Kaleshwaram | వైట్ ఎలిఫెంట్ లాగ అయిపోయిందా ?
కాళేశ్వరం నిర్మాణంకోసం కేసీఆర్(KCR) ప్రభుత్వం అందిన ప్రతి సంస్ధ దగ్గర అప్పుచేసింది;
తొమ్మిదేళ్ళ కేసీఆర్ హయాంలో తెలంగాణ అప్పులకుప్పగా మారిపోవటానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కీలకమనే చెప్పాలి. ఏ ప్రాజెక్టయినా టేకప్ చేయటం వల్ల తక్షణమే ప్రజలకు దీర్ఘకాలంలో ప్రభుత్వానికి మంచి జరగాలి. కాని కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) వల్ల జనాలకు(రైతులకు) ఒరిగింది పెద్దగా లేకపోగా రాష్ట్రప్రభుత్వం మీద అప్పుల కుంపటి లాగ పెరిగిపోయింది. కాళేశ్వరం నిర్మాణంకోసం కేసీఆర్(KCR) ప్రభుత్వం అందిన ప్రతి సంస్ధ దగ్గర అప్పుచేసింది. చేసిన అప్పు సుమారు 90 వేల కోట్లయితే దానికి కట్టాల్సిన ఏడాది వడ్డీల కారణంగా ఇప్పటికి అప్పు మొత్తం సుమారు రు. 1.10 లక్షల కోట్లకు చేరింది. జాతీయ బ్యాంకులతో పాటు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర ఫైనాన్ష్ కార్పొరేషన్ నుండి రు. 87,449 కోట్ల అప్పు మంజూరైతే రు. 71,566 కోట్లు విడుదలయ్యాయి. ఇదికాకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అయ్యే వ్యయంలో కాళేశ్వరం కార్పొరేషన్ నుండే రు. 10 వేల కోట్ల అప్పు మంజూరైతే ఇందులో 7,722 కోట్లు విడుదలయ్యాయి.
పైరెండు ప్రాజెక్టులకు చేసిన అప్పుల్లో అసలు+వడ్డీ కలిపి సుమారు రు. 29,737 కోట్లు చెల్లించింది. ఇంకా చెల్లించాల్సింది రు. 64,212 కోట్ల అసలు+రు. 41,638 కోట్లు కలిపి లక్ష కోట్లరూపాయలకు పైగానే చెల్లించాల్సుంది. రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్(ఆర్ఇసీ) నుండే రు. 30,536 కోట్లు మంజూరవ్వగా రు. 16 వేల కోట్లను కట్టాలి. భారీగా పెరిగిపోయిన అసలు+వడ్డీ చెల్లింపులను రీషెడ్యూల్ చేయాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కార్పొరేషన్ ఛైర్మన్ను కలిసి విజ్ఞప్తిచేసినా ఉపయోగంలేకపోయింది. రుణాల రీస్ట్రక్చరింగ్ అయినా చేయాలని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ను ఎనుముల రేవంత్ రెడ్డి విజ్ఞప్తిచేసినా కుదరలేదు. కేసీఆర్ స్వల్వకాలిక రుణాల పద్దతిలో చేసిన అప్పును దీర్ఘకాలిక రుణాలుగా మార్చాలన్న ప్రయత్నం కూడా సానుకూలం కావటంలేదు. రుణాలు దీర్ఘకాలికం అయితే కనీసం వడ్డీభారమన్నా తగ్గుతుందని రేవంత్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
ఇపుడు విషయం ఏమిటంటే కాళేశ్వరం ప్రాజెక్టు నీటివినియోగానికి పనికిరాదు అలాగని దాన్ని అలాగ వదిలేయలేరు. క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను గమనించినతర్వాత కాళేశ్వరంప్రాజెక్టు తెలంగాణ ప్రభుత్వానికి వైట్ ఎలిఫెంట్(తెల్లఏనుగు) లాగ తయారైందని అర్ధమవుతోంది. తెల్లఏనుగును మేపలేరు అలాగని దాని ఖర్మానికి దాన్ని వదిలేయలేరు. ఏనుగు ఉపయోగం ఏమిటి దానిమీద ఎక్కి ఊరేగటం. అలాంటిది ఊరేగింపునకు ఏనుగు పనికిరాకుండా పోయిందంటే ఇంక దానివల్ల ఉపయోగం ఏమిటి ? ఇపుడు కాళేశ్వరం నీటివినియోగానికి పనికిరాకుండా పోవటంవల్ల రైతులకుజరిగే ఉపయోగం పెద్దగా ఏమీఉండదు. దాన్ని వినియోగంలోకి తీసుకురావాలన్నా మళ్ళీ అంతకు అంతా ఖర్చు చేయాల్సిందే. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల రిపేర్ల మీద మళ్ళీ వేలకోట్లరూపాయలు ఖర్చు చేసేబదులు కొత్త ప్రాజెక్టులే కట్టుకోవచ్చు.
రేవంత్ ప్రభుత్వం పరిస్ధితి చాలా ఇబ్బందుల్లో పడిపోయింది. కాళేశ్వరాన్ని ఉపయోగించుకోలేరు అలాగని రిపేర్లూ చేయించలేరు. ఎందుకంటే రిపేర్లు చేయించినా ఉపయోగం ఎంతమేరకు ఉంటుందో ఎవరికీ అర్ధంకావటంలేదు. ఇపుడీ ప్రాజెక్టుకు వేలకోట్ల రూపాయలు వ్యయంతో రిపేర్లు చేయించాలని అనుకున్నా ఏ బ్యాంకు లేదా ఏ ఆర్ధికసంస్ధ కూడా అప్పిచ్చే పరిస్ధితి కనబడటంలేదు. సొంతంగానే రిపేర్లు చేయించాలంటే ప్రభుత్వం దగ్గర అన్ని నిధులు లేవు. మొత్తంమీద కాళేశ్వరం ప్రాజెక్టును వదిలించుకోవటం రేవంత్ వల్ల అయ్యేట్లులేదు. చివరకు ఏమి చేస్తారో చూడాల్సిందే.