కేసీయార్ కు ఇదే మైనస్ అవుతుందా ?

జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పాలని కేసీయార్ బలంగా కోరుకుంటున్నారు. అందుకు ఎంతవరకు అవకాశం ఉందనే విషయంలో మామూలు జనాలకు క్లారిటి కనబడటంలేదు.

Update: 2024-05-14 06:55 GMT
KCR

జాతీయరాజకీయాల్లో చక్రంతిప్పాలని కేసీయార్ బలంగా కోరుకుంటున్నారు. అందుకు ఎంతవరకు అవకాశం ఉందనే విషయంలో మామూలు జనాలకు క్లారిటి కనబడటంలేదు. అయితే ఒక విషయంమాత్రం కేసీయార్ కు మైనస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. అదేమిటంటే ప్రధానమంత్రి రేసులో తాను కూడా ఉన్నట్లు కేసీయారే స్వయంగా ప్రకటించుకోవటం. ఎన్నికల తర్వాత జాతీయరాజకీయాల్లో ప్రాంతీయపార్టీలే శాసిస్తాయని, అవకాశం ఉంటే తాను కూడా ప్రధాని రేసులో ఉంటానని స్వయంగా కేసీయారే ప్రకటించారు. ఈ ప్రకటనే పెద్ద మైనస్ అయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఎలాగంటే అవకాశం వస్తే ప్రధాని కుర్చీని వదులుకునే వాళ్ళెవరైనా ఉంటారా ? ప్రధానమంత్రి పీఠంపైన మహారాష్ట్రలో శరద్ పవార్, పశ్చిమబెంగాల్లో మమతాబెనర్జీ, బీహార్ నుండి లాలూప్రసాద్ యాదవ్ ఎప్పటినుండో ఆశలుపడుతున్నారు. ఇంకెంతమంది అవకాశం కోసం గుంభనంగా ఎదురు చూస్తున్నారో తెలీదు.

బీఆర్ఎస్ కు ఎన్ని పార్లమెంటు సీట్లు వచ్చినా అంతకుమించి సీట్లు సాధించే అవకాశాలున్న పై నేతలు ప్రధాని కుర్చీని కేసీయార్ కు అప్పగించేస్తారా ? తనకు ప్రధాని అవ్వాలన్న కోరికుంటే ఆ విషయాన్ని తనకు మద్దతుగా నిలిచే మరోబలమైన పార్టీ అధినేతతో ప్రతిపాదించేట్లుగా కేసీయార్ ప్లాన్ చేసుంటే బాగుండేది. తనకు తాను ప్రధానమంత్రి అవ్వాలనే కోరికను బయటపెట్టుకునే బదులు ఇంకెవరైనా ప్రధానమంత్రిగా కేసీయార్ ను ప్రతిపాదించేట్లుగా ప్లాన్ చేస్తే వెయిట్ పెరుగుతుందేమో. ప్రధాని రేసులో తాను ఉన్నాని ప్రకటించటమే మైనస్ అంటే జాతీయస్ధాయిలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషిస్తాయని చెప్పటం అమోమయంగా ఉంది.

ఎన్నికలు అయ్యాక జాతీయస్ధాయిలో ప్రాంతీయపార్టీలే కీలకపాత్ర పోషిస్తాయని పదేపదే చెబుతున్నారు. కేసీయార్ చెబుతున్న జాతీయస్ధాయిలో ప్రాంతీయపార్టీల కీలకపాత్ర అన్నదే ఎవరికీ అర్ధంకావటంలేదు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ అంటే దేశంలోని జనాల్లో బాగా వ్యతిరేకత ఉందని కేసీయార్ అభిప్రాయపడ్డారు. జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం కూడా చెప్పేశారు. బీజేపీ నిబంధనల ప్రకారం 75 ఏళ్ళు దాటినవారు ఏ పదవినీ చేపట్టరు కాబట్టి నరేంద్రమోడి కూడా పదవిలోనుండి తప్పుకోవాల్సిందే అని డిమాండ్ చేశారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసీయార్ మాటలను ఎంతమంది నమ్ముతారో అనుమానమే. జాతీయస్ధాయిలో ప్రాంతీయపార్టీలు చక్రంతిప్పే రోజులు ఇంకా రాలేదు. తృణమూల్ కాంగ్రెస్, వైసీపీకి ఎక్కువమంది ఎంపీలున్నా జాతీయ రాజకీయాలను శాసించేంత స్ధాయిలో ఆ పార్టీలు లేవన్న విషయం అందరికీ తెలిసిందే. జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్ అండలేనిదే ఏ ప్రాంతీయపార్టీ కూడా సొంతంగా రాజకీయంచేసి చక్రంతిప్పేంత సీన్ ఉండదన్నది వాస్తవం. చెప్పుకోవటానికి ఎస్పీ, బీఎస్పీ, ఆప్ కూడా జాతీయపార్టీలే. కాని దేశవ్యాప్తంగా పోటీచేసి పెద్దసంఖ్యలో ఎంపీలను గెలుచుకుంటే కాని బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కాలేవని అందరికీ తెలిసిందే. పై పార్టీలు ఒంటరిగానో లేకపోతే పొత్తులోనో దేశవ్యాప్తంగా పోటీచేసి ఎంపీలను గెలుచుకోవటం కష్టమే. ఒకవేళ పై పార్టీలు పెద్ద సంఖ్యలో ఎక్కువమంది ఎంపీలను గెలుచుకున్నా జాతీయపార్టీలు బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం అవుతాయే కాని ప్రాంతీయపార్టీల లెక్కలోకి రావు. మరి కేసీయార్ ఏ ఉద్దేశ్యంతో జాతీయస్ధాయిలో ప్రాంతీయపార్టీలే చక్రంతిప్పుతాయని పదేపదే చెబుతున్నారో అర్ధంకావటంలేదు.

జాతీయస్ధాయిలో చక్రంతిప్పే ప్రాంతీయపార్టీలు ఏవని అడిగితే సమాధానం చెప్పటంలేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇండియా కూటమిలో చేరుతారా అని అడిగితే సమాధానం చెప్పటానికి ఇష్టపడటంలేదు. పోని కేసీయార్ తో చేతులు కలిపే ప్రాంతీయపార్టీలు ఏమున్నాయంటే సమాధానం దొరకటంలేదు. ఏదేమైనా కేసీయార్ కోరిక తీరుతుందా లేదా తెలియాలంటే జూన్ 4వ తేదీవరకు వెయిట్ చేయాల్సిందే.

Tags:    

Similar News