కొడితే కుంభస్థలాన్నే కొడతా.. పాతబస్తీలో పకడ్బందీగా మాధవీ లత అడుగులు!!
MIM కంచుకోట, అలాగే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌కి పోటీగా హైదరాబాద్ లోక్‌సభ టికెట్‌ను బీజేపీ కొంపెల్ల మాధవీ లతకు ఇచ్చింది. దీంతో అందరి దృష్టి ఆమెపైకి వెళ్ళింది.
By : The Federal
Update: 2024-03-03 09:27 GMT
వనజ మోర్ల
పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోయే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం ఢిల్లీ కార్యాలయంలో ప్రకటించారు. ఈ జాబితాలో తెలంగాణ నుండి తొమ్మిది మందికి చోటు దక్కింది. ఈ తొమ్మిది మందిలో డా.కొంపెల్ల మాధవీ లత ఒకరు. అయితే, ఈమె పేరు లిస్టులో కనిపించగానే అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. పార్టీలో సభ్యత్వం కూడా లేని ఈమెకి బీజేపీ నుండి ఎంపీ టికెట్ ఇవ్వడం.. అది కూడా MIM కంచుకోట, అలాగే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ కి పోటీగా హైదరాబాద్ టికెట్ ఇవ్వడంతో అందరి దృష్టి ఆమెపైకి వెళ్ళింది.
ఇంతకీ ఎవరీ మాధవీ లత..?
మాధవీ లత.. చూడగానే నుదుటిపై, పాపిటిలో పెద్ద కుంకుమ బొట్టుతో నిండుగా కనిపిస్తారు. పాతకాలపు సినిమాలలో స్త్రీలు కనిపించినట్లు మడికట్టుతో ఉంటారు. బయటకి కూడా పెద్ద బొట్టు, మెడలో అరంగుళం లావున్న పుస్తెల తాడు, నిండుగా నల్లపూసల గొలుసు, శరీరం మొత్తం కప్పేసేలా మడికట్టు, కాళ్ళకి కడియాలు, పాదాలకి ఒత్తుగా పసుపు రాసుకుని వెళ్లిపోతుంటారు. ఇంట్లో ఉన్నా, గుడికి వెళ్ళినా, చిన్న ఇంటర్వ్యూ ఇచ్చినా, పెద్ద సెమినార్ లో పాల్గొన్నా ఆమె ఇదే వేషధారణలో కనిపిస్తారు. నిజానికి ఆమె ఆల్ ఆఫ్ సడన్ సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడానికి కూడా ఇదొక కారణం.
ఇలాంటి డ్రెస్సింగ్ లో బయటకి వెళ్తే అందరూ వింతగా చూస్తారేమో అని మీకు ఎప్పుడూ అనిపించదా? అలాంటి సందర్భం ఎప్పుడైనా ఎదురైందా అని ఒక యూట్యూబ్ ఛానల్ యాంకర్ ప్రశ్నించగా.. ఆమె ఇలా సమాధానం చెప్పారు. "ఎవరమ్మా నన్ను చూసి నవ్వుకునేది. నేను ఆ ఛాన్స్ ఎవ్వరికీ ఎవ్వను. ఐ క్యారీ ఇట్ విత్ డిగ్నిటీ అండ్ కాన్ఫిడెన్స్. ఈ అలంకరణలో హుందాతనం ఉంది. నాకు చాలా ఇష్టం ఇలా అమ్మవారిలా నన్ను నేను అలంకరించుకోవడం" అని చెప్పారు. అంతేకాదు, భారత స్త్రీలు ఎప్పుడైతే సాంప్రదాయ దుస్తులను ధరించడానికి ఇష్టపడతారో సమాజంలో అనేక అరాచకాలు తగ్గుతాయని, పురుషులు స్త్రీలని గౌరవప్రదంగా చూడటం మొదలుపెడతారు అనేది ఆమె వాదన.
ఇక మాధవీ లత వ్యక్తిగత విషయానికి వస్తే.. ఆమె హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన సంతోష్ నగర్ లో పేద కుటుంబంలో జన్మించారు. కోటి ఉమెన్స్ కాలేజీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు. కోవెంట్రీ యూనివర్సిటీ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ లో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. హైదరాబాద్ లోని ప్రముఖ విరించి హాస్పిటల్స్ చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె భరతనాట్య కళాకారిణిగా, వ్యాపారవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతా మా ఫౌండేషన్ స్థాపించి పేదలకు, ఓల్డ్ సిటీ పరిధిలోని పేద ముస్లిం మహిళలకు, పిల్లలకు సేవలు అందిస్తున్నారు. వీరి హాస్పిటల్స్ ద్వారా ముస్లిం కుటుంబాలకు చెందిన నిరుపేద గర్భిణీలకు నార్మల్ డెలివరీలకు అయ్యే ఖర్చులను భరిస్తున్నారు.
ఇక మాధవీ లత భర్త విశ్వనాథ్ చెన్నై ఐఐటియన్. పలు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించి మంచి వ్యాపారవేత్తగా పేరు సంపాదించుకున్నారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఈ ముగ్గురి పిల్లల్ని ఆమె ఇంట్లోనే 12వ తరగతి వరకు చదివించారు. మొదటి ఇద్దరు పిల్లలు ఐఐటీ ర్యాంక్స్ కూడా సాధించారు. ఈ విషయం ఆమెని మరింత పాపులర్ అయ్యేలా చేసింది. తన భర్త పిల్లల్ని నొప్పించకుండా ఒప్పించుకుని పెంచమని చెప్పారని, అందుకే పిల్లలు చిన్నప్పుడు స్కూల్ కి వెళ్ళడానికి మారాం చేస్తుంటే తట్టుకోలేక ఇంట్లోనే పెట్టుకుని చదివించుకున్ననాని ఆమె చెబుతారు. స్త్రీ అపరశక్తి అని, ఆమె తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కష్టమేమీ కాదని.. అందుకే నేను నా పిల్లల్ని ఇంట్లోనే పాఠాలు చెప్పి ఉన్నతంగా తీర్చి దిద్దగలిగానని మాధవీ లత అంటుంటారు. అలాగే పాతబస్తీవైపు తొంగి చూడటానికి కూడా మగవారు భయడుతుంటే.. నేను వారి మధ్యకే వెళ్లి, ఎనిమిదేళ్లుగా అక్కడ ఉంటున్న పేద ప్రజలకు సేవ చేస్తున్నానని చెబుతారు.
కొడితే కుంభస్థలాన్నే కొడతాను..
మాధవీ లత లోపాముద్ర చారిటబుల్ ట్రస్ట్, లతా మా ఫౌండేషన్ ద్వారా పాతబస్తీలో సేవాకార్యక్రమాలు చేపడుతున్నారు. ఓల్డ్ సిటీలోని పేదలకు గత ఎనిమిదేళ్లుగా ఆమె సేవలు అందిస్తున్నాను అని చెబుతారు. అయితే ఈ విషయాలన్నీ మునుపెన్నడూ బయటకి రాలేదు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రమే బయటకి వచ్చాయి. దీనికి కారణం ఆమె వరుసగా యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వడం. అయితే మాధవీ ఇంటర్వ్యూలు మొదలైన కొత్తలో హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తున్న చాలామందిలో ఈమెని కూడా ఒక్కరిగా చూశారు అంతా.
కానీ ఆమె పాతబస్తీ పరిస్థితుల గురించి, అక్కడి పేద ప్రజల ఇబ్బందుల గురించి, పాతబస్తీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్లిం పాలకుల గురించి విమర్శలు చేయడం ప్రారంభించడంతో చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. మాధవీ లత హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయాలి అనుకుంటున్నారేమో, అందుకే పాతబస్తీ వేదికగానే ఆమె కార్యకలాపాలు ఉన్నాయేమో అని. ఇక ఇదే విషయాన్ని సూటిగా ఆమె ముందుంచినప్పుడు.. అదే దైవ నిర్ణయం అయితే తప్పకుండా పోటీ చేస్తాను అంటూ పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అప్ అయ్యారు.
పాతబస్తీనే ఎందుకు అనే ప్రశ్నకి.. "కొడితే కుంభస్థలాన్నే కొట్టాలి" అంటూ ధీటుగా జవాబిచ్చారు. అసదుద్దీన్ సామ్రాజ్యాన్ని కూలగొట్టి అయోధ్యకి పాతబస్తీని పాతబస్తీని గిఫ్ట్ గా ఇస్తా అంటూ శపథం కూడా చేశారు. దీనికోసం వ్యాపారాల నుండి తప్పుకున్ననాని, గత ఏడాది నుండి నిరవధికంగా పాతబస్తీ ప్రజల మధ్యనే ఉంటున్నానని తెలిపారు. "ప్రపంచానికి పనికొచ్చే పనులు చేయడానికి బయటకి వచ్చాను. నాది కాని ధర్మంలో పనిచేస్తే నాకు పుట్టగతులు ఉండవు. అందుకే మోదీ ఆధ్వర్యంలో బీజేపీలో పని చేయాలని నిర్ణయించుకున్నాను.
దివంగత నేత ఆలే నరేంద్ర మరణం తర్వాత అసదుద్దీన్ కి ఎదురు నిలబడి ఆంజనేయస్వామిలా గుండె చీల్చి బస్తీ మే సవాల్ అనేవాళ్ళు కనిపించలేదట. అలాంటిది ఏం లేదని, అక్కడ పుట్టిన మీ ఆడబిడ్డని నేను ఉన్నాను. రాక్షస సంహారానికి పురుషుడు మాత్రమే కానవసరం లేదు, స్త్రీ కూడా ధీటురాలు అని చెప్పడానికి నేను నిలబడతాను. అసదుద్దీన్ ని ఓడించి ఆ అయోధ్య రామచంద్రుడికి భాగ్యనగరాన్ని కానుకగా ఇస్తానని కంకణం కట్టుకున్నాను అని చాలా ధీమాగా చెబుతారు మాధవీ లత.
పకడ్బందీగా పాత బస్తీలో అల్లుకున్న 'లత'..?
ఉద్ధండుల వలనే కాలేదు పాతబస్తీలో ఓవైసిని ఎదిరించి నిలబడడం మరి ఓ మహిళకు ఎలా సాధ్యం కావచ్చు? ఈ సందేహం అందరిలోనూ ఉంది. అయితే మాధవీ లత మాత్రం మొదటి నుండి పకడ్బందీ ప్లాన్ ప్రకారమే అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు కనిపిస్తుంది. ఓల్డ్ సిటీలో హిందూ ఓటర్లతో పాటు ముస్లిం మహిళల ఒట్లపై ఆమె ప్రధానంగా ఫోకస్ చేసినట్టు అర్ధం అవుతోంది. ముస్లిం కుటుంబాలలోని పేద మహిళలకు వైద్య సదుపాయాలు కల్పించడం, వారికి నిత్యావసర సరుకులు అందించడం, వారి ఇళ్లలోని ఆడపిల్లల్ని చదివించడానికి కృషి చేయడం వంటి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆమె చాలా ఇంటర్వ్యూల్లో స్వయంగా వెల్లడించారు. తద్వారా ముస్లిం మహిళలను తనవైపుకు తిప్పుకుని వారి మద్దతుతో ఓటింగ్ శాతం పెంచుకోవడం పై దృష్టి పెట్టారు.
అలాగే అక్కడున్న హిందూ దేవాలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, స్థానికంగా నివసించే హిందువులకు మన వారున్నారు. హిందూ ధర్మం కోసం మనం కూడా పోరాడాలి అనే ఆలోచనను కలిగించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఇంకోవైపు హిందువు అయినప్పటికీ మనల్ని కూడా కలుపుకుపోతున్నారు, మనకి మేలు చేస్తారు అనే భావన ముస్లింలలో కలిగిస్తే ఓల్డ్ సిటీలో గెలవడం అసాధ్యం ఏమి కాదనేది ఆమె వాదన. చూడాలి మరి మాధవీ లత అసదుద్దీన్ సామ్రాజ్యంలో కాషాయ జెండా నిలబెట్టగలరా లేదా అని. కానీ ఆమె ధైర్యం చూస్తే ఈసారి కాకపోయినా వచ్చే ఎన్నికల్లో అయినా విజయం సాధిస్తారేమో. ఎందుకంటే చాలా వరకు మహిళా నేతలకి ఇలాంటి క్లిష్టమైన సీట్స్ కేటాయించడం అరుదు. కానీ మాధవీ లత ఏరి కోరి పాతబస్తీలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఆమె గెలిస్తే.. ఆ గెలుపు ఎంతోమంది మహిళలకు ధైర్యాన్ని కలిగించవచ్చు.