Kavitha | కవితను అమెరికా గండం వెంటాడుతోందా ?

రెండోసారి అమెరికాకు వెళ్ళగానే కవిత పదవి ఊడిపోయింది;

Update: 2025-08-22 07:15 GMT
BRS MLC Kavitha

ప్రజాప్రతినిధుల్లో ఒక్కొక్కరికి ఒక్కో గండం లేదా సెంటిమెంటు ఉంటుంది. కొందరికి కొన్ని గుళ్ళకు వెళితే పదవి పోతుందనే భయం ఉంటుంది. మరికొందరికి కొన్ని నదులు దాటితే పదవులు పోతాయనే నమ్మకాలుంటాయి. అలాంటిదే బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్(KCR) కూతురు, ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత(Kavitha)కు అమెరికా(America) గండం ఉన్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే రెండుసార్లూ కవిత అమెరికాకు వెళ్ళినపుడు పార్టీలో పెద్ద సమస్యలు ఎదురయ్యాయి. మొదటిసారి అమెరికాలో ఉన్నపుడు అంతకుముందు ఎప్పుడో తండ్రికి రాసిన లేఖ లీక్ అవ్వటంపై పార్టీలో పెద్ద గొడవజరుగుతోంది. ఇపుడు రెండోసారి అమెరికాకు వెళ్ళగానే కవిత పదవి ఊడిపోయింది. పదవి ఊడిపోవటంతో అమెరికా నుండే ఇక్కడి మీడియాతో మాట్లాడుతు కవిత నానా గోలచేస్తున్నారు.

పెద్దకొడుకు గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి డిగ్రీ తీసుకుంటున్నాడని రెండునెలలక్రితం కవిత అమెరికాకు వెళ్ళారు. అంతకుముందు ఎప్పుడో కేసీఆర్ కు పార్టీవ్యవహారాలపై రాసిన లేఖ లీకయ్యింది. ఆలేఖలో కేసీఆర్ ను తప్పుపడుతు, పార్టీ 25 ఏళ్ళ ప్రస్ధానం సందర్భంగా ఎల్కతుర్తితో నిర్వహించిన బహిరంగసభ నిర్వహణ లోపాలతో పాటు కేసీఆర్ ప్రసంగంలో తప్పులను కవిత లేఖలో ప్రస్తావించారు. కవిత రాసిన లేఖ లీకై మీడియా చేతుల్లోపడటంతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద సంచలనమైపోయింది. లేఖ కారణంగా పార్టీలో పెద్ద కలకలంరేగింది. కవిత లేఖ దెబ్బ పార్టీకి ఏస్ధాయిలో తగిలిందంటే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి తన్నీరు హరీష్ రావులు దాదాపు వారంరోజులు మీడియాకు మొహంచాటేశారు. ప్రతిరోజు టైంటేబుల్ వేసుకున్నట్లుగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నానా రచ్చచేసే ఇద్దరు వారంరోజులు అసలు మీడియాలోనే కనబడలేదు. మీడియా ముందుకు వస్తే కవిత లేఖ విషయమై సమాధానాలు చెప్పుకోవాల్సొస్తుందన్న కారణంతోనే మీడియాను ఎవాయిడ్ చేశారు.

లేఖ లీకు దెబ్బకే అప్పటినుండి కవిత పార్టీకి కాకుండా పోయారు. పార్టీలోని నేతలు, క్యాడర్ మొత్తం అప్పటినుండి కవితకు దూరంగా ఉంటున్నారు. కవిత పేరుకు పార్టీలోనే ఉంటున్నా ఒంటరి అయిపోయింది మాత్రం వాస్తవం. కవిత పరిస్ధితి ఎలాగైపోయిందంటే కుటుంబం కూడా కలుపుకోవటంలేదు. ఎప్పుడైతే సోదరుడు కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేదిలేదని ప్రకటించారో అప్పటినుండి కేసీఆర్ కూడా కవితను కలవటానికి ఇష్టపడటంలేదు. కేటీఆర్ తో వివాదం మొదలైన తర్వాత కవిత రెండుసందర్భాల్లో ఫామ్ హౌస్ కు వెళితే రెండుసార్లూ కవితను చూడటానికి కేసీఆర్ ఇష్టపడలేదు.

ఈనేపధ్యంలోనే చిన్నకొడుకు గ్రాడ్యుయేషన్ చేయటానికి అమెరికాకు వెళ్ళాడు. కాలేజీలో చేర్పించేందుకు చిన్నకొడుకును తీసుకుని కవిత అమెరికాకు వెళ్ళారు. వెళ్ళేముందు ఒకసారి తండ్రి ఆశీస్సులు ఇప్పించేందుకు కొడుకును తీసుకుని ఫామ్ హౌసుకు కవిత వెళ్ళారు. అయితే చాలాసేపు బెడ్ రూమ్ బయటే ఇద్దరినీ వెయిట్ చేయించిన కేసీఆర్ చివరకు భార్య చెప్పిందని మనవడిని మాత్రమే రూములోకి పిలిపించుకుని మాట్లాడి పంపేశారని సమాచారం. దాంతో చేసేదిలేక కొడుకును తీసుకుని అమెరికాకు వెళ్ళిపోయారు. అలా అమెరికాకు వెళ్ళారో లేదో రెండోరోజు కవితను పదవిలోనుండి ఊడబీకేశారు. పదేళ్ళు తెలంగాణ బొగ్గగని కార్మిక సంఘం(టీబీజీకేఎస్)కు కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉంటున్నారు. అలాంటిది గౌరవాధ్యక్షురాలిగా కవితను తీసేసి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ను కార్యవర్గం ఎన్నుకున్నది.

విషయం తెలియగానే తనను గౌరవాధ్యక్షురాలిగా తీసేయటం అన్యాయమంటు కవిత అమెరికా నుండే ఇక్కడి మీడియాతో మాట్లాడుతు నానా గోలచేస్తున్నారు. సంఘం నేతలకు రాసిన లేఖలో పార్టీ తనపై కక్షసాధింపులకు దిగుతోందని కవిత నానా గోలచేస్తున్నారు. ఎక్కడా పేరు ప్రస్తావించలేదుకాని కవిత చేసిన ఆరోపణలు, విమర్శలన్నీ కేటీఆర్ ను ఉద్దేశించి చేస్తున్నవే అని అందరికీ అర్ధమవుతున్నాయి. ఏదేమైనా జరుగుతున్నది చూస్తుంటే రెండుసార్లు అమెరికాలో ఉన్నపుడే ఇబ్బందులు ఎదురవ్వటంతో కవితకు అమెరికా గండం ఏదో ఉన్నట్లుంది అనే ప్రచారం పెరిగిపోతోంది.

Tags:    

Similar News