కేసీఆర్ కు ఇదే లాస్ట్ ఛాన్స్
హైకోర్టు తీర్పును చాలెంజ్ చేస్తు కేసీయార్ సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు.
ఇదే కేసీయార్కు చివరి అవకాశం. హైకోర్టు తీర్పును చాలెంజ్ చేస్తు కేసీయార్ సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేశారు. విద్యుత్ రంగంలో కేసీయార్ భారీఎత్తున అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించిన విషయం తెలిసిందే. కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాలని కేసీయార్ కు రెండుసార్లు నోటీసులు జారీచేసింది. అయితే కేసీయార్ హాజరుకాలేదు. విచారణకు హాజరుకాకపోవటమే కాకుండా జస్టిస్ వ్యక్తిగతంపై తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. జస్టిస్ వ్యక్తిత్వాన్ని కించపరుస్తు పెద్ద లేఖే రాశారు. కమిషన్ కు ఛైర్మన్ గా ఉండే అర్హత లేదుకాబట్టి విచారణ నుండి తప్పుకోవాలని నరసింహారెడ్డిని డిమాండ్ చేశారు.
మొదటిసారి నోటీసుకు కేసీయార్ స్పందించకపోవటంతో కమిషన్ రెండోసారి నోటీసులు జారీచేసింది. దాంతో వెంటనే కేసీయార్ హైకోర్టులో పిటీషన్ వేశారు. లేఖలోని అంశాలనే తన పిటీషన్లో ప్రస్తావించిన కేసీయార్ నరసింహారెడ్డి కమిషన్ను రద్దుచేయాలని కోరారు. పిటీషన్ను విచారించిన హైకోర్టు కేసీయార్ ఆరోపణలన్నింటినీ కొట్టేసింది. జస్టిస్ నరసింహారెడ్డిపై నిరాధారమైన ఆరోపణలు చేసినట్లు కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ ఏకపక్షంగా విచారణ చేస్తున్నారన్న కేసీయార్ ఆరోపణలకు ఆధారాలను చూపించలేకపోయారని చెప్పి కేసును కొట్టేసింది. దాంతో కమిషన్ నోటీసులపై ఏమిచేయాలనే విషయంలో ఇన్నిరోజులు కేసీయార్ ఆలోచించారు. చివరకు ఆఖరు ఛాన్సుగా సుప్రింకోర్టులో స్పెషల్ లీవ్ పిటీషన్ను దాఖలు చేశారు.
నరసింహారెడ్డి కమిషన్ను కొట్టేయాలన్న వాదననే స్పెషల్ లీవ్ పిటీసన్ లో కూడా కేసీయార్ వినిపించారు. ఈ పిటీషన్ పై సోమవారం సుప్రింకోర్టు విచారణ జరపబోతోంది. పిటీషన్ను సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ బెంచ్ విచారణ చేయబోతోంది. హైకోర్టు కొట్టేసిన పిటీషన్ పై సుప్రింకోర్టు ఏమి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి పెరిగిపోతోంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు, విచారణ తీరు, జస్టిస్ వ్యక్తిత్వంపై కేసీయార్ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయారని హైకోర్టు అభిప్రాయపడింది. మరి సుప్రింకోర్టులో దాఖలు చేసిన పిటీషన్లో కేసీయార్ తన ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి ఆధారాలను చూపించారో తెలీదు. నిజానికి కమిషన్ పై ఆరోపణలు చేసిన కేసీయార్ అందుకు ఏమైనా ఆధారాలుంటే హైకోర్టులోనే చూపించేవారు. అలా చూపించలేదు కాబట్టే కేసును హైకోర్టు కొట్టేసింది. మరి అదే పిటీషన్ను సుప్రింకోర్టులో వేస్తే ఈసారి ఏమవుతుంది ?
ఛత్తీస్ ఘడ్ నుండి విద్యుత్ కొనుగోలుతో పాటు యాదాద్రి, భద్రాద్రిలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటులో కేసీయార్ హయాంలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనేది ప్రధాన ఆరోపణ. కేసీయార్ హయాంలో అవినీతి జరిగిందనేందుకు విద్యుత్ రంగ నిపుణులు, ఉన్నతాధికారులు. రిటైర్డ్ ఉన్నతాధికారులు ఇప్పటికే అనేక ఆధారాలను కమిషన్ కు అందించారు. కేసీయార్ హయాంలో అవినీతి జరిగిన విధానం, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలకు కూడా తగిన ఆధారాలను విచారణకు హాజరైన వాళ్ళంతా డాక్యుమెంట్లను అందించారు. కేసీయార్ తీసుకున్న నిర్ణయాల వల్ల తెలంగాణా ప్రభుత్వంపై రు. 6 వేల కోట్ల భారం ఏ విధంగా పడిందనే విషయాన్ని చాలామంది కమిషన్ కు వివరించారు.
అందరినుండి వివరాలు సేకరించిన తర్వాతే కమిషన్ విచారణకు హాజరుకావాలని కేసీయార్కు నోటీసు జారీచేసింది. కమిషన్ ముందు విచారణకు హాజరై తన వాదనను వినిపించాల్సిన కేసీయార్ అందుకు భిన్నంగా వ్యవహరించారు. కమిషన్ ఏమి నిర్ణయం తీసుకుంటుంన్న విషయంతో సంబంధంలేకుండా తన వాదనను వినిపించుంటే బాగుండేది. అయితే తనకు కమిషన్ నోటీసు జారీచేయటం, తాను విచారణకు హాజరవ్వటాన్ని కేసీయార్ అవమానంగా భావించినట్లున్నారు. అందుకనే బుర్రకు తోచినట్లుగా కమిషన్ తో పాటు ఛైర్మన్ పైన ఆరోపణలు చేశారు. కమిషన్ రెండోసారి జారీచేసిన నోటీసును కూడా కేసీయార్ లెక్కచేయలేదు.
కమిషన్ అధికారం ఏమిటి ?
కేసీయార్ ను విచారణకు పిలిపించుకునే అన్నీ అధికారాలు కమిషన్ కు ఉన్నాయి. ఒక కేసు విచారణలో మామూలు కోర్టుకు ఎలాంటి అధికారాలు ఉంటాయో కమిషన్ కు కూడా అలాంటి అధికారాలే ఉంటాయని రిటైర్డ్ జస్టిస్ బీ చంద్రకుమార్ తెలంగాణా ఫెడరల్ తో చెప్పారు. కేసీయార్ను అరెస్టు చేసైనా సరే విచారణ చేసేంత అధికారాలు కమిషన్ కు ఉన్నాయని చంద్రకుమర్ చెప్పారు. బెయిలబుల్ లేదా నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంటు కూడా జారీ చేయచ్చని తెలిపారు. మరి కమిషన్ ఏమి చేయబోతోంది ? సుప్రింకోర్టు ఏమి తీర్పుచెప్పబోతోందనేది చాలా ఆసక్తిగా మారింది. సుప్రింకోర్టు కూడా కేసీయార్ పిటీషన్ను కొట్టేస్తే అప్పుడు కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.