కవిత పాలిటిక్స్ లొ కొత్త చాప్టర్ తీహార్ జైలు...

తెలుగు రాష్ట్రాల నుంచి తీహార్ కు వెళ్లిన తొలి రాజకీయ నాయకురాలు కవిత అయ్యారు. ఆమెకు జైలులో అన్ని సౌకర్యాలు కల్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Update: 2024-03-26 12:46 GMT
కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. స్కాంలో ఆమె మేనల్లుడు మేక శరణ్ పాత్రపై ముఖ్యంగా కవితను అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. అయితే నేటితో కవిత రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు రౌజ్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ కేసుతో పాటే కవిత బెయిల్ పిటిషన్‌పై కూడా మంగళవారం విచారణ జరిగింది. ఇందులో భాగంగా ఆమెను విడుదల చేయడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని, కావును ఆమెను కస్టడీకే పంపాలని ఈడీ కోరింది.

ఈడీ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం కవితకు జ్యుడీషియల్ కస్టడీని విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై మోపిన అభియోగాలు ‘పొలిటికల్ లాండరింగ్’కి సంబంధించినవే తప్ప ‘మనీ లాండరింగ్‌’కి సంబంధించినవి కాదని బీజేపీ టార్గెట్‌గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత.

కడిగిన ముత్యంలా బయటకొస్తా: కవిత

జైలుకు తరలిస్తున్న క్రమంలో త్వరలోనే తాను బయటకు వస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఈడీ నాపై అభియోగాలు మోపి.. అరెస్ట్ చేసి.. ఇప్పుడు జైలుకు పంపుతుంది. అతి త్వరలోనే ఈ అభియోగాల నుంచి విముక్తిరాలినై కడిగిన ముత్యంలా బయటకు వస్తాను. ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఈ కేసులో నిందితులైన ముగ్గురిలో ఒకరు బీజేపీలో చేరారు. మరొకరికి బీజేపీ టికెట్ ఇచ్చింది. మూడో వ్యక్తి ఎన్నికల బాండ్స్ పేరిట బీజేపీకి దాదాపు రూ.50 కోట్లు చెల్లించారు’’ అని కుంభకోణంలో నిందితులకు బీజేపీనే షెల్టర్ ఇస్తుందని పరోక్షంగా ఆరోపణలు చేశారు.

‘‘కానీ ఏ తప్పూ చేయని నన్ను ఇబ్బంది పెడుతున్నారు. అతి త్వరలోనే బయటకు మచ్చలేకుండా బయటకు వస్తా’’అని ఆమె వెల్లడించారు. అనంతరం కవిత అప్రూవర్‌గా మారనున్నారని వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. బీజేపీ ఎంత ప్రయత్నించినా తన ఆత్మగౌరవాన్ని భంగపరచలేదని, తాను అప్రూవర్‌గా మారడం అన్న ప్రసక్తే లేదని, అయినా తాను తప్పు చేయనిదే దేనికి అప్రూవర్‌గా మారతానంటూ ఎదురు ప్రశ్నవేశారు.

కవితనను కస్టడీకే పంపాలి: ఈడీ

ఏప్రిల్ 16న తన చిన్న కుమారుడి పరీక్షలు ఉన్నందున అప్పటివరకు తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత.. ధర్మాసనాన్ని కోరారు. ఆ పిటిషన్‌పై నేడు విచారణ జరిగింది. ఈ విచారణలో కవితను ఇప్పుడు బయటకు పంపడం వల్ల సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని ఈడీ వాదించింది. ‘‘కవిత చాలా ప్రభావం ఉన్న వ్యక్తి. ఆమెను ఇప్పుడు బయటకు పంపితే ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది. దాంతో దర్యాప్తుకు ఆటంకం కలగొచ్చు. కుంభకోణంలో కవిత పాత్రపై దర్యాప్తు జరుగుతుంది. ఈ సమయంలో ఆమెను బయటకు పంపకుండా కస్టడీకి పంపాలి’’అని ఈడీ తరపు న్యాయవాది కోరారు.

న్యాయస్థానం కీలక ఆదేశాలు

కవిత బెయిల్ పిటిషన్‌పై జరిగిన విచారణలో ఈడీ తరపు న్యాయవాది వాదనలు విన్న అనంతరం ఈడీకి న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. కవితకు సంబంధించిన అన్ని హెల్త్ రికార్డ్స్‌ను ఆమె న్యాయవాదులకు అందించాలని ఆదేశించింది. అంతేకాకుండా కవిత బెయిల్ పిటిషన్‌పై తమ సమాధానాన్ని ఏప్రిల్ 1న తెలపాలని తెలిపింది. అంతేకాకుండా ఆమెకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని, నిద్రించడానికి కూడా తగిన సౌకర్యాలు కల్పించాలని, బంగారు ఆభరణాలను కూడా అనుమతించాలని, ఔషధాలనూ అనుమతించాలని తీహార్ జైలు సూపరింటెండెంట్‌కు ఆదేశించింది న్యాయస్థానం. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను ఏప్రిల్ 1కి వాయిదా వేసింది.

Tags:    

Similar News