హెచ్ సిఏ స్కాంలో కెటిఆర్, కవిత ప్రమేయం
విచారణ జరిపించాలన్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువారెడ్డి;
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) స్కాంలో మాజీ మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత జోక్యముందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) కార్యదర్శి గురువారెడ్డి ఆరోపించారు. పదేళ్లుగా రాష్ట్రంలోని క్రికెట్ వ్యవస్థను సర్వనాశనం చేశారని, చాలా మందికి క్రికెటర్లకు అవకాశాలు లేకుండా చేశారని విమర్శించారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
‘‘కేటీఆర్, కవితతో పాటు హెచ్‌సీఏ ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సంపత్‌కుమార్‌ను తక్షణమే సిఐడి అదుపులో తీసుకుని విచారించాలని డిమాండ్ చేశారు. వారి తప్పుడు నిర్ణయాల వల్ల గ్రామీణ క్రికెటర్లకు తీరని అన్యాయం జరిగిందని గురువారెడ్డి అన్నారు. సమ్మర్ క్యాంపులకు సైతం క్రికెటర్ల నుంచి హెచ్ సిఏ డబ్బు వసూలు చేసిందని ఆయన విమర్శించారు. మా వద్ద అన్నిఆధారాలున్నాయి. ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందని ఆయన ప్రశ్నించారు. అవకాశాల కోసం తెలంగాణ క్రికెటర్లు పదేళ్ల నుంచి ఎదురుచూసి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో వారిలో ఆశలు చిగురించాయని గురువారెడ్డి అన్నారు. హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై సీఐడీ, ఈడీకి విచారణకు పూర్తిగా సహకరిస్తామని, పూర్తి ఆధారాలను వారికి అందజేస్తామన్నారు. హెచ్‌సీఏ కార్యవర్గాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
హెచ్‌సీఏ ఎన్నికపై ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతుందని దీనికి పుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరముందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని గురువారెడ్డి కోరారు. క్రికెట్‌తో ఎలాంటి సంబంధం లేని జగన్మోహన్‌రావు ఆ పదవిలో కొనసాగుతున్నారు. తక్షణమే హెచ్ సిఏ ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. బిఆర్ఎస్ కు చెందిన క్లబ్బుల్లో సభ్యత్వం తీసుకున్న సభ్యుల వల్లే జగన్ మోహన్ రావు అధ్యక్షుడయ్యారన్నారు. బోగస్ క్లబ్బులపై విచారణ జరపాలన్నారు. జగన్ మోహన్ రావు వెనుక కేటీఆర్, కవిత ఉన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఎలా ఓట్లు వేస్తారు?ఐపీఎస్ అధికారి సజ్జనార్ కూడా ఎన్నికల్లో పాల్గొన్నారు. 156 క్రికెట్ అసోసియేషన్లు ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించడం లేదు. అలాంటి వాటికి ఎన్నికలు ఎలా నిర్వహించారు?వెంటనే ఎన్నికలు రద్దు చేసి క్లబ్బులను ప్రక్షాళన చేయాలి’’ అని గురువారెడ్డి డిమాండ్ చేశారు.