కాంగ్రెస్ నేతలతో భేటీపై స్పందించిన కడియం
కాంగ్రెస్ పార్టీ కీలక నేతల బృందం శుక్రవారం కడియం శ్రీహరి తో భేటీ అవడం చర్చనీయాంశం అయింది. కడియంతో పాటు ఆయన కుమార్తెను పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని విరమించుకున్నట్లు కడియం కావ్య పార్టీ అధినేత కేసీఆర్ కి లేఖ రాశారు. దీంతో కడియం శ్రీహరి, కడియం కావ్య కూడా పార్టీ మారేందుకు రెడీ అయిపోయినట్లు చెప్పకనే చెప్పేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ కీలక నేతల బృందం శుక్రవారం కడియం శ్రీహరి తో భేటీ అవడం చర్చనీయాంశం అయింది. కడియం శ్రీహరి ఇంట్లో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ, రోహిత్ చౌదరీ, విష్ణునాథ్, మల్లు రవి, సంపత్ కుమార్, రోహిన్ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు. కడియంతో పాటు ఆయన కుమార్తెను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఇదే విషయాన్ని భేటీ అనంతరం దీపాదాస్ మున్షీ మీడియాకి వివరించారు.
"సీనియర్ నేత కడియం శ్రీహరిని, ఆయన కుమార్తెను కాంగ్రెస్ లోకి ఆహ్వనించాము. ఆయన తన అనుచరులతో మాట్లాడి చెబుతాను అన్నారు. ఆయన అవసరం పార్టీకి ఉంది. కాంగ్రెస్ ని బలోపేతం చేయడానికి ఆయన పార్టీలోకి వస్తారనే ఆశిస్తున్నాం" అని దీపాదాస్ మున్షీ వెల్లడించారు.
కడియం మాట్లాడుతూ.. ఏఐసీసీ పెద్దలు, పీసీసీ పెద్దలు నన్ను, నా కుమార్తెను కాంగ్రెస్ లో చేరాలని ఆహ్వానించారు. కార్యకర్తలతో చర్చించాక ఒకటి రెండు రోజుల్లోనే నా నిర్ణయాన్ని ప్రకటిస్తా. బీఆర్ఎస్ పార్టీ దిగజారడానికి, నాయకులు పార్టీని వీడడానికి అనేక కారణాలున్నాయి. ప్రజలకు సేవ చేయడానికి, నమ్ముకున్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది" అని అన్నారు.
కడియం శ్రీహరి కాంగ్రెస్ నేతలతో భేటీ అవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. స్టేషన్ ఘన్పూర్‌లో కడియం శ్రీహరి దిష్టిబొమ్మ దహనం చేసి.. తెలంగాణ దొంగ కడియం డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
"కడియం శ్రీహరి దళిత నేతల మీద చాడీలు చెప్పి, ఎంతో మంది దళిత నేతలను ఎదగనివ్వకుండా చేశాడు. కడియం శ్రీహరి చంద్రబాబు నాయుడును మోసం చేసినప్పటికీ తెలంగాణ కోసం, బీఆర్ఎస్ పార్టీ కోసం నిస్వార్థంగా పని చేస్తానంటే నీచుడని తెలిసినా.. నేను, కేటీఆర్, పెద్ది సుదర్శన్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించాం" అని వరంగల్ వెస్ట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కడియం పై ఆరోపణలు గుప్పించారు.
"బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి 10 సంవత్సరాలు ఎన్నో పదవులు అనుభవించాడు. ఒక్కసారి ఉప ముఖ్యమంత్రిగా, రెండు సార్లు శాసన మండలి సభ్యునిగా, పార్లమెంట్ సభ్యునిగా చేశావు. నిన్ను గెలిపించడానికి కార్యకర్తలు ఎంత కష్ట పడ్డారో ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో. రేపు స్టేషన్ ఘన్‌పూర్ కార్యకర్తల సమావేశం జరుపుతున్నాం.. స్టేషన్ ఘన్‌పూర్ అంటే గులాబీ కోట. కడియం శ్రీహరి లేనప్పుడే స్టేషన్ ఘన్‌పూర్‌లో గులాబీ జెండాను రెపరెపలాడించాం.. ఈ గులాబీ కోటలో చీడ పురుగులా వచ్చిన కడియం శ్రీహరి వెళ్ళిపోయాడు" అని బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కడియం శ్రీహరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.