జనవాసాల్లోకి చిరుతలు, పులుల దూకుడు...తెలంగాణలో కలకలం
వన్యప్రాణుల సంచారంతో రైతులు, గ్రామస్థుల భయాందోళనలు
By : Saleem Shaik
Update: 2025-10-03 12:31 GMT
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చిరుతలు, పులులు జనవాసాల్లోకి రావడం అటవీ గ్రామాల ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతోంది. గండ్రెడ్డిపల్లి నుంచి మంచిర్యాల వరకు, కామారెడ్డి నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా వరకు… అడవుల్లో సంచరించే వన్యప్రాణులైన పులులు, చిరుతలు పంట పొలాల్లో, రోడ్లపై, పశువుల పాకల్లో ప్రత్యక్షమవుతున్నాయి.మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో చిరుతలు, పులుల సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేపుతోంది. రైతులు పొలాలకు వెళ్లేందుకు జంకుతుండగా, పశువుల కాపరులు అడవుల్లోకి పశువులను మేపడానికి వెళ్లడం మానేశారు.
గండ్రెడ్డిపల్లిలో చిరుత కలకలం
మెదక్ జిల్లా తూప్రాన్ మండల గండ్రెడ్డిపల్లి శివార్లలో దసరా పండుగ సందర్భంగా గ్రామస్థులు పాలపిట్ట చూడటానికి వెళ్లి చిరుతను చూశారు.చిరుతను చూసిన గండ్రెడ్డిపల్లి గ్రామస్థులు అడవి అంచున రాతి కొండపై కూర్చొని గాండ్రించిన చిరుతను వారి మొబైల్ ఫోన్లలో చిత్రీకరించి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లో వైరల్ అయ్యాయి.
పంట పొలాల్లోకి అడుగు పెట్టిన చిరుతలు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలో పంట పొలాల్లో చిరుత సంచారం చోటుచేసుకుంది. రైతులు పొలాలకు వెళ్లడానికే భయపడుతుండగా, పోలీసులు రాత్రివేళ బయటకు రాకూడదని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
మహారాష్ట్ర పులి సంచారం
మహారాష్ట్ర సరిహద్దు నుంచి మంచిర్యాల జిల్లాలోకి ప్రవేశించిన పులి పశువులపై దాడులు చేసింది. కాసిపేట, బెల్లంపల్లి, తిర్యాణి మండలాల అటవీ గ్రామాల్లో ఆవులు, దూడలను బలి తీసుకుంది. రోడ్లపైనే పులి ప్రత్యక్షమవడంతో వాహనచోదకులు వణికిపోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ పులి అడుగుల ముద్రలు ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి.దేవాపూర్, ధర్మారావుపేట అటవీ గ్రామాల్లో మూడు ఆవులు, దూడలపై పులి దాడి చేసింది. పులి కదలికలపై అటవీశాఖ అధికారులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు, ఎనిమల్ ట్రాకర్లు పర్యవేక్షిస్తున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోనూ రోడ్డుపై పులి కనిపించింది. సింగరాయపేట- దొంగపెళ్లి రోడ్డు పక్కన పులి గాండ్రిస్తూ కనిపించటంతో వాహనచోదకులు వణికిపోయారు.
ప్రజల్లో భయం.. అటవీశాఖ అప్రమత్తం
వన్యప్రాణులైన పులులు, చిరుతలు అటవీ గ్రామాల్లో సంచరిస్తుండటంతో రైతులు పొలాల్లోకి, పశువుల కాపరులు అడవుల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. అటవీశాఖ అధికారులు తక్షణ చర్యలు తీసుకుంటూ, గ్రామస్థులకు జాగ్రత్తలు సూచిస్తున్నారు.
జనవాసాల్లోకి చిరుతపులులు ఎందుకు వస్తున్నాయంటే...
అడవుల్లో ఉండాల్సిన చిరుతపులులు, పులుల ఆవాసాల్లో అలజడి వల్ల అవి గ్రామాల బాట పడుతున్నాయని తెలంగాణ అటవీశాఖ వన్యప్రాణి విభాగం ఓఎస్డీ ఎ.శంకరన్ ఫెడరల్ తెలంగాణకు చెప్పారు. అడవుల్లో చిరుతపులులకు కావాల్సిన ఆహారం, నీరు కొరవడంతో అవి గ్రామాల్లోకి వచ్చి మేకల మందలపై పడుతున్నాయి. అటవీ ప్రాంతాల్లోని గుట్టలు, లోయల్లో మైనింగ్ కార్యక్రమాలు చేపడుతుండటం వల్ల పేలుళ్ల శబ్దాలకు పులులు, చిరుతలు బెదిరిపోయి అటవీగ్రామాల వైపు వస్తున్నాయని శంకరన్ చెప్పారు. అడవిలో వన్యప్రాణులకు, వాటి ఆవాసాలకు ప్రజలు, గొర్ల కాపరుల నుంచి ఆటంకం కలుగుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వన్యప్రాణులు, ప్రజల మధ్య సంఘర్షణను నివారించేందుకు తమ అటవీశాఖ టైగర్ సెల్ ఆధ్వర్యంలో చర్యలు చేపడతామని శంకరన్ వివరించారు. అడవిలో చిరుతలు, పులులకు కావాల్సిన జింకలు, అడవి పందులు ఉండేలా చూడటంతో పాటు నీటి వనరులను కల్పిస్తామని చెప్పారు. “అడవుల్లో ఆహారం తగ్గిపోవడం, నీటి వనరులు ఎండిపోవడం వల్లే వన్యప్రాణులు జనవాసాల్లోకి వస్తున్నాయి.” అని ఎ.శంకరన్ వ్యాఖ్యానించారు.
ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి
మెదక్ జిల్లాలో చిరుతపులి అటవీ గ్రామం అంచున గుట్టపైకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు భయపడకుండా జాగ్రత్తగా ఉండాలని, వన్యప్రాణులను ప్రేరేపించకూడదని నెహ్రూ జూ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం.ఏ.హకీం ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. చిరుత పులుల ఆవాసాలు దెబ్బతినడం, అడవులు అంతరించి పోవడం, వాటికి ఆహారం లభించక పోవడం వల్ల అవి జనవాసాల్లోకి వస్తున్నాయని హకీం తెలిపారు. మేటింగ్ సీజనులో హీటెక్కి మగ చిరుత తోడు కోసం వెతుక్కుంటూ గ్రామాల్లోకి వస్తుంటాయని ఆయన చెప్పారు. చిరుతలు, పులులకు అడవిలో ఆటంకం కల్పించవద్దని ఆయన సూచించారు.
పులి కదలికలపై ప్రత్యేక బృందాల ఆరా
మంచిర్యాల అటవీ గ్రామాల్లో పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. పులి సంచారం వల్ల ప్రజలకు ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని అటవీశాఖ అధికారి కారం శ్రీనివాస్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ‘‘పులి కదలికలను ప్రత్యేక టీములు మానిటర్ చేస్తున్నాయి. అవసరమైతే ట్రాంక్విలైజ్ చేసి అడవిలోకి వదిలేస్తాం’’ అని ఆయన పేర్కొన్నారు.
మనుషులు, వన్యప్రాణుల సంఘర్షణ ఫలితమే...
అడవిలోపలకు ప్రజలు వెళ్లి వన్యప్రాణుల నివాసాలకు ఆటంకం కల్పిస్తుండటంతో చిరుతలు జనవాసాల్లోకి వస్తున్నాయని వాయిస్ ఆఫ్ నేచర్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివకుమార్ వర్మ చెప్పారు. ‘‘మెదక్ జిల్లాలో చిరుత పులి సంచారం మనిషులు-వన్యప్రాణుల సంఘర్షణ ఫలితం. అటవీ ప్రాంతాల్లో రోడ్లు, మైనింగ్ కార్యక్రమాలు చేపట్టడం వల్ల వన్యప్రాణులను జనవాసాల్లోకి వచ్చేలా చేస్తున్నాయి’’అని శివకుమార్ వర్మ చెప్పారు.
ప్రజలు –వన్యప్రాణుల మధ్య సంఘర్షణను ఎలా నివారించాలి?
చిరుతపులులు, పులులు అటవీ గ్రామాల్లో వస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అటవీ గ్రామాల్లోకి ప్రజలు రాత్రివేళ ఒంటరిగా బయటకు రావద్దని అటవీశాఖ అధికారులు సూచించారు.పశువులను అడవిలోకి తీసుకెళ్లరాదని వారు కోరారు. వన్యప్రాణులను దగ్గరగా వెళ్లి వీడియో తీయవద్దని అధికారులు సలహా ఇచ్చారు.అడవులను సంరక్షించి వన్యప్రాణులు వాటి ఆవాసాల్లోనే ఉండేలా చూడాలని కోరారు.