బాంబు పేల్చిన దానం... కేటీఆర్ విషయాలు బయటకి!
బీఆర్ఎస్ ఎల్పీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ ఎల్పీ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ లో విలీనం కాబోతుందంటూ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో మరో పదిమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని, రేపు ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరబోతున్నారని బాంబు పేల్చారు. బీఆర్ఎస్ లో ఉండటానికి ఎవరు ఇష్టపడట్లేదని, ఆత్మగౌరవం ఉన్నవారెవరూ ఆ పార్టీలో ఉండరని అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ విలువ ఇవ్వలేదని చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ లో షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న దానం నాగేందర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీఆర్ఎస్ పార్టీలో కేవలం ముగ్గురు లేదా నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగులుతారని అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా మాత్రమే ఉంటారని.. మిగతా ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. మిగిలిన ఒకరిద్దరు కూడా ఏ పార్టీలో జాయిన్ అవ్వాలో అనే డైలమాలో ఉంటారన్నారు.
కేసీఆర్ కనీసం ఎమ్మెల్యేలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండరని, ఎప్పుడూ ఫాంహౌస్ లోనే ఆయన కోటరీతో ఉండేవారని దానం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ అపాయింట్మెంట్ ఇచ్చినా.. గంటల తరబడి కేసీఆర్ కోసం బయట వెయిట్ చేయాలని చెప్పారు. మనసు, ఆత్మగౌరవం ఉన్నవారు ఆ పార్టీలో ఉండటానికి ఇష్టపడట్లేదని అన్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, అతని అనుచరులు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని, ఆ వివరాలు అన్నీ బయటపెడతానని వెల్లడించారాయన. సత్యం రాజేష్ కి వేలకోట్లు విలువ చేసే భూములెలా కట్టబెట్టారో మొత్తం ఒక్కొక్కటిగా బయటపెడతామని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకే ఆరు నెలల్లో అధికారంలోకి వస్తామంటూ కేటీఆర్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని దానం ఎద్దేవా చేశారు.
జైల్లో ఉన్న కవితను బయటకు తీసుకురాకుండా రాజకీయం చేస్తున్నారని, కావాలనే కవితను జైల్లోనే ఉంచుతున్నారంటూ కేసీఆర్, కేటీఆర్ ని విమర్శించారు. అతి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ మూతపడుతుందని, 15 రోజుల్లో అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనం కావడం ఖాయమని దానం నాగేందర్ జోస్యం చెప్పారు.