‘రేవంత్.. మీరు నడుపుతుంది సర్కారా..? సర్కస్సా..?’
యాకుత్‌పురా మ్యాన్‌హోల్ ఘటనకు బాధ్యులెవరో చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.;
యాకుత్‌పురాలో తెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో చిన్నారి పడిన ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమంటూ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. దీనికి బాధ్యులు ఎవరు? అన్న ప్రశ్న తీవ్ర దుమారం రేపుతోంది. ఈ ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణమా? అధికార యంత్రాంగం అలసత్యం కారణమా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై రాజకీయ దుమారం కూడా రేగుతోంది. తాజాగా దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వ శాఖలు చేతులు దులిపేసుకుంటున్నాయని విమర్శించారు. అయితే ఈ అంశంపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. విచారణ చేపట్టామని వెల్లడించారు.
ప్రభుత్వం చేతకాని పాలన వల్లే గురువారం ఓ చిన్నారి .. మ్యాన్ హోల్‌లో పడిందని కేటీఆర్ అన్నారు. అదృష్టవశాత్తూ చిన్నారి ప్రాణాలే దక్కాయని, జరగకూడనిది జరిగి ఉంటే ఎవరు బాధ్యులంటూ మండిపడ్డారు. ఏమైనా అయితే ఎక్స్‌గ్రేషియా ఇచ్చి చేతులు దులుపేసుకోవడం పాలకుల లక్షణం కాదంటూ విమర్శించారు. ఇప్పటికయినా ప్రభుత్వం కళ్లు తెరిచి ఇటువంటి ఘటనలు పునరావృత్తం కాకుండా యుద్ధప్రాతిపదికిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసలు కాంగ్రెస ప్రభుత్వం సర్కార్ నడుపుతుందా? లేద సర్కస్ నడుపుతుందా? అని చురకలంటించారు కేటీఆర్. అయితే ఈ ఘటనపై హైడ్రాకమిషనర్ రంగనాథ్ స్పందించారు. తాము బాధ్యత తీసుకుంటామని తెలిపారు.
నిర్లక్ష్యం వల్లే జరిగింది: కేటీఆర్
‘‘ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం వల్ల నగరంలో నిన్న ఒక చిన్నారి తెరిచి ఉంచిన మ్యాన్‌హోల్‌లో పడిపోయింది. అదృష్టవశాత్తూ పాప ప్రాణాలు దక్కాయి. చేసిన తప్పును దిద్దుకోవాల్సిన మున్సిపల్ శాఖలోని మూడు విభాగాలేమో ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. తప్పు హైడ్రాది అని జీహెచ్ఎంసీ ప్రకటిస్తే తప్పు మాది కాదు జలమండలిది అని హైడ్రా చేతులు దులుపుకుంది. ఆ వెంటనే అసలు మాకేం సంబంధం లేదని జలమండలి చేతులెత్తేసింది! మున్సిపల్ శాఖను కేవలం కాసుల వేటకు వాడుకోవడంలో రేవంత్ బిజీగా ఉంటే, ఆయన శాఖలోని విభాగాలేమో సమన్వయలేమితో నగరవాసులకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాయి’’ అని అన్నారు కేటీఆర్.
విచారణ చేపట్టాం: రంగనాథ్
యాకుత్‌పురా ఘటనపై హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ స్పందించారు. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నామని విచారణ చేపట్టామని వెల్లడించారు. ఈ ఘటనకు హైడ్రా పూర్తి బాధ్యత వహిస్తుందని వెల్లడించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్ ఇన్‌ఛార్జి ఘటనకు బాధ్యుడన్నారు. మ్యాన్‌హోల్ మూత మూసేందుకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకున్నామని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
యాకుత్‌పురా ఘటన ఏంటంటే..
ఓ చిన్నారి స్కూల్‌కు వెళ్తున్న సమయంలో మూతతెరిచి ఉన్న మ్యాన్ హోల్‌లో పడిపోయింది. తల్లి వెనకాలే వస్తుండటంతో వెంటనే ఆమె స్పందించి చిన్నారిని బయటకు తీశారు. దాంతో చిన్నారి ప్రాణాలు దక్కాయి. అయితే వెనకాల వస్తున్న తల్లివైపు తిరిగి ఏదో చెప్పబోతూ చిన్నారి ముందుకు నడిచింది. ఆ సమయంలో ఎదురుగా ఉన్న మ్యాన్ హోల్‌ను గమనించుకోలేదు. దాంతో అందులో పడిపోయింది. కాగా అసలు నడిరోడ్డులో ఉన్న మ్యాన్ హోల్ మూతను తెరిచి వదిలేసింది ఎవరు? అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఒకవైపు జలమండలి, అధికారులు.. మ్యాన్‌హోల్ మూతలను తెరిచి వదిలేయొద్దని ఎంత చెప్తున్నా ఇటువంటి ఘటనలు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. యాకుత్‌పురాలో చోటు చేసుకున్న ఘటన కూడా అక్కడ దగ్గర్లో ఏర్పాటు చేసిన ఓ సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అవడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారుల్లో కదలిక వచ్చిందని స్థానికులు చెప్తున్నారు.