క్వాష్ పిటిషన్ ఉపసంహరించుకున్న కేటీఆర్

ఫార్ములా ఈ-కార్ రేసు కేసు విషయంలో కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో కూడా భారీ ఝలక్ తగిలింది.;

Update: 2025-01-15 07:29 GMT


ఫార్ములా ఈ-కార్ రేసు‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం ఈరోజు విచారించింది. కాగా హైకోర్టు ఇచ్చిన తీర్పులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో సుప్రీంకోర్టులో కేటీఆర్‌కు భారీ షాక్ తగిలింది. ఇక చేసేదేమీ లేక తన పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. విచారణ అనంతరం కేటీఆర్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.


‘‘పార్ములా ఈ-కార్ రేసుపై కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదు. ఈ కేసుకు సంబంధించి ఏమి ఉన్నా హైకోర్టునే ఆశ్రయించాలి’’ అని పేర్కొంటూ జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ ప్రసన్న వరాలే ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా కేటీఆర్‌పై దాఖలు చేసిన కేసు పూర్తిగా కక్షసాధింపు చర్యేనని, ప్రభుత్వం మారిన వెంటనే కేసు పెట్టారని, ఫార్ములా కార్ రేసు అనేది ప్రభుత్వ ప్రజెక్ట్ అని కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాకుండా ఈ కేసులో డబ్బు తీసుకున్న వారిని, హెచ్ఎండీఏను నిందితులుగా చేర్చలేదు అని ఆయన చెప్పారు.


కాగా ఈ కేసుపై దర్యాప్తు జరగాలని, కేసు నమోదైన 24 గంటల్లోనే కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని, కానీ రాష్ట్ర గవర్నర్ ఈ కేసు విచారణకు అనుమతి ఇచ్చారని తెలంగాణ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల రొహత్గి వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న అనంతరం కేటీఆర్ పిటిషన్‌ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు వెల్లడించింది.

ఇదిలా ఉంటే గురువారం అంటే జనవరి 16న కేటీఆర్.. ఈడీ విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే ఏసీబీ విచారణకు ఈనెల 9న కేటీఆర్ ముగించుకున్నారు. మరోసారి కావాలన్న విచారణకు హాజరవుతానని, కేసు విషయంలో దర్యాప్తు సంస్థలకు పూర్తి సహకారం అందిస్తానని చెప్పారు. అదే విధంగా తనను ప్రశ్నించడానికి ఏసీబీ దగ్గర ప్రశ్నలు లేవని, ఒకటే ప్రశ్నను పదేపదే అడిగారని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పుచేతల్లోనే దర్యాప్తు సంస్థలు తనను విచారిస్తున్నాయన్న తరహాలో కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరి ఈసారి ఈడీ విచారణపై ఆయన ఎలా స్పందిస్తారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. దానికి తోడు సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో జోక్యం చేసుకోమని తేల్చి చెప్పేయడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశమైంది. 



Tags:    

Similar News