KTR | అసెంబ్లీకి ఆటో రాముడు.. (వీడియో)

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్యా ఘాటైన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కేటీఆర్.. ఆటోవాలాలా అసెంబ్లీకొచ్చారు.

Update: 2024-12-18 06:52 GMT

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అత్యంత రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్యా ఘాటైన వాదనలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ కూడా ఏమాత్రం తీసిపోకుండా సమాధానాలు చెప్తోంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం లగచర్ల రైతులకు మద్దతు తెలుపారు. వారి తరుపున పోరాడాతమాని చెప్పిన బీఆర్ఎస్ నేతలు నల్ల చొక్కాలు, చేతికి బేడీలు వీసుకుని లగచర్ల రైతుల పరిస్థితికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అదే విధంగా బుధవారం రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల సమస్యలపై బీఆర్ఎస్ నేతలు గళమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలోవాలాకు ఉపాది లేకుండా పోయిందని, ఉచిత బస్సు ప్రయాణ పథకం తీసుకొచ్చి ఆటోవాలా కడుపు కొట్టిందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా ఉచితబస్సు ప్రయాణ పథకం ద్వారా నష్టపోతున్న ఆటోవాలాలకు ప్రతి ఏటా రూ.12వేలు ఆర్థిక సహాయం చేస్తానన్న మాటను కూడా కాంగ్రెస్ విస్మరించిందని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. వారికి మద్దతు అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ నేతలు ఖాకీ చొక్కాలు వేసుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఆటోవాలాగా మారారు. ఖాకీ చొక్కా వేసుకుని, ఆటో నడుపుకుంటూ ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆటోవాలా సోదరులకు బీఆర్ఎస్ మద్దతుగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. ఎంత దూరం వెళ్లయినా వారికి న్యాయం జరిగేలా చేస్తామని, వారి కోసం ప్రభుత్వంతో కొట్లాడతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 93 మంది ఆటోడ్రైవర్ల ఆత్మహత్య చేసుకున్నారని, అవన్నీ కూడా ప్రభుత్వ హత్యలేనంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

అరచేతిలో వైకుంఠం చూపారు..: కేటీఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం తమ కడుపుకొడుతుందంటూ రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లకు ఏటా రూ.12వేల ఆర్థిక సహాయం చేస్తామంటూ కాంగ్రెస్ కాలయాపన చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. వారు ప్రశ్నించిన ప్రతిసారి వారికి ఏవేవో కబుర్లు చెప్పి, అరచేతిలో వైకుంఠం చూపి వారి నిరసనలు విరమించుకునేలా చేస్తోందని, కానీ వారికి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది ఏమీ లేదంటూ మండిపడ్డారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 93 మంది ఆటోడ్రవర్లకు కాంగ్రెస్ పొట్టనపెట్టుకుందని, ఆ కుటుంబాలకు ప్రభుత్వమే ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేసే వరకు తమ నిరసన ఆగదని, ఆటో డ్రైవర్లకు అండగా బీఆర్ఎస్ ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు.

 

అవన్నీ ప్రభుత్వ హత్యలే

ఈ ఏడాది కాలంలో ఆటో డ్రైవర్లకు చేసుకున్నవి ఆత్మహత్యలు కావని, అవన్నీ కూడా ప్రభుత్వం తన స్వహస్తాలతో చేసిన హత్యలేనని కేటీఆర్ విమర్శించారు. 2023 ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు అబద్ధపు హామీలను అరచేతిలో వైకుంఠం చూపారని, తీరా అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తమ ఓట్ బ్యాంక్‌గానే చూసింది తప్ప.. వారిని ప్రజలుగా, సాటి పౌరులుగా గుర్తించలేదని, అందుకే వారి పట్ల ఇంతటి నిర్లక్ష దోరణి కనబరుస్తోందని ధ్వజమెత్తారు. వారికి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని, ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఆటో డ్రైవర్లకు ఇస్తామని చెప్పిన రూ.12 వేల ఆర్థిక సహాయాన్ని కూడా తక్షణమే అందించాలని, ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డును కూడా వెంటనే ఏర్పాటు చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఆటోవాలాల సమస్య ఇది..

సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తెచ్చిన ఫ్రీ బస్సు ప్రయాణం పథకం వల్ల తాము ఎంతో నష్టపోతున్నామని ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ చెప్తున్నారు. తమకు ప్రభుత్వమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో దాదాపు 2 లక్షల మంది ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. వీరంతా కూడా మహాలక్ష్మీ పథకం అమలు కాకముందు సగటున రూ.1000 సంపాదించేవారు. ఇప్పుడు వారికి రూ.500 కూడా రావడం లేదు. ఇందుకు ప్రభుత్వం తెచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకమే కారణమని వాళ్లు పేర్కొంటున్నారు. దీంతో తమకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఆ అంశం ఊసే ఎత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమకిచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి బీఆర్ఎస్ తమ పూర్తి మద్దతు తెలుపుతోంది.

Tags:    

Similar News