగారం మున్సిపాలిటీ భవానీనగర్ ప్రాంతానికి చెందిన షేక్ ఇమ్రాన్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
ఏ ఏ రోగాలు ప్రబలుతున్నాయంటే...
ఈ చెత్తలో నుంచి కలుషిత గ్యాస్ వెలువడుతుండటంతో ఈ పరిసర ప్రాంతాల ప్రజలు చర్మవ్యాధులు,(Foul Air,Skin Diseases) ఊపిరితిత్తుల వ్యాధులతో సతమతమవుతున్నారు. కాలుష్యం వల్ల ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. చెత్త వల్ల ఈ డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో దోమలు, ఈగలు వ్యాప్తిచెందటంతో తీవ్ర మైన చర్మవ్యాధుల బారిన పడిన ప్రజలు చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దమ్మాయిగూడ ప్రాంత ప్రజలు ఇటీవల డెంగీ జ్వరాల బారిన పడ్డారు. నీరు, గాలి, వాతావరణం కలుషితం చేసేలా చెత్తను డంపింగ్ చేస్తూ ప్రజారోగ్యాన్ని దెబ్బతీస్తున్నారని డంపింగ్ యార్డు ప్రాంత నివాసి అయిన బీజేపీ నాయకుడు, డంపింగ్ యార్డు వ్యతిరేక పోరాట కమిటీ ప్రతినిధి రంగుల శంకర్ నేత ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చెత్త నుంచి వెలువడుతున్న లిచ్చెడ్ వాటర్, కెమికల్ వాటర్ వల్ల తమ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని, తమ పిల్లల భవిష్యత్ ఏమిటని శంకర్ ప్రశ్నించారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డు, చెత్త నుంచి పవర్ ప్లాంట్, కలుషిత చెరువు చిత్రం
కోట్లు వెచ్చిస్తున్నా తీరని కాలుష్య సమస్య
జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్య వాయువులను నివారించేందుకు, వేస్ట్ మేనేజ్ మెంట్ కోసం జీహెచ్ ఎంసీ అధికారులు కోట్లాదిరూపాయలు వెచ్చిస్తున్నా ఈ ఘాటు వాసనలకు తెరపడటం లేదు. డంపింగ్ యార్డు సమీపంలోని గబ్బిలాలపేట వాసులకైతే రాత్రి పూటకూడా దుర్గంధంతో నిద్రపోలేక పోతున్నారు.చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంటు పెట్టినా ఈ దుర్గంధ సమస్య మాత్రం తీరలేదు. గుట్టలుగా పేరుకుపోయిన చెత్త ఈ ప్రాంత ప్రజల జీవితాలను అగమ్య గోచరంగా మార్చేస్తోంది. జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల తమ పిల్లలతో జీవనం సాగించడం కష్టంగా మారిందని పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషవాయువులు, దుర్వాసన, దోమల బెడదతో ఊపిరి పీల్చలేని స్థితి ఏర్పడిందని దమ్మాయిగూడకు చెందని కార్మికుడు లచ్చన్న ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డు పేరుకుపోయిన చెత్త గుట్టలు
పండుగలు వస్తే చాలు పెరుగుతున్న దుర్గంధం
దసరా, బక్రీద్, క్రిస్మస్, వినాయకచవితి పండుగలు వచ్చాయంటే చాలు మాంసం వ్యర్థాలు, ఇతర వ్యర్థాలు పెరిగి చెత్త శాతం అధికమవడం వల్ల జవహర్ నగర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర దుర్గంధం వెలువడుతుందని, ఆ వాసనను తాము భరించ లేక పోతున్నామని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రీమూవల్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి, యాక్టివిస్టు గోగుల రామకృష్ణ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. పండుగ వచ్చిందంటే చాలు ఆ తర్వాత పదిరోజుల పాటు తమకు తీవ్ర కంపుతో నరకం అనుభవిస్తున్నామని దమ్మాయిగూడకు చెందిన రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. సాధారణ రోజుల్లో రోజుకు 9 వేల టన్నుల చెత్త వస్తుందని, కానీ ఏదైనా పండుగ వచ్చిందంటే చెత్త 12 వేల టన్నులకు పెరుగుతుందని ఆయన తెలిపారు.
టన్ను చెత్తకు 1453రూపాయల రాంకీకి చెల్లింపు...
హైదరాబాద్ మహానగరంలో సేకరించిన చెత్తను టన్నుకు 1453రూపాయలకు రాంకీ సంస్థకు జీహెచ్ఎంసీ చెల్లిస్తుందని డంపింగ్ యార్డు చెంత ఉన్న కార్మిక నగర్ ప్రాంత నవోదయా వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు పాకాలపాటి శ్రీలేష్ సందీప్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. నగరం నుంచి చెత్త డంపింగ్ కాగానే దాన్ని వేరు చేసి...స్లాటర్ హౌస్ వేస్ట్, కూరగాయల వేస్ట్ ను ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెబుతున్నారు. హాస్పిటల్, ఇండస్ట్రియల్, ఈ వేస్ట్ ను దుండిగల్ ప్లాంటుకు తరలిస్తున్నారని ఆయన తెలిపారు. పొడి ఆర్డీఎఫ్ చెత్తను బాయిలరులో వేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని ఆయన చెప్పారు. రాంకీ సంస్థ చెత్తతో లాభాలు గడిస్తూ ఈ ప్రాంత ప్రజలకు అనారోగ్యాన్ని పంచుతుందని సందీప్ ఆవేదనగా చెప్పారు.
డంపింగ్ యార్డు చెంత ప్రభుత్వ నివాసగృహాల నిర్మాణం
జవహర్ నగర్ డంపింగ్ యార్డు వల్ల ఈ ప్రాంతం కలుషితం అవడంతో పాటు తీవ్ర దుర్గంధం వెలువడుతుందని తెలిసినా రాష్ట్ర ప్రభుత్వమే పేదలకు 20వేల ఇళ్లను నిర్మించి వారిని ఇకడకు తరలించిందని పాకాలపాటి శ్రీలేష్ సందీప్ ఆరోపించారు. భారీ కాలుష్యంతో నివాస యోగ్యంగా లేని ఈ ప్రాంతంలో పేదరికాన్ని ఆసరాగా తీసుకొని ప్రభుత్వమే రాజీవ్ గృహకల్ప41 బ్లాకులను నిర్మించి 4,525 మందికి ఇళ్లను కేటాయించిందన్నారు. కేసీఆర్ సర్కారు కూడా అహ్మద్ గూడ ప్రాంతంలో 4,428 డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించింది. పేదలంటే ప్రభుత్వానికి ఇంత చులకనా? కాలుష్య కాసారంగా మారిన డంపింగ్ యార్డు చెంత బీపీఎల్ కుటుంబాలకు నివాస గృహాలు నిర్మించి ఇవ్వడం ఏమిటని సందీప్ ప్రశ్నించారు.
సర్కారే వేస్ట్ మేనేజమెంట్ రూల్స్ ఉల్లంఘన
వేస్ట్ మేనేజమెంట్ రూల్స్ 2016 ప్రకారం నివాస ప్రాంతాలకు డంప్ యార్డ్ 500 మీటర్ల దూరంలో ఉండాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే రాజీవ్ గృహకల్ప, డిగ్నిటీ హౌసింగ్ కాలనీల పేరిట పేదలకు నివాస గృహాలను 250 మీటర్ల దూరంలోనే నిర్మించడం వెనుక అంతర్యం ఏమిటని యాక్టివిస్టు సందీప్ ప్రశ్నించారు. పేదలకు జీవించే హక్కు లేదా? చెత్త డంపింగ్ పక్కన కాలుష్యపు కోరల్లో చిక్కుకొని అనారోగ్యం పాలవ్వాలా? అని ఆయన అడిగారు. రాజీవ్ గృహకల్పలో 141 బ్లాక్స్ 4,525 నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి పేదలకు ఇచ్చింది. రాజీవ్ గృహకల్ప కేవలం 100 మీటర్ల దూరంలోనే ఉంది. డిగ్నిటీ హౌసింగ్ కాలనీ (డబల్ బెడ్ రూమ్ ) ఇళ్లు 250 మీటర్ల దూరంలో 41 బ్లాక్స్ ఉన్నాయి. డబల్ బెడ్రూం ఇళ్లలో 4,428 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతర్
హైదరాబాద్ నగరం నుంచి పెద్ద ఎత్తున వెలువడుతున్న చెత్తను జవహర్ నగర్ ఒకే చోట డంపింగ్ చేయకుండా నగరం నలుమూలల డంపింగ్ యార్డులు ఏర్పాటు చేసి అక్కడ వేసి సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ చేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు జారీ చేసినా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని అమలు చేయలేదు. హైదరాబాద్ నగరానికి నలువైపులా లక్డారం, ప్యారానగర్, ఇబ్రహీంపట్నం,దుండిగల్ ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా, కార్యరూపం దాల్చలేదు. ఈ చెత్త వల్ల లిచ్చెడ్ వాటర్ 12 చెరువుల్లోకి చేరడంతో అవి కూడా కలుషితమయ్యాయని జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ రీమూవల్ పీపుల్స్ ఫోరం కో కన్వీనర్ గోగుల రామకృష్ణ చెప్పారు.