రాహుల్ గాంధీకి కేటీఆర్ కంగ్రాట్స్
ఢిల్లీలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటంతో ఢిల్లీ పీఠం ఎవరి సొంతం కానుందనేది అత్యంత ఉత్కంఠగా మారింది.;
ఢిల్లీలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరుగుతుండటంతో ఢిల్లీ పీఠం ఎవరి సొంతం కానుందనేది అత్యంత ఉత్కంఠగా మారింది. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను చూస్తుంటే మాత్రం ఎగ్జిట్ పోల్స్ జోస్యం అక్షరాలా వాస్తవం అవుతుందనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, ఆప్ ప్రధాన పార్టీలుగా పోటీ పడుతున్నప్పటికీ అసలు పోరు మాత్రం ఆప్, బీజేపీ మధ్యే కొనసాగుతోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కంగ్రాట్స్ చెప్పడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో బీజేపీని గెలిపించడం కోసం రాహుల్ చేసిన కృషి ఫలించిందని కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఢిల్లీ ఎన్నికలు వెలువడుతున్న క్రమంలో కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటం వల్లే రాహుల్ టార్గెట్‌గా కేటీఆర్ సెటైర్లు వేశారన్న వాదన కూడా వినిపిస్తోంది.
ఇప్పటి వరకు వెలువడిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలను చూస్తే బీజేపీ 45 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అదే విధంగా ఆప్ 25 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది. ఇప్పటి వరకు కాంగ్రస్ మాత్రం ఖాతా తెరవలేదు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌పోల్స్ ఫెయిల్ అయ్యాయి. అదే విధంగా సక్సెస్ కూడా అయ్యాయంటూ కాంగ్రెస్‌పై సోషల్ మీడియాలో వ్యంగ్యాస్త్రాలు వెల్లువ కురుస్తోంది. బీజేపీ 45-50 స్థానాలు వస్తాయన్న విషయంలో ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయ్యాయని, సదరు సంస్థలు ఊహించిన రీతిలో ఆమ్ ఆద్మీ పార్టీ చతికిల పడలేదని, హస్తినలో తమ బలాన్ని కనబరుచుకుంటుందని అంటున్నారు విశ్లేషకులు. కాకపోతే కాంగ్రెస్ విషయంలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఏకగ్రీవంగా సక్సెస్ అయ్యాయని, వారు చెప్పినట్లే సున్నా సీట్లతో కాంగ్రెస్ దూసుకుపోతోందని సెటైర్లు పేలుతున్నాయి. కాగా కాంగ్రెస్ మద్దతు దారులు మాత్రం ఎన్నికలకు ప్రథమ దశలో అంచనాలు వేయకూడదని, ఏ క్షణా అయినా మారొచ్చని సర్దిచెప్పుకుంటున్నారు.
బీజేపీ విజయం నాలుగేళ్ల ప్లాన్
ఈ నేపథ్యంలోనే బీజేపీ తన విజయ వ్యూహాలను గత ఎన్నికలు ముగిసినప్పటి నుంచే ప్రారంభించిందన్న వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలవాలన్న ఉద్దేశంతోనే ఢిల్లీలో ప్రభుత్వమైన ఆప్ కీలక నేతలపై అనేక కేసులు పెట్టించడం, ఆప్ పార్టీని ఒత్తిడికి గురిచేసిందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. అదే విధంగా రాష్ట్రానికి నిధులు కూడా కేటాయించకుండా రాష్ట్రంలో ప్రథకాల అమలును అడ్డుకుని ఆప్‌పై వ్యతిరేకత వచ్చేలా చేసిందని, మరోవైపు ఎల్‌జీ నుంచి కూడా ఆప్‌పై ఒత్తిడి పెంచిందని, ఇలా మరెన్నో వ్యూహాలు పన్ని వాటిని నాలుగేళ్లుగా అమలు చేస్తూ వచ్చి ఇప్పుడు ఆప్ నుంచి ఢిల్లీ పీఠాన్ని లాక్కునేందుకు సిద్ధమవుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.