మహిళల కోసం ఉద్యమించిన కవిత.. కాంగ్రెస్‌కు డెడ్‌లైన్ ఫిక్స్
మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా చేయడమే ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యమని చెప్పారు కవిత.;
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలపై హామీల జల్లు కురిపించింది. ప్రతి ఒక్కరికీ అరచేతిలో వైకుంఠం చూపింది. తీరా అధికారం వచ్చాక రాష్ట్రమంతా అంధకారమే. ఒక్క హామీని కూడా పూర్తి నెరవేర్చలేదు. పలు హామీలను తూతూ మంత్రంగా ప్రారంభించారు. ప్రతి లబ్ధిదారుడికి అందిస్తామన్న పథకాలు.. కొందరికి మాత్రమే దక్కుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకతో మహిళలు తీవ్రంగా మోసపోయారు. ఎన్నికల ముందు మహిళలకు ఎన్నో హామీలు ఇచ్చి కాంగ్రెస్.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదు. వాటిని సాధించడమే నా లక్ష్యం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. ఇందుకోసం పోస్ట్ కార్డు ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగానే వారి నుంచి దాదాపు 10వేల పోస్ట్ కార్డులను సేకరించారు కవిత. వీటన్నింటిని సీఎం రేవంత్‌కు పంపారు. వీటిలో మహిళలకు అందాల్సిన పథకాలు, వారికి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను రాశారు.
‘‘10 వేల పోస్టు కార్డులను సేకరించి పంపిస్తున్నాం. హామీల అమలుపై మార్చి 8న ప్రకటన చేయకపోతే 10 వేల మహిళలం 10 వేల గ్రామాల్లోకి వెళ్తాం. లక్షలాది పోస్టు కార్డులను తయారు చేసి సోనియా గాంధీకి పంపిస్తాం. మహిళలకు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మానవీయంగా ఆలోచించడం లేదు. ఆడబిడ్డల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి నిర్లక్ష్యం తగదు. సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ మాట్లాడక ముందే మహిళా బిల్లు కోసం తెలంగాణ జాగృతి ఢిల్లీలో ధర్నా చేసింది. మహిళా బిల్లు రావడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర లేదు. మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలుకు కాంగ్రెస్ పార్టీ కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదు’’ అని తెలిపారు.
‘‘వరంగల్ ఎయర్ పోర్టుకు రాణి రుద్రమాదేవీ పేరు పెట్టాలి. ఈ విషయంలో మేము కూడా కేంద్రానికి లేఖ రాస్తాం. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనకు... ఆయన ప్రారంభించిన పెట్రోల్ పంప్‌కు పోలిక లేదు. ప్రభుత్వం ప్రతిపాదించిన పథకాలు కేవలం పదుల సంఖ్యలో మహిళలకు తప్పా పెద్ద ఎత్తున ప్రయోజనం కలిగే అవకాశంలేదు. మహిళలకు నెలకు రూ 2500 ఇచ్చే కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. అప్పుడు ఎక్కువ మంది మహిళలకు ప్రయోజనం కలుగుతుంది. 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు పంపిణీ చేస్తామన్న హామీని అమలు చేయాలి’’ అని డిమాండ్ చేశారు.
‘‘మార్చి 8న ఈ పథకాలను ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. వడ్డీ లేని రుణాలపై ప్రభుత్వం అందంగా అబద్ధాలు చెబుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను ఎగ్గొట్టింది. వడ్డీ లేని రుణాల పరిమితిని రూ 20 లక్షలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వడ్డీ రాయితీ బకాయిలు విడుదలతో పాటు రుణ పరిమితిని 20 లక్షలకు పెంచాలి. కొత్తగా ఎవరికీ పెన్షన్ ఇవ్వడం లేదు. తక్షణమే పెన్షన్ మొత్తాన్ని రూ 4 వేలకు పెంచాలి. అభయ హస్తం నిధులను తక్షణమే విడుదల చేయాలి. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. నేరాలు 20 శాతం పెరిగాయని డీజీపీ వెల్లడించారు. ఆడబిడ్డలకు రక్షణపై ప్రభుత్వం సమీక్షించి ప్రకటన చేయాలి’’ అని కోరారు.
‘‘కేసీఆర్ కిట్ పంపిణీని నిలిపివేసి కాంగ్రెస్ పార్టీ మానవత్వాన్ని మంటకలిపింది. మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలను పెంచాలి. మహిళా కార్మికులను ప్రత్యేకంగా గుర్తించి అవసరమైన సదుపాయాలు కల్పించడం లేదు. మహిళా కార్మికులకు సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రకటించాలి. అంగన్ వాడీ కార్మికుల జీతాలను పెంచుతామని హామీ ఇచ్చిన విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం. అంగన్ వాడీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రభుత్వం ఢాంబికాలు పలుకుతోంది. కేసీఆర్ హయాంలోనే ఆ పోస్టులను సృష్టించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడపిల్లలకు ఫీజు రియింబర్స్ మెంట్ చేయడం లేదు. దాంతో తల్లిదండ్రులు వారిని చదువు మానిపిస్తున్నారు’’ అని వివరించారు.