లేఖాస్త్రంతో కేసీఆర్ ను ఇరుకునపెట్టిన కవిత
తండ్రి వ్యవహార శైలిని కూడా తప్పుపట్టిన అంశాలే బాగా హైలైట్ అవుతున్నాయి.;
బీఆర్ఎస్ లో కేసీఆర్ కు పెద్ద కుదుపు ఎదురైంది. అదికూడా ఎవరో నేత పార్టీని విడిచిపెట్టడంతో కుదుపు ఎదురవ్వలేదు. స్వయంగా గారాలపట్టి కల్వకుంట్ల కవిత తండ్రిని ఉద్దేశించి రాసిన లేఖ ఇపుడు బయటపడింది. కేసీఆర్ కు కవిత లేఖ రాసారన్న విషయం కొద్దిరోజులుగా ప్రచారంలో ఉంది. అయితే కేసీఆర్ కు కవిత(Kavitha letter) రాసిన లేఖ బయటకు ఎలాగ పొక్కిందన్నదే అర్ధంకావటంలేదు. పార్టీవర్గాల సమాచారం ప్రకారం కవిత వైపునుండే లేఖ లీకయ్యింది. ఇంతకీ లేఖలో ఏముందంటే చాలా అంశాలపైన కేసీఆర్(KCR) ను కవిత నిలదీసింది. కొన్ని అంశాల్లో అభినందించింది. అయితే తండ్రి వ్యవహార శైలిని కూడా తప్పుపట్టిన అంశాలే బాగా హైలైట్ అవుతున్నాయి.
2001 నుండి పార్టీలో ఉన్న నేతలకు మాట్లాడే అవకాశం ఇవ్వటంలేదన్నది కవితచేసిన ఆరోపణ. ఈమధ్యనే జరిగిన పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగసభలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. పార్టీలోని నేతలకు ఎందుకు అందుబాటులో ఉండటంలేదని ప్రశ్నించారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడలేదని అడిగారు. ఎస్సీవర్గీకరణపై ఎందుకు మాట్లాడలేదని అడిగారు. పాత నేతలకే రాబోయే ఎన్నికల్లో బీఫారాలు ఇస్తారా అని నిలదీశారు. బహిరంగసభ వేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన ధూంధారం కళాకారులు జనాలను ఆకట్టుకోలేకపోయారని మండిపోయారు. బీజేపీ(BJP) కారణంగా తాను బాధలుపడినా సభలో కేవలం రెండు నిముషాలు మాత్రమే మాట్లాడి ఎందుకు ఆపేశారని అడిగారు. పార్టీలో నేతలందరికీ ఎందుకు అందుబాటులో ఉండటంలేదో చెప్పాలని నిలదీశారు.
ఇలాంటి మరికొన్ని ప్రశ్నలతో కవిత రాసిన లేఖ ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది. మైడియర్ డాడి అంటు మొదలుపెట్టిన లేఖలో కేసీఆర్ సమాధానాలు చెప్పటానికి ఇష్టపడని చాలా ప్రశ్నలను అడిగారు. కవిత అడిగిన చాలా ప్రశ్నలు కేసీఆర్ కు బాణాల్లాగ గుచ్చుకుంటాయనటంలో సందేహంలేదు. కొంతకాలంగా పార్టీతో ముఖ్యంగా తండ్రి కేసీఆర్, అన్న కేటీఆర్(KTR) తో కవిత అంటీముట్టనట్లుగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. కేసీఆర్ ను కవిత ప్రశ్నిస్తు లేఖ రాశారన్న విషయం బాగా ప్రచారంలో ఉంది. ఇదే విషయమై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఈమధ్యనే మీడియాతో మాట్లాడుతు తొందరలోనే కవిత రాసిన లేఖ బయటపడుతుందని చెప్పటం గమనార్హం. ఆయన చెప్పినట్లుగానే ఇపుడు కవిత రాసిన లేఖ బయటపడింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే తండ్రితో నేరుగా మాట్లాడే అవకాశం ఉన్న కవిత ఆపనిచేయకుండా డైరెక్టుగా లేఖ రాయటం ఏమిటో అర్ధంకావటంలేదు. పార్టీలో నేతలకంటే కేసీఆర్ ను కలిసి మాట్లాడే అవకాశంలేదు. మరి కవితకు ఏమైంది ? జరుగుతున్నది చూస్తుంటే మిగిలిన నేతల్లాగే కవితకు కూడా అనుకున్నపుడు కేసీఆర్ ను కలిసే అవకాశం దొరకటంలేదని అర్ధమైపోతోంది. పార్టీలో తనకు ప్రాముఖ్యత తగ్గిపోతుండటం, అన్న కేటీఆర్ సర్వంసహా అయి వ్యవహారాలు నడుపుతుండటం కవితకు ఏమాత్రం నచ్చినట్లు లేదు. అందుకనే అనేక విషయాలను ప్రస్తావిస్తు కేసీఆర్ కు కవిత లేఖ రాశారు. మరీ లేఖాస్త్రంపై కేసీఆర్, కేటీఆర్, హరీష్ తో పాటు సీనియర్ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.