రెండున్నరేళ్ల తర్వాత సీఎం మార్పు?

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

Update: 2024-08-30 13:28 GMT

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. భవిష్యత్తులో ఉత్తమ్ కుమార్ రెడ్డి తప్పనిసరిగా సీఎం అవుతారని అన్నారు. నా నాలుకపై మచ్చలు ఉన్నాయని, నేను చెప్పింది తప్పక నిజమవుతుందని జోస్యం చెప్పారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి.

శుక్రవారం భువనగిరి పార్లమెంటు పరిధిలో నీటిపారుదల పనులపై భువనగిరిలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బీర్ల ఐలయ్య, కంభం అనిల్ కుమార్, వేముల వీరేశం, మందుల సామేలు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఉత్తమ్ కుమార్ రెడ్డిని 'ముఖ్యమంత్రి గారూ' అంటూ సంభోదించారు. అక్కడితో ఆగలేదాయన. "సీఎం పదవి గతంలో తప్పిపోయింది... కానీ, భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి అవుతారు. నేను చెప్పానంటే జరిగి తీరుతుంది. ఎందుకంటే నా నాలుక పైన మచ్చలు ఉన్నాయి. అందుకే నేను చెప్పేవన్నీ జరుగుతాయి. ఈ విషయాన్ని మా అమ్మ నాకు చెప్పింది" అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీశాయి.

సీఎం కుర్చీ కుమ్ములాటలు...

కాంగ్రెస్ లో మొదటి నుంచీ సీఎం కుర్చీ విషయంలో కుమ్ములాటలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత ఎవరికి సీఎం పదవి ఇవ్వాలనే అంశంపై పార్టీ అధిష్టానం కూడా అనేక చర్చలు, బుజ్జగింపుల పర్వాలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి పేరును ప్రకటించింది. అసలు రేవంత్ కి పీసీసీ చీఫ్ పదవి ఇవ్వడమే ఇష్టంలేని సీనియర్లు సీఎం పదవి ఇవ్వడంపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటర్నల్ వార్ కూడా నడిచిందని టాక్. మొత్తానికి అందరూ కాంప్రమైజ్ అయ్యి రేవంత్ రెడ్డిని సీఎంగా అంగీకరించారు. లోపల ఇష్టం లేకపోయినప్పటికీ వారికి యాక్సెప్ట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ కూడా లేదు.

రెండున్నరేళ్లలో సీఎం మార్పు?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తాజా వ్యాఖ్యలతో మరోసారి కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ వ్యవహారం చర్చలకు దారి తీసింది. రేవంత్ ని టీపీసీసీ చీఫ్ పదవి కానీ, సీఎం సీటు ఇవ్వడం కానీ తీవ్రంగా వ్యతిరేకంచిన వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఉన్నారనేది బహిరంగసత్యమే. అనేకసార్లు రేవంత్ పై వాళ్ళు చేసిన కామెంట్స్ ఈ విషయానికి బలాన్ని చేకూరుస్తాయి. ఇప్పుడు రేవంత్ కి సీఎం పదవి ఇవ్వడం ఇష్టం లేదు అనే విషయాన్ని భువనగిరి వేదికగా బయటకి వెళ్ళగక్కారేమో, లేదా గతంలో బాగా ప్రచారం అయినట్టు రెండున్నరేళ్ల తర్వాత మరొకరిని సీఎం చేసే అవకాశాలున్నాయా అనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. 


Tags:    

Similar News